నేనూ... కొన్ని తప్పులు చేశా!

ABN , First Publish Date - 2020-03-15T06:59:55+05:30 IST

పదిహేనేళ్ళ క్రితం... ఆమె ఓ వర్ధమాన హీరోయిన్‌. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ పెంట్‌ హౌస్‌ నివాసం. వానలో తడిసొచ్చిన అపరిచిత అతిథికి స్వయంగా వేడి టీ చేసి ఇచ్చిన మంచితనం. కట్‌ చేస్తే... ఇప్పుడామె దేశమంతటికీ తెలిసిన దేవసేన... తెలుగింటి రుద్రమదేవి... బాక్సాఫీస్‌ భాగమతి.

నేనూ... కొన్ని తప్పులు చేశా!

పదిహేనేళ్ళ క్రితం... ఆమె ఓ వర్ధమాన హీరోయిన్‌. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ పెంట్‌ హౌస్‌ నివాసం. వానలో తడిసొచ్చిన అపరిచిత అతిథికి స్వయంగా వేడి టీ చేసి ఇచ్చిన మంచితనం. కట్‌ చేస్తే...  ఇప్పుడామె దేశమంతటికీ తెలిసిన దేవసేన... తెలుగింటి రుద్రమదేవి... బాక్సాఫీస్‌ భాగమతి. నాయికా ప్రధాన చిత్రాలంటే... అందరూ చూపించే అరుంధతి. పెరిగిన వయసు, వచ్చిన సూపర్‌ స్టార్‌డమ్‌... ఆమె పలకరింపులో మార్పు తేలేదు. మునుపటి ఆప్యాయత, ఆతిథ్యం మారలేదు. అహంకారం అసలే రాలేదు. అనుష్కా శెట్టి... మంచితనం... స్టార్‌ హోదా మింగేయని సంస్కారం మేళవించిన అరుదైన నటి. పదిహేనేళ్ళలో... ఎన్నో పాత్రలు, ఎందరో మంచి వ్యక్తులు, ఎన్నో జయాపజయాలు... అన్నిటి నుంచి ఎంతో నేర్చుకున్నా అంటారామె. ఎదురైతే తానే పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటారు. మంచి నటిగా కన్నా మంచి మనిషిగా బతకడం ముఖ్యమంటున్న ‘స్వీటీ’తో... సమయం తెలియకుండా.. గడిచిపోయిన ఓ సాయంకాలపు భేటీ... ఈ వారం ‘నవ్య’ స్పెషల్‌.


అనుష్క: హాయ్‌ అండీ! బాగున్నారా... చాలా రోజులైంది కలసి!

బాగున్నాం. మీరెలా ఉన్నారు? ఈ మధ్య బొత్తిగా జర్నలిస్టులతో ఇంటర్వ్యూలు లేవు. 

(నవ్వేస్తూ...) ఆ మధ్య వర్క్‌ నుంచి కొద్దిగా బ్రేక్‌ తీసుకున్నా. అందుకే, కనపడలేదు. దురదృష్టం ఏమిటంటే, ఇవాళ ఎవరూ అవతలివాళ్ళను ఆప్యాయంగా పలకరించడం కరవైంది. కనపడితే చాలు... వృత్తి ఉద్యోగాల కబుర్లు, ఆ సక్సెస్‌లు ఫెయిల్యూర్ల ప్లాస్టిక్‌ ముచ్చట్లే. అవతలివాళ్ళ గురించి అక్కర తగ్గిపోయింది. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి, యోగక్షేమాలు కనుక్కొనే పద్ధతిలోకి వెళ్ళాలి. 


మీ దృష్టిలో ఆరోగ్యం అంటే...?

శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా సమతూకంతో ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. యోగా కూడా చెప్పేది అదే. మనం తీరిక లేని జీవితం గడుపుతూ, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే, చివరకు ఏదైనా జరిగితే అది మన కుటుంబానికే నష్టం. అందుకే, ఆరోగ్యం పట్ల చైతన్యం, రోగ నివారణ చర్యలు చేపట్టడం ముఖ్యం. పిల్లలకవి నేర్పించాలి. 


ఇటీవల ఆరోగ్యానికి సంబంధించి ఇంగ్లీషు పుస్తకానికి మీరు సహరచయితగా వ్యవహరించారు.

లూక్‌ కుటీనో ప్రముఖ హోలిస్టిక్‌ లైఫ్‌స్టైల్‌ కోచ్‌. హోలిస్టిక్‌ న్యూట్రిషనిస్టు. ఇవాళ ప్రపంచమంతటా ఒకటే మాట - ‘బరువు తగ్గాలి’ అని. ‘సైజ్‌ జీరో’ చిత్రం కోసం నేను ఏకంగా 20 కిలోలు పెరిగా. సహజమైన పద్ధతిలో, కేవలం జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ఎలా బరువు తగ్గవచ్చో చెప్పడానికి ‘ది మ్యాజిక్‌ వెయిట్‌ లాస్‌ పిల్‌’ పుస్తకం రాశాం. అందులో నా అనుభవాలను పంచుకున్నా.  


చాలామంది తారలను అనుసరించాలని చూస్తుంటారు..

