తస్మాత్‌ జాగ్రత్త...!

ABN , First Publish Date - 2020-12-15T06:16:13+05:30 IST

వింత వ్యాధికి లోహ కాలుష్యం కూడా ఒక కారణం కావచ్చనేది కొందరు శాస్త్రవేత్తల ప్రతిపాదన. ఆహారం ద్వారా పురుగుమందులు, ఎరువుల అవశేషాలు, పరిశ్రమలు విడుదల చేసే విషపూరిత వాయువులు.

తస్మాత్‌ జాగ్రత్త...!

ఏలూరులో వెలుగులోకి వచ్చిన 

వింత వ్యాధికి లోహ కాలుష్యం కూడా ఒక కారణం కావచ్చనేది కొందరు శాస్త్రవేత్తల ప్రతిపాదన.  ఆహారం ద్వారా పురుగుమందులు, ఎరువుల అవశేషాలు, పరిశ్రమలు విడుదల చేసే విషపూరిత వాయువులు.. ఇలా లెక్కలేనన్ని మార్గాల్లో ప్రమాదకర లోహాలు మన శరీరంలోకి చేరుతున్నాయి. అలాంటప్పుడు ‘ఏలూరును పోలిన దుస్థితి ఎదురవకుండా ఉండాలంటే అప్రమత్తంగా వ్యవహరించక తప్పదు’ అంటున్నారు ఎన్‌.ఐ.ఎన్‌ శాస్త్రవేత్త దినేష్‌ కుమార్‌!


సీసం, కాడ్మియం, పాదరసం... ఈ లోహాలు శరీరానికి నిరుపయోగం. అయినా మన శరీరాల్లో 25 మైక్రోగ్రాముల వరకూ సీసం ఉంటోంది. ఈ పరిమితి మించేకొద్దీ శరీరం మీద ఈ లోహం దుష్ప్రభావాలు మొదలవుతాయి. నిజానికి ఈ స్వల్ప మోతాదు సీసం కూడా ఒకేసారి శరీరంలోకి చేరినది కాదు. సుమారు 20 ఏళ్ల పాటు పలు మాధ్యమాల ద్వారా (లెడ్‌ కలిసిన పెట్రోల్‌, బ్యాటరీలు) ఈ లోహానికి ఎక్స్‌పోజ్‌ అవుతూ ఉండడం మూలంగా, ఈ మాత్రం సీసం మన శరీరాల్లో సహజంగానే నిక్షిప్తమై ఉంటోంది. గాలి, నీరు, నేల... ఈ మూడు మాధ్యమాల ద్వారా ప్రమాదకర లోహాలు శరీరంలోకి చేరిపోతూ ఉంటాయి. ఈ పరిమాణం మరింత పెరిగితే లోహ కాలుష్యానికి లోనై, కొద్దిపాటి నుంచి తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ లోహం వేర్వేరు మార్గాల్లో, వేర్వేరు రూపాల్లో మన ఒంట్లోకి చొరబడుతూ ఉంటుంది. అవేమిటంటే...


ఫ్యాక్టరీలు: వ్యర్థాలను విడుదల చేయని ఫ్యాక్టరీ ఉండదు. ఆ వ్యర్థాలు, నీటిలో, నేలలో కలిసి, పంటలు కలుషితం అవుతూ ఉంటాయి. 


బొమ్మలు: పిల్లల ఆట వస్తువులైన పలు రకాల రబ్బరు బొమ్మల్లో సీసం అంతరగ్గతంగా ఉంటుంది.


బ్యాటరీలు: అనధికారికంగా బ్యాటరీలు తయారుచేసే షాపుల ద్వారా సీసం నేలలో కలుస్తూ ఉంటుంది.


గృహోపకరణాలు: విద్యుత్‌ ఉపకరణాల సోల్డరింగ్‌ కోసం సీసం వాడుతూ ఉంటారు.


పళ్లు, కూరగాయలు: కలుషితమైన పరిసరాల్లో పెరిగిన కూరగాయలు, పండ్లలో సీసం చేరుతుంది.


