మగవారి ప్రకటనలకు అర్థాలే వేరులే..!
ABN , First Publish Date - 2020-12-06T17:47:49+05:30 IST
టోక్యో, సియోల్, బీజింగ్‌లలో పెద్ద పెద్ద హోర్డింగ్‌లలో కాస్మొటిక్స్ అడ్వర్టయిజ్‌మెంట్స్ కనువిందు చేస్తాయి.

టోక్యో, సియోల్, బీజింగ్‌లలో పెద్ద పెద్ద హోర్డింగ్‌లలో కాస్మొటిక్స్ అడ్వర్టయిజ్‌మెంట్స్ కనువిందు చేస్తాయి. అందులో అందమైన యువతులు కనిపిస్తారు అనుకుంటే పొరపాటే. అన్నిచోట్లా మగపుంగవులే దర్శనమిస్తున్నారు. మహిళలు వాడే సౌందర్య ఉత్పత్తులకు ఆయా దేశాలలో ప్రచారకర్తలు పురుషులే. ఇదే అక్కడ లేటెస్ట్ ట్రెండ్..
ఒకప్పుడు మా సౌందర్య ఉత్పత్తులు వాడితే మీ అందం రెట్టింపవుతుంది అని యువతులను ఆకర్షించడానికి చక్కని చుక్కలాంటి అమ్మాయిలని చూపిస్తూ వాణిజ్య ప్రకటనలు చేసేవారు. ఇప్పుడు... చైనా, జపాన్, కొరియా లాంటి దేశాల్లో మాంచి ఉమెన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, పాప్ సింగర్‌లతో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నాయి సంస్థలు. అతడు తన చేతిలో లిప్‌స్టిక్‌ను పట్టుకుని ‘ఇది అదుర్స్’ అంటున్నాడు. అంతే...! ఆ బ్రాండ్ లిపిస్టిక్ కోసం అమ్మాయిలు క్యూ కడుతున్నారు. ‘నాకు బాయ్‌ఫ్రెండ్ అంటూ ఉంటే ఆ హీరోలా ఉండాలని కోరుకుంటాను. అతడే స్వయంగా ఈ లిప్‌స్టిక్ అదుర్స్ అంటున్నాడంటే... అచ్చం నా బాయ్‌ఫ్రెండ్ చెబుతున్నట్టే ఉంది’ అని మురిసిపోతున్నారు ముద్దుగుమ్మలు. ఓరకంగా యువతుల మనసుకు నప్పేలా తమ కమర్షియల్స్ ఉండేలా ప్రణాళికలు వేస్తున్నాయి కంపెనీలు. ఒక్క 2018లో 18 సౌందర్య ఉత్పత్తులకు మేల్ సెలబ్రిటీలనే బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నాయట చైనా కంపెనీలు. ఈ మోడళ్లందరూ పాతికేళ్లలోపు వాళ్లే కావడం విశేషం.
లి జియాకి చైనాలో సూపర్ సేల్స్‌మెన్‌గా పేరు. గలగలా మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేస్తుంటాడీ ఇరవై ఎనిమిదేళ్ల కుర్రాడు. కాస్మొటిక్స్‌ను అమ్మడంలో దిట్ట. అయిదు నిమిషాల్లో పదిహేను వేల లిప్‌స్టిక్‌లను అమ్మిన ఘనుడు. మొన్న నవంబరు 11 న జరిగిన ‘సింగిల్స్ డే’లో ఏడు గంటల పాటు నిరవధికంగా ఆడవారి వస్తువులను అమ్మేశాడు. చైనాలో ప్రసిద్ధి చెందిన తావ్‌బావ్ షాపింగ్ యాప్ లైవ్‌లో ఇతడి కార్యక్రమాన్ని 15 కోట్ల మంది ప్రజలు వీక్షించారట. ఇదొక పెద్ద రికార్డు. ‘లి ఏది చెప్పినా కచ్చితంగా చెబుతాడు. మీ స్కిన్‌కు ఈ లిప్‌స్టిక్ వంద శాతం నప్పుతుంది అని అతడు చెబితే ఎంతో నమ్మకంగా అన్పిస్తుంది’ అంటారు యువతులు.
ఆడవారి సౌందర్యోత్పత్తులకు మేల్ మోడల్స్ అనే కాన్సెప్ట్ వాస్తవానికి ఈనాటిది కాదు. జపాన్‌లో 1990లో నటుడు తకువ కిమురాతో లిప్‌స్టిక్ ఓ ప్రకటన చేశాడు. చెంపలపై లిప్‌స్టిక్ చారలతో ఉన్న తకువ ఫోటోను ఓ మ్యాగజైన్‌లో కవర్‌పేజీగా అప్పట్లో వేశారు. రెండు నెలల్లో ఆ కంపెనీ ఉత్పత్తులు మూడింతలు అమ్ముడయ్యాయట. 2014లో ‘లిప్స్ అండ్ బాయ్స్’ పేరుతో టామ్ ఫోర్డ్ బ్యూటీ బ్రాండ్ యాభై రకాల లిప్‌స్టిక్ రంగులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఒక్కో లిప్‌స్టిక్‌కు ఒక్కో మేల్ సెలబ్రిటీ పేరుపెట్టింది. స్టాక్ మొత్తం అమ్ముడుపోయిందట. యువతుల మనస్తత్వం తెలుసుకుని చేస్తోన్న వ్యాపారం ఇదంతా. మన దేశానికీ ఈ ట్రెండ్ తాకుతుందేమో చూడాలి.