ప్రతి ఒక్కరికీ తమదైన పర్సనాలిటీ ఉంటుంది. అది మర్చిపోయి, ఫలానా నటిలానో, నటుడిలానో ఉండాలను కోవడం తప్పు. నటన నా వృత్తి. అయితే, నేను బయట కూడా హీరోయిన్‌లా ఉంటాననీ, ఉండాలనీ అనుకొంటే పొరపాటు. నాతో సహా ప్రతి మనిషికీ కష్టం, సుఖం, డిప్రెషన్‌ సహజం. అది గ్రహించక, ప్రతి ఒక్కళ్ళం అవతలి వాళ్ళలా ఉండాలనుకోవడం మూర్ఖత్వం. 


స్టార్‌డమ్‌ వచ్చినా మీరిలా ఉన్నారే!

తొలిచిత్రం ‘సూపర్‌’  చేస్తున్నప్పుడే, హీరో నాగార్జున గారు జీవితంలోనూ, కెరీర్‌లోనూ ఎన్నో అప్స్‌ అండ్‌ డౌన్స్‌ వస్తాయి. సక్సెస్‌ వచ్చిందని గాలిలో తేలిపోకుండా, ఫెయిల్యూర్‌ ఎదురైందని కుంగిపోకుండా నేల మీద నడవాలని చెప్పారు. ఆ మాట పాటిస్తుంటా. ‘అరుంధతి’ పాత్ర చూసి, నేను అలా ఉంటాననుకొంటే ఎలా? తెరపై చూసినది దర్శక, రచయితలు రాసిన ఆ పాత్ర తాలూకు బలం. అంతే తప్ప, అది నేను కాదు. ఆ పాత్ర నుంచి నేనెంత హందాగా బయటకు వచ్చి, అన్నిటినీ ఎంత పాజిటివ్‌గా ఎదుర్కొంటానన్నది కీలకం. ఎప్పటి కప్పుడు అలా ఉన్నదీ లేనిదీ రియాలిటీ చెక్‌ చేసుకుంటా. అయితే, అది చెప్పినంత సులభం కాదు. ఆచరణలో పెట్టడానికి ఆత్మీయుల సపోర్ట్‌ సిస్టమ్‌ కావాలి. 


కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఎవరితో పంచుకుంటారు?

నా కుటుంబ సభ్యులు, యోగా మిత్రులు, నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, అన్నపూర్ణా స్టూడియోస్‌ సుప్రియ, స్టైలిస్ట్‌ ప్రశాంతి తిపిర్నేని, రాజమౌళి భార్య రమ, కీరవాణి గారి సతీమణి వల్లి, యు.వి. క్రియేషన్స్‌ ప్రమోద్‌, వంశీ, హీరో రానా - ఇలా చాలామంది ఆత్మీయులు. నా కష్టసుఖాల్లో వాళ్ళు నాకు అండగా ఉంటారు.


ముందు మీరు యోగా టీచర్‌. ఇప్పటికీ టచ్‌లో ఉన్నారా?

ఇప్పటికీ గురువు భరత్‌ ఠాకూర్‌ యోగా స్టూడెంట్‌నే! ఆయన నేతృత్వంలో యోగా నేర్పేదాన్ని. ఇప్పటికీ యోగా మిత్రులను కలుస్తుంటా. వీలున్నప్పుడు మా గురువు గారిని చూస్తా. దుబాయ్‌లో, ముంబయ్‌లో ఉన్న ప్రేరణ, ప్రియాంక లాంటి నా యోగా మిత్రులతో టచ్‌లో ఉన్నా. సినిమాల్లో నటించడం కోసం హైదరాబాద్‌కు రాగానే నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న నా యోగా ఫ్రెండ్‌ వందన, ఆమె భర్త అమిత్‌లను ఎప్పటికీ మర్చిపోలేను. 


ఇప్పటికీ యోగాభ్యాసం చేస్తుంటారా?

ధ్యానం, యోగాసనాలు చేస్తూనే ఉంటా. ఆత్మావలోకనం చేసుకుంటూ ఉంటా. జీవితంలో మన అంతరంగంతో మనం పోరాడడం కష్టం. పరిపూర్ణత సాధించకపోయినా, ఆ మార్గంలో పయనిస్తున్నా. 


సినిమాల్లో పదిహేనేళ్ళ ప్రయాణం ఎలా ఉంది?

జీవితంలో పదిహేనేళ్ళంటే పెద్ద భాగం. తలచుకుంటే ఆశ్చర్యం, భయం వేస్తున్నాయి. మాది సంప్రదాయ కుటుంబం. సినీ రంగంలోకి వస్తానని అనుకోలేదు. వచ్చేటప్పటికి నాకు ఏమీ తెలీదు. అంతా కొత్తే. కానీ, ఈ టైమ్‌లో ఎంతోమందిని కలిశా. ఎంతో నేర్చుకున్నా. అందరూ నాకెంతో అండగా నిలిచారు. మొదటి సినిమాకు తొలిసారి ఫోటోషూట్‌ చేస్తున్నప్పుడు, ‘తల పై కెత్తండి’ (ఛిన్‌ అప్‌) అని కెమెరామన్‌ చెబితే, యోగాలో లాగా మెడ పూర్తిగా పైకెత్తి ఆకాశంలోకి చూశా. సినిమాల గురించి ఏమీ తెలియని అంత అమాయకంగా ఉండేదాన్ని. అలాంటి అమ్మాయిని ఇంత దూరం రావడం నాకే ఆశ్చర్యంగా ఉంది. 


