బ్యాంక్ మేడమ్!
ABN , First Publish Date - 2020-05-18T06:36:37+05:30 IST
గ్రామస్థులకు ఇబ్బంది కలగకూడదని కరోనా కాలంలోనూ ఊరూరు తిరిగి బ్యాంకు సేవలందిస్తున్నారు సలామీ షషాంకర్. ఒడిశా కోరాపూట్ జిల్లాలోని తోయాపూట్ అనే మారుమూల గిరిజన గ్రామం ఆమెది. డిగ్రీ దాకా చదివి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్మీపురం శాఖలో...

గ్రామస్థులకు ఇబ్బంది కలగకూడదని కరోనా కాలంలోనూ ఊరూరు తిరిగి బ్యాంకు సేవలందిస్తున్నారు సలామీ షషాంకర్. ఒడిశా కోరాపూట్ జిల్లాలోని తోయాపూట్ అనే మారుమూల గిరిజన గ్రామం ఆమెది. డిగ్రీ దాకా చదివి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్మీపురం శాఖలో ‘కస్టమర్ సర్వీస్ పాయింట్ ఎగ్జిక్యూటివ్’ హోదాలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లి అక్కడి ప్రజలకు బ్యాంక్ సేవలు అందిస్తున్నారు. ఆమె బ్యాగులో వేసుకొనివెళ్లేది ల్యాప్‌టాప్ అయినా గిరిజనులకు మాత్రం అదే బ్యాంక్. బ్యాంకును వారి గుడిసె ముందుకే తెచ్చిన ఆమె వారికి బ్యాంక్ మేడమ్. ఆమెను చూడగానే ‘‘బ్యాంక్ మేడమ్ వచ్చారు డబ్బులు తీసుకోవాలనుకునే వాళ్లందరూ రండి’’ అని గ్రామస్థులు ఒకరికి ఒకరు తెలియజెప్పుకుంటారు. అంతే! ముఖానికి మాస్కులు కట్టుకొని వచ్చి ఆమె ముందు వరుసలో నిల్చుంటారు. వారి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. గ్రామాల్లో కూర్చోవడానికి కుర్చీలు, బల్లలు లేకపోయినా ఆమె పట్టించుకోదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల నగదు, గ్యాస్ రాయితీలు ఆమె ద్వారానే గ్రామస్థ్తులకు అందుతాయి.
సలామీ తనతో పాటు 70 దాకా నగదు డిపాజిట్, విత్‌డ్రాయల్ స్లిప్పులు, ల్యాప్‌టాప్, పెన్ను, రిజిస్టర్ బుక్, 40 వేల రూపాయల డబ్బు, హ్యాండ్ శానిటైజర్ ప్రతిరోజూ వెంట తీసుకెళతారు. కరోనా సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆమె పనిచేస్తున్నారు. ఏదైనా గ్రామం వెళ్లగానే అక్కడ ఖాళీ స్థలం చూసుకుంటారు. రాలిపడిన ఆకులు ఏరితెచ్చి మూడు అడుగుల పొడవున గీతలా పోస్తారు. గ్రామస్థులు ఎవరూ ఆ ఆకుల కట్ట దాటి రారు. ఆమె తన ల్యాప్‌టాప్, డబ్బుల సంచిని పక్కన పెట్టుకొని ఒక్కో ఖాతాదారుడికి నగదును అందజే స్తుంటారు. ఆమె పొద్దున్నే 8 గంటలకు ఇంటినుంచి బయల్దేరతారు. అందుకే ఆమె భోజనం వెంట తీసుకెళ్లరు. ఏ ఊరు వె ళ్లినా అక్కడి గ్రామస్థులే తినటానికి ప్రేమతో బిస్కెట్ ప్యాకెట్లు, స్వీట్లు, మంచినీళ్లు సలామీకి తెచ్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు బ్యాంకుకు వెళ్లి లెక్కలు అప్పజెబుతారు. 10 గ్రామాలకు చెందిన వెయ్యిమందికి అత్యవసర సమయాల్లో ఆమె ద్వారా నగదు అందుతోంది. ప్రతి రోజూ ఒంటిచేత్తో 250 మంది ఖాతాదారులకు సేవలందిస్తారు. గిరిజన గ్రామాలు కావడంతో సరైన రోడ్డు ఉండదు. కొన్నిసార్లు ఆమె నడిచివెళ్లాల్సివస్తుంది. ఒంటరిగానే 8 కిలోమీటర్ల దూరం నడిచివెళ్లొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ‘‘నేను ప్రజలకు మేలు చేస్తున్నాను కాబట్టి నాకు చెడు జరగదు అనేది నా నమ్మకం. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది’’ అంటారు సలామీ.