ఆకతాయిలకు యాప్‌లాక్‌

ABN , First Publish Date - 2020-02-12T05:43:53+05:30 IST

ఆమె వయసు తొమ్మిదేళ్లు. చదివేది నాలుగో తరగతి. కానీ ఇప్పటికి 40 యాప్‌లు తయారు చేసింది. తాజాగా విద్యార్థులు, యువతకు ఎదరయ్యే దూషణలు, వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు

ఆకతాయిలకు యాప్‌లాక్‌

ఆమె వయసు తొమ్మిదేళ్లు. చదివేది నాలుగో తరగతి. కానీ ఇప్పటికి 40 యాప్‌లు తయారు చేసింది. తాజాగా విద్యార్థులు, యువతకు ఎదరయ్యే దూషణలు, వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు మేఘాలయలోని షిల్లాంగ్‌కు చెందిన మెయిదిబాహున్‌ మాజవ్‌ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. తరగతి గదిలో ఎదురైన ఓ చేదు అనుభవమే ఈ యాప్‌ను అభివృద్ధి చేసేలా ఆమెను పురికొల్పింది. ఒకసారి క్లాస్‌లో కొందరు విద్యార్థులు గ్రూపుగా ఏర్పడి తనను బహిష్కరిస్తున్నామని చెప్పడం... ఓ విద్యార్థి తన కాలిని కాళ్లతో తొక్కి బాధపెట్టిన ఘటనలు మాజవ్‌ను ఆలోచింపజేశాయి.


తన సోదరి, ఇతర విద్యార్థులు కూడా నిత్యం ఇలాంటి హేళనలు, వేధింపులనే ఎదుర్కొంటుండటాన్ని చూసిన మాజవ్‌ వాటిని పాఠశాల యాజమాన్యాలు, తల్లితండ్రులు, పోలీసులు, బాలల సంక్షేమ అధికారులకు నివేదించేలా ఒక యాప్‌ ఉంటే బాగుంటుందని భావించింది. అనుకోవడమే కాదు... చేసి చూపించింది. తల్లి పర్యవేక్షణలో కోడ్స్‌ రాసి, యాంజీ బుల్లీయింగ్‌ యాప్‌కు రూపకల్పన చేసింది. త్వరలోనే ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి రానుంది. 


మేఘాలయ విద్యా మంత్రి ఈ చిన్నారి సృజనకు అబ్బురపడ్డారు. భవిష్యత్తులో మాజవ్‌ బాధ్యతగల పౌరురాలిగా ఎదుగుతుందని అభినందించారు. మాజవ్‌ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి దసుమార్లిన్‌ తైర్ణాలో ఓ రిసార్ట్‌ నడిపిస్తున్నారు. 


‘వైట్‌ హ్యాట్‌ జూనియర్‌ ఛాలెంజ్‌’ కోసం నెల రోజుల్లోనే మాజవ్‌ ఈ యాప్‌ రూపొందించింది. దీని కోసం మొత్తం 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మే నెలలో ఈ ఛాలెంజ్‌ ఫైనల్‌ రౌండ్‌ అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో జరుగుతుంది. అందులో తన ప్రాజెక్ట్‌కు అగ్రస్థానం వస్తుందని మాజవ్‌ ధీమాగా చెబుతోంది.

Updated Date - 2020-02-12T05:43:53+05:30 IST