ఈ క్రమంలో మీకు మరపురాని తీపి, చేదు జ్ఞాపకాలు?

జేజమ్మ (అరుంధతి), దేవసేన (బాహుబలి), రుద్రమ దేవి లాంటి పాత్రలు, ‘సైజ్‌ జీరో’, ‘వేదం’ లాంటి సిని మాలు చేయడం మరపురాని అంశాలు. అదే సమయంలో కొన్నిసార్లు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉత్సాహంగా చేసిన పనులతో గాయాల పాలయ్యా. తమిళ ‘సింగం’ చిత్రం చేస్తున్నప్పుడు మంచులో కాలు ఇరుక్కు పోయి, బ్యాక్‌ ఇంజ్యురీ అయింది. అదే సమయంలో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి చిత్రాలు చేస్తున్నా. కొన్నిసార్లు మన శారీరక సామర్థ్యం తగ్గిపోయినా, తప్పక చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు, కత్తితో యుద్ధం చేసే సన్నివేశాలు చేయాల్సి వస్తుందనుకున్నప్పుడు, మణికట్టు బలంగా ఉండేలా ముందుగా కసరత్తులు చేయాలి. లేదంటే గాయం పాలవుతాం. బెటర్‌ సెన్స్‌ ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌ లేకుండా బరిలోకి దిగితే, ఇబ్బందే అని గ్రహించా. అవి జరిగినప్పుడు నిస్పృహలోకి జారిపోతాం. కానీ, ఇదేమీ జగత్ప్రళయం కాదనే అవగాహనతో, బయటకు రావాలి. అవగాహన లేక, తెలియనితనంతో కొన్ని తప్పులు నేనూ చేశా. (నవ్వుతూ...) తప్పు చేస్తేనే కదా... ఒప్పు ఏదో తెలుస్తుంది. 


ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన సందర్భాలున్నాయా?

స్వతహాగా సున్నిత మనస్కురాలిని. ఒడుదొడుకులు ఎదురైనప్పుడు ఎమోషనల్‌గా బ్రేక్‌ డౌన్‌ అయిన సందర్భాలున్నాయి. హోదా, వయసు, జెండర్‌తో సంబంధం లేకుండా ఎవరికైనా జీవితంలో అలాంటి క్షణాలుంటాయి. వాటి నుంచి మనకు మనమే బయటకు రావాలి. 


‘బాహుబలి’ తరువాత ఆశ్చర్యంగా సినిమాలు తగ్గించారే?

పరుగు కొద్దిగా ఆపి, విరామం తీసుకోవాలనుకున్నా. నాతో నేను, నా వాళ్ళతో నేను గడపాలనుకున్నా. నా గాయాలు, నా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలనుకున్నా. కానీ, స్టార్‌ హోదా నుంచి లబ్ధి పొందాల్సిన టైమ్‌ ఇదే కదా అని చాలామంది నన్ను మందలించారు. కానీ, నా దృష్టిలో ఒకటే - నాకు ఇంత పేరు, ప్రేమ, జీవనోపాధి ఇచ్చిన సెట్‌ పవిత్ర స్థలం. అక్కడకు పూర్తి సామర్థ్యంతో, ఆనందంగా వెళ్ళాలి. అన్ని విషయాలూ మర్చిపోయి, హ్యాపీగా పని చేయాలి. అంతేకానీ, మొక్కుబడిగా కాదు. తెలిసి ఏ తప్పూ చేయకూడదు. చేసే పనిలో మానసిక ఆనందం లేనప్పుడు ఆ పని వదిలేసి, కొత్తది వెతుక్కోవాలి అనేది నా సిద్ధాంతం. 


కానీ, కెరీర్‌, సంపాదన ముఖ్యం కాదంటారా?

ముఖ్యమే. సంపాదన కూడా ముఖ్యం. ఒంట్లో బాగా లేకపోయినా, మనసు బాగా లేకపోయినా కేవలం ఆర్థిక సమస్యల రీత్యా పనిచేయాల్సి వచ్చే ఎంతోమంది ఉన్నారు. అందుకే, ప్రతి ఒక్కరికీ కనీసపాటి సోషల్‌ సెక్యూరిటీ ఉండాలి. కూడు, గూడు, ఆరోగ్యం లాంటి కనీస అవసరాలు తీరాలి. అవి తీరాక దేని వెనుకో పరుగులు తీయవద్దు.


అవసరాలు తీరనివారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది?

బాధ కలుగుతుంది. ఏమైనా చేయాలనే ఆలోచనలు వస్తాయి. కానీ, పరిస్థితిని పూర్తిగా మార్చే శక్తి సామర్థ్యాలు నాకు లేవు. నా పరిమితులు నాకున్నాయి. అయితే, నా దృష్టికి వచ్చినవారికి కుదిరితే సాయం చేస్తా. అయితే, ఐ బిలీవ్‌ ఇన్‌ ఎంపవరింగ్‌ పీపుల్‌. పిల్లలను స్పందించే హృదయమున్న వ్యక్తులుగా తీర్చిదిద్దాలనుకుంటాను. 


మీ పిల్లల్ని అలా తీర్చిదిద్దుతారా?

