కరోనా కాలపు కథా శోభ!
ABN , First Publish Date - 2020-06-23T05:30:00+05:30 IST
‘‘ఇంతకుముందెప్పుడూ లేని దాదాపు అధివాస్తవికంగా అనిపించే ఈ ప్రపంచ సంక్షోభం మీద స్పందించడానికి అనేక మార్గాలున్నాయి.

ఈ కరోనా కాలంలో ప్రతి వ్యక్తిదీ ఒక కథ.
సమష్టిగా సమాజంలో ప్రతి సమూహానిదీ మరో కథ.
ప్రతి దేశానికీ ఒక్కొక్క కథ. వెరసి ప్రపంచమంతా చెబుతున్న సరికొత్త కథ.
లాక్‌డౌన్ సమయంలో మారుతున్న మానవ సంబంధాలకూ, వ్యక్తిగత, సామాజిక భావోద్వేగాలకు ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ శోభా డే
అక్షర రూపం ఇచ్చారు. ఈ-బుక్స్‌గా వస్తున్న
‘లాక్‌డౌన్ లియజాన్స్’ వెనుక కథేమిటో
ఆమె మాటల్లోనే విందాం...
‘‘ఇంతకుముందెప్పుడూ లేని దాదాపు అధివాస్తవికంగా అనిపించే ఈ ప్రపంచ సంక్షోభం మీద స్పందించడానికి అనేక మార్గాలున్నాయి. నేను ఎంచుకున్న మార్గం... కథలు రాయడం! మన వ్యక్తిగత పరిధులనూ, మన సొంత ప్రపంచాల్నీ దాటి ఆలోచించక తప్పని పరిస్థితిని దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ తీసుకొచ్చింది. అర్థరహితమైన పరిస్థితుల్లో, సందర్భాల్లో తరచూ సందర్భశుద్ధి వెతికేలా చేసింది.
‘లాక్‌డౌన్ లియజాన్స్’ సీరీస్‌లోని కథలన్నీ ఒక అవస్థ చుట్టూ తిరుగుతాయి. దాన్ని నేను ‘లాక్‌డౌన్ సిండ్రోమ్’ అంటాను. అది ప్రపంచ ప్రజల్లో అన్ని స్పందనలనూ ప్రేరేపించింది. మొదట మనం గందరగోళంలో పడిపోయాం. తరువాత ఆ గందరగోళం కాస్తా అభద్రతగా మారిపోయింది. ఇలాంటి కల్లోల కాలంలో నేను అనుభవిస్తున్న దాన్ని గట్టిగా వ్యక్తీకరించాల్సిన అవసరం ఉందనిపించింది. ఇది కనీవినీ ఎరుగని ఉత్పాతం. ఇలాంటి ప్రత్యేకమైన కాలం గురించి నా పద్ధతిలో నేను చెబుతున్న కథలివి. కరోనా వల్ల సమాజం మీద పడిన ఐసొలేషన్ కాలంలో... తెగిపోయిన, పెనవేసుకున్న మానవ సంబంధాలను వీటిలో విశ్లేషించాను
ఈ అనుభవాలు అందరివీ...
ఈ కథల్లో ఉన్నవి నా వ్యక్తిగత అనుభవాలే కాదు... మొత్తం లోకమంతా అనుభవిస్తున్న విషయాలు. ‘లౌక్‌డౌన్ లియజాన్స్’ చిన్న కథల సంకలనాలు. ఇవి పురుషులూ, మహిళలూ, యువతరం, వయోధికులు, ధైర్యవంతులూ, పిరికివాళ్ళూ, సంతోషంగా గడిపేవాళ్ళూ, ప్రతిదానికీ కుంగిపోయేవాళ్ళూ... ఇలా అన్ని రకాల వ్యక్తుల దృక్పథాలనూ ప్రతిబింబిస్తాయి. కరోనా, లాక్‌డౌన్, ఐసొలేషన్... ఈ అనివార్యతలూ మానవ సంబంధాలను ఇప్పుడు పునర్నిర్వచిస్తున్నాయి. కరోనా కాలంలో ఆ సంబంధాలు ఎంత సున్నితంగా, దుర్భలంగా మారుతున్నాయో, అవి చెబుతాయి.
వందల కిలోమీర్ల దూరంలోని స్వగ్రామానికి చేరుకోవడానికి ఒక వలస కార్మికుడు తీసుకున్న నిర్ణయం, వితంతువు అయిన సహకార్మికురాలితో వలస కార్మికుడి భావోద్వేగ సంబంధం, ఆగిపోయిన పెళ్ళిళ్ళు, వేడుకల కొత్త రూపాలు... ఇలా ‘కొవిడ్-19’ సమాజంలోని వివిధ వర్గాల్లో కలిగించిన మానసిక కల్లోలాలు, పరిస్థితులకు అనుగుణంగా మారడం కోసం పడే ఘర్షణలు.. ఈ కథల్లో ఉన్నాయి. కానీ ఈ కథలన్నిటినీ కలిపే అంతస్సూత్రం ఒక్కటే.. ప్రేమ!