పాలు, పాల ఉత్పత్తులు: సీసం కలిసిన నీటితో పెరిగిన కలుషిత గడ్డి తినడం ద్వారా పశువుల్లోకి, వాటి పాల ద్వారా మన శరీరాల్లోకి సీసం చేరే వీలుంది.


మాంసాహారం: కలుషిత నీరు, గ్రాసం ఆహారంగా తీసుకున్న పశువులు, మేకల్లో సీసం స్థాయి పెరుగుతుంది. వాటి మాంసంలోనూ సీసం ఉంటుంది.


చేపలు: పాదరసం కలిసిన చెరువుల్లో పెరిగిన చేపల్లో ఈ లోహం చేరుతుంది.


నీళ్ల పైపులు: ఇంట్లో వాడే పైప్‌ లైన్లు, పెయింట్ల తయారీలోనూ సీసం కలిసి ఉంటుంది.


పురుగుమందుల్లో, ఎరువుల్లో..

పురుగుమందుల తయారీలో ఉత్ర్పేరకంగా సీసం, నికెల్‌, పాదరసం వంటి లోహాలను వాడతారు. ఇవి నేరుగా పురుగుమందుల్లోకి చేరకపోయినా వ్యర్థాల రూపంలో మట్టిలో, నీటిలో కలుస్తూ ఉంటాయి.  విషవాయువుల రూపంలో గాలిలోనూ కలుస్తాయి. అలాగే  ఆర్గానోఫాస్ఫరస్‌, ఆర్గానో క్లోరీన్‌, హెర్బిసైడ్స్‌ వంటి పురుగు మందులు పరిమితి మించితే ఆరోగ్యానికి చేటు చేసేవే! అయితే ఈ రసాయనాలు కలిసి ఉండే ఎరువులు, పురుగుమందులను సరైన మోతాదుల్లో నీటితో కలిపి వాడితే ఏ ప్రమాదం ఉండదు. కానీ అధిక దిగుబడి కోసం, పంట త్వరగా ఎదగడం కోసం వీటిని ఎక్కువ మోతాదుల్లో నీటిలో కలిపి వాడుతుంటారు. దాంతో ప్రమాదకర రసాయనాలు, పాదరసం ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరుతుంటాయి. 


ఈ జాగ్రత్తలు తప్పనిసరి

శ్వాస, ఆహారం, నీరు, చర్మం... వీటి ద్వారా ప్రమాదకర రసాయనాలు, మరీ ముఖ్యంగా సీసం మన శరీరంలోకి చేరుతుంది. అలా జరగకూడదంటే...

 పీల్చే గాలి నుంచి రక్షణ కోసం ముక్కుకు మాస్క్‌ ధరించాలి.


 కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు శుభ్రంగా కడిగిన తరువాతే వాడుకోవాలి.

 

 చేతులు తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.


 కూరగాయలు ఏ ప్రాంతంలో పండుతున్నాయో, మాంసం ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో తెలుసుకున్న తరువాతే కొనాలి.


 ఫ్యాక్టరీలకు కనీసం 40 కి.మీటర్ల దూరంలో నివాసం ఉండేలా చూసుకోవాలి.


 పాలు, పాల ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తుల నాణ్యత పరీక్షించుకోవాలి.


‘నకిలీ’ పని పడదాం! 

సింథటిక్‌ పాలు:  ఇవి కృత్రిమ పాలు. యూరియా ప్రధాన వస్తువుగా ఉపయోగించి తయారుచేసే సింథటిక్‌ పాలు ఆరోగ్యానికి హానికరం. అయితే ఈ పాలను కనిపెట్టడం కొంచెం కష్టమే. వీటిల్లో మంచి బ్యాక్టీరియా బతికే వీలు లేదు కాబట్టి పాలు తోడు పెడితే పెరుగుగా మారదు. కాబట్టి లాక్టోమీటరు సహాయంతో నకిలీ పాలను గుర్తించాలి.