నేను గనక తల్లిని అయితే, కచ్చితంగా పిల్లల్ని అలానే పెంచుతా. మా అమ్మానాన్న నన్ను అలానే పెంచారు. 


మరి మీ పెళ్ళి గురించి, మీ ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వచ్చినప్పుడు మీ మానసిక స్థితి?

(గంభీరంగా...) ఎవరి గురించైనా రాసే ముందు... అలా ఎవరైనా మీ గురించి రాస్తే ఎలా ఉంటుందో ఊహించు కోండి. అవతలివాళ్ళకు నువ్వు చేసినది నీకు జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించుకొమ్మని చిన్నప్పటి నుంచి మా నాన్న గారు చెప్పేవారు. అదే నేను పాటిస్తుంటా. అందుకే, నేను పేపర్లు చదవను. టీవీ చూడను. నెగటివ్‌ వార్తలు చదవాలనుకోను. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి దేనిలోనూ లేను. నా సంగతి తెలిసిన నా మిత్రులెవరూ నాకు అలాంటివి వాట్సప్‌లో కూడా పంపరు. వాళ్ళ ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగలేదో పట్టదు కానీ, అనుష్క ఆరోగ్యం బాలేదట లాంటివి రాయడం, చదవడం దురదృష్టకరం.


రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌తో మీ పెళ్లట!

బబ్లూ (ప్రకాశ్‌) నాకు ఫ్రెండ్‌. పెళ్ళి అని రాసేస్తే ఎలా? అంతకు ముందు హీరోలతో, క్రికెటర్లతో పెళ్ళని రాశారు. 


నిప్పు లేకుండా పొగ రాదుగా!

కానీ, (నవ్వుతూ...) ఇక్కడ నిప్పు లేకపోయినా పొగ కూడా వాళ్ళే పుట్టించేస్తున్నారు.  


నిజమేమిటో మీరే చెప్పండి. మీ పెళ్ళెప్పుడు?

పెళ్ళి చేసుకుంటున్నప్పుడు కచ్చితంగా తెలియజేస్తా. అందరినీ పిలిచి బాహాటంగా జరగకపోవచ్చేమో కానీ, దొంగ చాటుగా అయితే నా పెళ్ళి జరగదు. ఇద్దరు కలసి జీవించే వివాహ బంధమనేది అందమైన రిలేషన్‌ షిప్‌. బ్యూటిఫుల్‌ ఎమోషన్‌. ఆ బంధం మీద నాకు నమ్మకం ఉంది. కానీ, నాకు నచ్చిన, తగిన మనిషి ఎదురవ్వాలి కదా! అలాంటి వ్యక్తి తారసపడినప్పుడు తప్పక చేసుకుంటా. 


అమ్మానాన్న చూపించినవాణ్ణే చేసుకుంటానన్నారట!

అది కూడా గాలి వార్తే. నేను ఆ మాట అనలేదు. ఎక్కడెక్కడో ఏవేవో మాటల్ని కలిపి, నేను అన్నట్టుగా రాసేశారు. మా కజిన్స్‌కు 20 - 24 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది. ఆ లెక్కన నాకు ఇరవైకే చేసేసేవారు. నా అభిప్రాయం తెలిసి, వాళ్ళూ బలవంత పెట్టడం లేదు. లేదంటే, అందరూ బలవంతపెట్టారని గ్రీన్‌ మ్యాట్‌ ముందు నిలబడి, ఫోటోలకు పోజులిచ్చి, మీకు నచ్చిన వరుడి బొమ్మ పెట్టుకోమనాలి (నవ్వులు...).  


కానీ ‘సైజ్‌ జీరో’ తరువాత వెయిట్‌ లాస్‌ కోసం విదేశాలు వెళ్ళారని వార్త. లూక్‌తో పుస్తకం అందువల్లే...

దానికీ, లూక్‌తో పుస్తకానికీ సంబంధం లేదు. ఆరోగ్యం గురించి మా ఇద్దరి ఆలోచన, అభిప్రాయాలు ఒకటే. అప్పుడు ఆయన తన పుస్తక రచనలో భాగమవుతారా అడిగితే, నేను అందులో నా అనుభవాలు పంచుకున్నా. అంతే.  


షూటింగు లేనప్పుడు ఏం చేస్తుంటారు?

ట్రావెలింగ్‌ అంటే ఇష్టం. సన్నిహిత వ్యక్తులను కలుస్తుంటా. సినిమాలు చూస్తా. కొన్నిసార్లు ఏమీ చేయను... ఖాళీగా కూర్చొని ఉంటా. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తా. వ్యక్తిగత విషయాలు కొన్నిటిని బయటకు చెప్పడానికి ఇష్టపడను.


పదిహేనేళ్ళ క్రితం మీ శ్రీనగర్‌ కాలనీ అపార్ట్‌మెంట్లో చాలా పుస్తకాలు కనపడేవి. ఇప్పటికీ బాగా చదువుతారా?

పుస్తకాలు చదువుతా. అయితే... అవన్నీ నాన్‌ ఫిక్షన్‌ బుక్స్‌. నేను చదివిన సెమీ ఫిక్షన్‌ బుక్‌ ‘ది ఆల్కెమిస్ట్‌’. ప్రకాష్‌ కోవెలమూడి మాజీ సహచరి కణికా థిల్లాన్‌ రాసిన ‘డ్యాన్స్‌ ఆఫ్‌ దుర్గ’ చదివా. ప్రస్తుతం రెండు, మూడు పుస్తకాలు చదువుతున్నా. ఎక్కువ కిండిల్‌లో చదువుతా. (నవ్వుతూ...) ఆ పుస్తకంలో కొన్ని, ఈ పుస్తకంలో కొన్ని పేజీలు అందులో సేవ్‌ చేసుకుంటా. 