మార్పు ముంగిట వైవాహిక వ్యవస్థ!
అంతేకాదు, సంతోషంగా లేని వైవాహికబంధాలూ, ఆడా, మగ విభజన, పురుషులు సాగించే వేధింపులూ ఈ కథల్లో కనిపిస్తాయి. ‘సాన్నిహిత్యం’ అనే మాటకు అర్థాన్ని చాలా యువ జంటలు మరచిపోయాయని నేను నమ్ముతున్నాను. వాళ్ళ సంబంధాలు జీవరహితంగా, కేవలం ఒక లావాదేవీలా కనిపిస్తున్నాయి. భావోద్వేగాలు, భౌతిక అనుబంధాలూ తక్కువైపోయాయి. వాళ్ళ జీవితాలను కెరీర్ లక్ష్యాలూ, కన్జూమరిజం కబళించేస్తున్నాయి. ఈ ‘కొవిడ్-19’ సమయంలో మహిళల్లో భౌతికంగా, భావోద్వేగపరంగా చిక్కుకుపోయామనే భావన ఎక్కువగా కనిపిస్తోంది.
వారికి ఇంటి పనులు చేసుకోవడం, పిల్లలను చదివించడం, ఇతర పనులు చక్కబెట్టుకోవడం తలకు మించిన భారం అవుతోంది. ఈ సమయంలో వాళ్ళ ఆలోచనల్లో సెక్స్‌కు ఉండే ప్రాధాన్యం చాలా తక్కువ. ఈ రోజున మహిళలు జీవితం నుంచీ, వివాహ బంధం నుంచీ మరింత ఆశిస్తున్నారు. జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని హడావిడిగా కాకుండా తెలివిగా తీసుకునే దృక్ఫథాన్ని ఈ లాక్‌డౌన్ సమయం ఆమెకు అందిస్తుంది.
భవిష్యత్తు డిజిటల్ పుస్తకాలదే!
మొదటి పుస్తకం (లీవింగ్ అండ్ అదర్ స్టోరీస్)లోని కథలు ఈ సంక్షోభానికి నా తక్షణ స్పందన. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లాక్‌డౌన్ క్రానికల్స్’ పేరుతో అరవై ఎపిసోడ్స్ రాశాను. అవి ముగిసిన చోట ఆ పుస్తకం మొదలవుతుంది. మన వ్యక్తిగన పరిధికి అవతల ఏం జరుగుతోందో వివరంగా చెప్పడానికి కథారూపం చక్కటి రూపం అని అనిపించింది. వీటిని నేనో రాక్షసిలా రోజుకు రెండువేల పదాల వరకూ రాశాను. మొదట ఈ కథలను ప్రచురించాలని అనుకోలేదు. ఆ తరువాత అనిపించింది, ఈ మీమాంసల్లో కొన్నయినా నా పాఠకులకు అనుభవంలోకి వచ్చి ఉండొచ్చని! మా పబ్లిషర్లతో మాట్లాడాక, ఈ-బుక్‌ల రూపంలో వీటిని తీసుకురావాలనుకున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో సృజనాత్మక రచనలను విక్రయించే బుక్ షాప్‌లకు మనుగడ లేదనీ, చాలావరకు మూత పడ్డాయనీ విన్నాను. నేను చెప్పేదొకటే! రచయితలు రాస్తూనే ఉంటారు. పాఠకులు చదువుతూనే ఉంటారు. అయితే భవిష్యత్తు డిజిటల్ పుస్తకాలదే! ప్రచురణ రంగ ముఖచిత్రాన్ని ఈ-బుక్స్ మార్చనున్నాయి.’’
వారానికో సంకలనం
‘లాక్‌డౌన్ లియజాన్స్’ సిరీస్‌లో మొదటి పుస్తకం ‘లీవింగ్ అండ్ అదర్ స్టోరీస్’... మే 20న విడుదలైంది. ఆ తరువాత వారానికి ఒకటి చొప్పున ‘నో లవ్ లాస్ట్ అండ్ అదర్ స్టోరీస్’, ‘వెడ్డింగ్ క్యాన్సిల్డ్ అండ్ అదర్ స్టోరీస్’ సంకలనాలు వరుసగా వచ్చాయి. నాలుగో సంకలనం ‘బీచ్ హౌస్ బర్త్ డే అండ్ అదర్ స్టోరీస్’... ఈ నెల 21న విడుదలైంది. వీటిని ‘సిమన్ ఛెస్టర్’ ఇండియా సంస్థ ప్రచురిస్తోంది. మరిన్ని త్వరలో రానున్నాయి.