పసుపు, కారం: వీటిలో లెడ్‌ పెయింట్‌ పొడి కలుపుతారు. ఈ లోహాలు కలిసిన పసుపు, కారం నీటిలో పూర్తిగా కరగవు. తేలతాయి.

అల్యూమినియం ఫాయిల్‌: స్వీట్ల తయారీలో సిల్వర్‌ ఫాయిల్‌ బదులుగా అల్యూమినియంతో తయారైన ఫాయిల్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని నీటిలో వేస్తే ఉండలా మారుతుంది.


బయటపడే లక్షణాలు!

హెవీ మెటల్‌, పెస్టిసైడ్‌ పాయిజనింగ్‌ లక్షణాలు తీవ్రతను బట్టి భిన్నంగా ఉంటాయి. శరీరంలో వీటి స్థాయి పెరిగేకొద్దీ లక్షణాల తీవ్రత పెరుగుతుంది. అక్యూట్‌, క్రానిక్‌, సబ్‌ క్రానిక్‌... ఈ మూడు దశల్లో కనిపించే లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. అక్యూట్‌ పాయిజనింగ్‌లో అయోమయం, వాంతులు, ఫిట్స్‌, లాలాజలం ఊరడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా హెవీ మెటల్‌ పాయిజనింగ్‌కు గురైన 12 ఏళ్ల లోపు పిల్లల్లో జ్ఞాపకశక్తి, తెలివితేటలు తగ్గిపోతాయి. అలాగే రక్తం తయారయ్యే వ్యవస్థను దెబ్బతీసి రక్తహీనతను కలిగిస్తాయి. అలాగే మూత్రపిండాలు దెబ్బతిని రీనల్‌ ఫెయిల్యూర్‌ తలెత్తే ప్రమాదమూ ఉంటుంది. రక్తపోటు కూడా పెరుగుతుంది. అయితే ఈ లక్షణాలన్నీ శరీరంలో లోహం పరిమాణం 40 నుంచి 80 మైక్రోగ్రాములకు చేరుకున్న తర్వాతే బయల్పడతాయి కాబట్టి ఆ పరిమితికి చేరకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి. 


జంతువులను గమనించాలి!

నివాస ప్రాంతాల్లో కాలుష్యం పరుచుకుందనే విషయం ఆ పరిసరాల్లో తిరిగే జంతువుల నడవడికను బట్టి పసిగట్టవచ్చు. ఆ ప్రాంతంలోని వీధికుక్కలు, పశువులు, పందులు వెనకకాళ్లు చచ్చుబడినట్టు ఈడుస్తూ నడుస్తుంటే, అది విషపూరిత రసాయనాల ప్రభావమని గ్రహించాలి. కాలుష్యానికి కారణమవుతున్న రసాయనాలు, లోహాల మూలాలను కనిపెట్టి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి.


సీసం శరీరంలో ఆరున్నరేళ్ల పాటు తిష్ఠ వేస్తుంది. ఎముకల్లో ఇరుక్కుని ఎర్ర రక్తకణాల తయారీని అడ్డుకుంటూ రక్తహీనతను కలిగిస్తుంది.


వీటికి దూరం పాటించండి!

ఫ్యాక్టరీ: తెల్లని పొగ వదిలే ఫ్యాక్టరీలకు దూరంగా ఉండాలి. తెల్లని పొగ సీసం కాలుష్యానికి సూచన. 

డంపింగ్‌ యార్డ్‌: పోగయ్యే చెత్త ఎండలకు ఎండిపోయినట్టు కనిపించినా, వానలు పడడంతో కరిగి నేలలో కలుస్తుంది. దాంతో దానిలోని సీసం కూడా నేలలో కలుస్తుంది.


డాక్టర్‌ బి.దినేష్‌ కుమార్‌,

సీనియర్‌ శాస్త్రవేత్త,

ఎన్‌.ఐ.ఎన్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌)

Updated Date - 2020-12-15T06:16:13+05:30 IST