హిందీ చిత్రాలకు కణికా కథలు అందిస్తున్నారు. ఆవిడ మీ స్నేహితురాలే. హిందీలో నటించమని అడగలేదా?

నో! ఇట్స్‌ ఎగైన్‌ కంటెంట్‌ కదా! అన్నిటి కంటే ముందు... ‘బాహుబలి’ పూర్తయ్యాక బ్రేక్‌ తీసుకున్నా. ఏదైనా మంచి కథ వస్తే హిందీలో నటించడానికి సిద్ధమే. బాలీవుడ్‌కే కాదు హాలీవుడ్‌కూ నేను వ్యతిరేకం కాదు (నవ్వులు).


తెలుగు, తమిళం తప్ప మీరు సినిమాలు చేసినట్టు లేరు!

టైమ్‌ లేదండి! నా దృష్టిలో సినిమా అంటే - ఓ మంచి కథ చెప్పడం! ఆ కథను చెబుతూ ఎంతోమంది ప్రేక్షకులకు చేరువ కావాలి. అందుకే, బాలీవుడ్‌, కాలీవుడ్‌, టాలీవుడ్‌ అనేవి నమ్మను. మంచి కథలలో నటించాలను కుంటా. ఎంత ఎక్కువమందికి చేరువ కాగలననేది చూస్తా. 


చాలాసార్లు మీకు షాట్‌ లేకున్నా అబ్జర్వ్‌ చేస్తుంటారే!

నాకు అబ్జర్వ్‌ చేయడం, అలా చూస్తూ ఉండడం ఇష్టం. సినిమా మేకింగ్‌ అనేది మ్యాజికల్‌. షూటింగ్‌లో 24 క్రాఫ్టుల వాళ్ళూ కలిసి పని చేస్తారు. అవన్నీ అబ్జర్వ్‌ చేస్తా. షూటింగులో ఎంతసేపు కూర్చున్నా నాకు బోర్‌ కొట్టదు. 


ఆ ఆసక్తిని ముందుకు తీసుకువెళ్ళి డైరెక్టరవుతారా?

ఫస్ట్‌... నేను యాక్టర్‌ని. నా మొదటి ఎజెండా అదే. అంతేకానీ, తెరపై కథలు చెప్పాలని అనుకోవడం లేదు. 


ఇంతకీ, మరో పదిహేనేళ్ల తర్వాత అనుష్కను ఎలా చూడొచ్చు? నటిగా, నిర్మాతగా, కేవలం గృహిణిగా?

(ఒక్క క్షణం ఆగి...) ఏమోనండీ! నటిగానే చూస్తారని ఆశిస్తున్నా. ఒకటి మాత్రం తెలుసు... నేను ఏం చేసినా ఎంజాయ్‌ చేస్తూ చేస్తా. చేస్తున్న పనిలో సంతోషం లేకపోతే... నన్ను సంతోషపెట్టే పని మరొకటి చేస్తా. 


నటనలో సంతోషం తగ్గితే, సినిమాలు మానేస్తారా?

ఒకవేళ నేను ఎంజాయ్‌ చేయలేకపోతే... ఇదే కాదు, ఏ పనీ చేయను. నేను యోగాకి వెళ్ళినప్పుడు జీవితాం తం అదే చేద్దామను కున్నా. ఇంట్లో కూడా ‘నేను యోగా టీచర్‌ని కావాలను కుంటున్నా’ అని చెప్పా. ఇంతలో సినిమాలు చేసే అదృష్టం దక్కింది. ఇప్పుడు యాక్టింగ్‌ ఎంజాయ్‌ చేస్తున్నా. వేరే విషయాల గురించి ఆలోచించడం లేదు. వ్యక్తిగతంగా చాలా నేర్చుకోవాలనుకుంటున్నా. వృత్తి మాత్రం నటనే! 


ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు?

కొన్నిసార్లు ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని ఉంది. 


‘నిశ్శబ్దం’ చిత్రంలోని మూగ, చెవుడు చిత్రకారిణి పాత్ర కోసం పెయింటింగ్‌ నేర్చుకున్నారట?

క్యారెక్టర్‌కి అవసరమైనంత మేర పెయింటింగ్‌తో పాటు సైన్‌ లాంగ్వేజ్‌ (సైగలతో మాట్లాడడం) నేర్చుకున్నా. ఇప్పుడు పూర్తిగా సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకోవాలనుకుంటున్నా. మాటలు రాని వాళ్లతో మాట్లాడడానికి అదొక అందమైన భాష. వ్యక్తిగత సంతృప్తి కోసం తప్పక నేర్చుకుంటా.


‘వేదం’లో వేశ్య. ‘రుద్రమదేవి’లో వీరనారి. ‘నిశ్శబ్దం’లో చెవిటిమూగ అమ్మాయి. ‘సైజ్‌ జీరో’లో లావాటి అమ్మాయి. ఇలాంటి పాత్రలు చేయడానికి మీ ధైర్యం ఏంటి?

(వెంటనే అందుకొని...) అది ధైర్యం అంటారా? స్టుపిడిటీ అంటారా? (నవ్వులు). ఏమో... నాకు ఏమీ తెలీదు. నేను వెళ్లి నటించాను అంతే. అలా చేయడం వల్ల నాకు మంచి జరిగిందా? లేక నేను కిందకు జారానా? తెలియదు! సైజ్‌ జీరో చేసినప్పుడు ఆ పాత్ర కోసం 20 కిలోలు పెరిగా. చాలామంది ‘నీకు పిచ్చి పట్టిందా? ఆరోగ్యం పాడవుతుంది’ అని చెప్పారు. కానీ, నేను ఆ సినిమా చేశా. నా మనసు చెప్పిన మాట విన్నాను. సినిమా చేసినందుకు నేనేమీ చింతించడం లేదు. ఎటువంటి బాధా లేదు.


కానీ, వచ్చే పరిణామాల తాలూకు బాధ మాటేమిటి?

ఆ సినిమా చేయాలనే నిర్ణయం నేను స్వయంగా తీసుకున్నది. ఆ నిర్ణయం వల్ల వచ్చే పరిణామాలకు నేనే బాధ్యత వహించాలి. వేరొకరిపై నిందలు వేయలేను. ఏ సినిమా విషయంలోనూ నాకు రిగ్రెట్స్‌ లేవు. ఆ క్షణాల్లో ఆ చిత్రాలు చేయాలనిపించి చేశాను. వాటి తదనంతర పరిణామాలు నేనే సహించాలి, భరించాలి.  


‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘సైజ్‌ జీరో’కు బాడీతో ప్రయోగాలు చేశారు. మహిళగా ఇది కష్టమే!

అవును. మీరు చెప్పింది నిజమే. అప్పుడలా చేయాలనిపించింది. క్యారెక్టర్స్‌ డిమాండ్‌ చేశాయి. ఆలోచించకుండా చేసేశా. కానీ, భవిష్యత్తులో అలాంటివి చేయాల్సి వస్తే మాత్రం జాగ్రత్తగా ఎలా చేయాలని ఆలోచించి మరీ ముందడుగు వేస్తా. అవకాశం వచ్చింది కదా అని వెంటనే షూటింగ్‌లోకి దిగను. ఆచితూచి చేస్తా. 


‘సైరా’లో గెస్ట్‌ పాత్ర లాంటి నిర్ణయాలకు ఆలోచిస్తారా?

చిరంజీవి గారు లెజెండ్‌. సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పరిచయం చేసే ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర చేయమని వాళ్ళు అడగడం ఎంత మంచి విషయం.  


చిరంజీవితో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయలేదేం! 

మధ్యలో ఒక సినిమా అనుకున్నాం. ‘ఖైదీ నంబర్‌ వన్‌ ఫిఫ్టీ’కి అనుకుంటా. అయితే నేను ‘బాహుబలి’తో బిజీగా ఉండడంతో డిస్కషన్స్‌ ముందుకు వెళ్ళలేదు. 


అమెజాన్‌లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తుంటారా?

ఓ... అన్ని రకాల సినిమాలూ, అన్ని భాషల సినిమాలూ చూస్తా. సబ్‌ టైటిల్స్‌ ఉంటాయి కదా! కొరియన్‌ సినిమాలు ఎక్కువ చూస్తా. కొన్ని రోజులు ఉన్నట్లుండి బయటకు వచ్చి సినిమాలు చూడాలనిపిస్తుంది. (నవ్వుతూ...) హైదరాబాద్‌లో ఏ సినీమ్యాక్స్‌కో, జి.వి.కె. మాల్‌కో థియేటర్లకు వెళ్లి ఒకే రోజు నాలుగు సినిమాలు చూసేస్తా. 


వృత్తిపరంగా, నటన పరంగా మీకు ఆదర్శం, స్ఫూర్తి?

పెద్ద యన్టీఆర్‌, ఏయన్నార్‌, సావిత్రి, భానుమతి లాంటి మహామహులు ఇండస్ట్రీ పై చెరగని ముద్ర వేశారు. నేను సినిమాలు చూస్తూ పెరగలేదు. కాబట్టి... వాళ్ళ సినిమాలు అన్నీ చూడలేదు. కానీ, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చరిత్రలో భాగం కావడం సులభం కాదని తెలిసింది. నటన మాత్రమే వాళ్ళను ఆ స్థాయికి తీసుకు రాలేదు. వ్యక్తిత్వమూ, విలువలు అంతటి వాళ్ళను చేశాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలో వాళ్ళు ఒక భాగం. వాళ్ళతో పని చేయకపోయినా వాళ్ల గురించి చాలా విన్నాను. వాళ్ళు నాకు ఆదర్శం. ఇక, నేను పని చేసిన వ్యక్తుల నుండి స్ఫూర్తి పొందాను. 


ఎవరి నుంచైనా మీరు స్ఫూర్తి పొందే విషయం ఏమిటి?

శ్యామ్‌ (నిర్మాత ఎం. శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి) గారికి సినిమా అంటే ఎంతో ప్రేమ, గౌరవం. నాతో ‘అరుంధతి’ తీశారని చెప్పడం లేదు. చేసే పని మీద ప్రాణం పెడతారు. రాజమౌళి అంతే. చేసే పని మీద చాలా ప్యాషనేట్‌ గా ఉంటారు. ఏ రంగంలోని వారైనా సరే అలా తమ పని మీద ప్రాణం పెడుతుంటే, వాళ్ళతో నేను కనెక్ట్‌ అవుతా. నా దృష్టిలో ప్యాషన్‌ ప్లస్‌ హార్డ్‌వర్క్‌ ఈజ్‌ ఇంపార్టెంట్‌. హాలీ వుడ్‌ ప్రముఖుడు క్వెంటిన్‌ టరంటినో వయసెంత? ఆయన ఏం చేస్తున్నారో చూడండి. ఫలానా వయసు తర్వాత రిటైర్‌ కావాలి వంటి మూసను బద్దలు కొడుతున్నారు. సినిమాను కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. అలాంటి వ్యక్తులు, వాళ్ళ కథలు నాలో ఆసక్తి కలిగిస్తాయి. మనకు కొంతమంది తెలియచ్చు. కొందరు తెలియక పోవచ్చు. అందుకని, బయోగ్రఫీలు చూస్తా. వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి. నాకు బయోగ్రఫీ చిత్రాలు చూడడం ఇష్టం.


వీటిలో ఏవీ మరచిపోలేను!

‘‘జయాపజయాలతో సంబంధం లేకుండా నాకు గుర్తుండిపోయిన పాత్రలు చాలానే ఉన్నాయి. తొలి చిత్రం ‘సూపర్‌’లోని గ్లామర్‌ పాత్ర సాషా నుంచి రానున్న ‘నిశ్శబ్దం’లోని చెవిటి, మూగ అమ్మాయి పాత్ర సాక్షి వరకు ఆ జాబితా పెద్దదే. ‘అరుంధతి’లో జేజమ్మ, ‘వేదం’లో వేసిన వేశ్య పాత్ర సరోజ, ‘పంచాక్షరి’లో, ‘భాగమతి’లో టైటిల్‌ రోల్స్‌, ‘బాహుబలి’లో దేవసేన - ఇలా ఎన్నో! వీటిలో ఏవీ నేను మరచిపోలేను. ఈ పదిహేనేళ్ళ ప్రయాణం, అందులో నాకు దక్కిన ఈ గుర్తింపు ఈ పాత్రలు, సినిమాలన్నిటి సమ్మేళనమే!’’


స్టార్‌ను కాదు... స్వీటీని!

మీ ఫ్యామిలీ గురించి... 

నాకు ఇద్దరు అన్నయ్యలు. ఇంట్లో నేనే చిన్నదాన్ని. నా బ్రదర్‌ ఒకరు డెంటిస్ట్‌. చిన్నప్పుడు ప్రతి ఆడపిల్లలానే నాకూ మా నాన్న గారు హీరో. పరిణతి వచ్చాక అమ్మను అమ్మగా, నాన్నను నాన్నగా - ఎవరి ప్రాధాన్యం వారిదేనని అర్థం చేసుకున్నా. మా ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు కబుర్లు చెప్పుకుంటాం. అన్ని విషయాలూ మాట్లాడుకుంటాం... సినిమా గురించి తప్ప! నా సినిమాలు, పనిలో మా ఫ్యామిలీ జోక్యం చేసుకోదు. వాళ్ళ దృష్టిలో నేను స్టార్‌ను కాదు... ఇంట్లోని స్వీటీని! 


‘బాహుబలి’ లాంటివి చూసినప్పుడు  ఏమంటారు? 

‘అరుంధతి’లో, ‘బాహుబలి’లో యంగ్‌ దేవసేన పాత్రలో చూడడం అమ్మకు ఇష్టం. చిన్నతనం నుండి నన్ను అందంగా ముస్తాబు చేసి, నగలు పెట్టాలను కునేది. కానీ ఎక్కువ నగలు వేసుకోవడం నాకిష్టం ఉండదు. అందుకని, వేసుకునేదాన్ని కాదు. అటువంటి పాత్రల్లో నన్ను చూడగానే ‘చిన్నప్పుడు వద్దనేదానివి. ఇప్పుడు వేసుకుంటున్నావ్‌ చూడు’ అంటుంది. తల్లులు ఎవరికైనా పిల్లలు అలా కనిపిస్తే ఇష్టమేగా! 


అన్నీ చిన్న చిన్న సంతోషాలే! 

‘‘నావన్నీ చిన్న చిన్న సంతోషాలే. జీవితంలో చాలా చిన్న చిన్న విషయాలను ఎంజాయ్‌ చేస్తా. వర్షం పడినప్పుడు మట్టి వాసన చాలా సంతోషిస్తా. స్నేహితులతో కలిసి పార్టీ అంటే సంబరపడతా. కొత్త మనుషులను కలవడం నాకెంతో ఇష్టం. అందులో సంతోషాన్ని వెతుకుతా. తిండి సంగతికొస్తే ముద్ద పప్పు, అన్నం! చికెన్‌, రొయ్యలు ఇష్టం.’’


‘‘సక్సెస్‌ ఫార్ములా నాకు తెలుసనుకోవడం లేదు. సినిమా సక్సెస్‌ అవుతుందా! డిజాస్టరా అనేది ఎవరికీ తెలీదు. కానీ, నిజాయతీగా కష్టపడి పని చేయడాన్ని నమ్ముతా. మన ఉద్దేశం సరైనదై ఉండాలి. చేసే ప్రయత్నం సరిగ్గా ఉండాలి. అన్నిటికీ మించి కష్టపడి పని చేయాలి. అప్పుడు కచ్చితంగా దానికి ఫలితం ఉంటుంది.’’


వాళ్ళేలేకపోతే...!

‘‘ఇన్నేళ్ళున్నానంటే నాకు  మంచి అవకాశాలిచ్చిన ప్రతి ఒక్క దర్శకుడి పాత్రా ఉంది. నాటి పూరీ నుంచి నేటి హేమంత్‌ దాకా అందరూ నన్ను తీర్చిదిద్దారు. వాళ్ళే లేకపోతే నేను లేను!’’


మీరు ఈమధ్య కాలంలో చూసిన బయోపిక్‌?

సావిత్రి గారి మీద వచ్చిన ’మహానటి’. కీర్తీ సురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌ల కాంబినేషన్‌ ఎమేజింగ్‌. ఇద్దరూ అద్భుతంగా చేశారు. నాగి (దర్శకుడు నాగ అశ్విన్‌) బాగా చేయించారు.


ఫలానా బయోగ్రఫికల్‌ ఫిల్మ్‌ ఏదైనా చేయాలని మీకుందా?

(ఒక్క క్షణం ఆలోచించి) బయోపిక్స్‌ చేయడం నాకిష్టమే. అయితే ఫలానా బయోపిక్‌ చేయాలని అనుకోలేదు. బయోగ్రఫీలో ఒక వ్యక్తి ప్రయాణం, నిజమైన భావోద్వేగాలు ఉండాలి. జెన్యూనిటీ ముఖ్యం. మనం బయోగ్రఫీ చేస్తున్నామంటే... ఆ అసలు వ్యక్తిని రీప్లేస్‌ చేస్తున్నాం. అంటే, ఆ వ్యక్తితో సిమిలారిటీస్‌ ఉండాలి. అలా లేకుండా, అన్ని బయోగ్రఫీలూ చేయలేము. మంచిది వస్తే తప్పకుండా చేస్తా.  


అలా మీకు నచ్చిన బయోపిక్‌, మీరు చదివిన ఆత్మకథ? 

ఎక్కువ ఆత్మకథలు చదవలేదు కానీ, చదవాలని అనుకుంటుంటా. పరమహంస యోగానంద ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ ఎ యోగి’ (తెలుగులో ‘ఒక యోగి ఆత్మకథ’) చదివా. మన దగ్గర ఎంతమంది చూశారో తెలియదు కానీ, బెతనీ హ్యామిల్టన్‌ అని అమెరికన్‌ ప్రొఫెషనల్‌ సర్ఫర్‌ ఉంది. ఒకసారి సర్ఫింగ్‌ చేస్తుండగా సొరచేప దాడిలో, ఎడమ చేతిని పోగొట్టుకుంది. దాన్నుండి బయటపడి సర్ఫింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఆమెకు పెళ్లయింది. పిల్లలున్నారు. ఆమె ఆత్మకథ చాలా ఏళ్ళ క్రితం ‘సోల్‌ సర్ఫర్‌’ అని వచ్చింది. దాన్నే ఆ తరువాత అదే పేరుతో సినిమాగా తీశారు. స్ఫూర్తిమంతంగా ఉంటుంది. 


మీ లైఫ్‌ ఫిలాసఫీ?

జస్ట్‌... వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌. రోజూ ఒక్కో అడుగూ ముందుకు సాగుతుండడమే! 


అందానికి మీ నిర్వచనం?

మనపై మనం నమ్మకంతో ఉండడం! లావు, సన్నం, నలుపు, తెలుపు లాంటి వాటితో ప్రమేయం లేకుండా, మనల్ని మనం ప్రేమిస్తూ హాయిగా ఉండడం! కంఫర్టబుల్‌ ఇన్‌ యువర్‌ ఓన్‌ స్కిన్‌. మనసులో సంతోషంగా ఉంటే అదే అసలైన అందం. 


దయ్యాల సినిమాలు చేస్తుంటారు. దేవుణ్ణి నమ్ముతారా? 

చిన్నతనం నుండి టెంపుల్స్‌కి వెళ్లడం అలవాటు. దేవాలయాల్లో వాతావరణం నాకు ఇష్టం. తిరుపతికి కొన్నిసార్లు వెళ్లాను. కేరళలో చొట్టనిక్కర టెంపుల్‌, గురువాయూర్‌ టెంపుల్స్‌కి వెళుతుంటా. మంగుళూరులో మా అమ్మగారి సొంతూరు పుత్తూరులో మహాలింగేశ్వర ఆలయం ఉంది. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటిపేరైన బెల్లిపాడి కుటుంబం పెద్దది. పుత్తూరులో బెల్లిపాడి ఫ్యామిలీ గ్రామదేవతకు గుడి కట్టించింది. అక్కడికి వెళుతుంటా.  


ఇప్పటికప్పుడు దేవుడు ప్రత్యక్షమై, వరమిస్తానంటే ఏం కోరతారు?

థ్యాంక్యూ అంటాను. జీవితంలో నేను అడిగినదాని కంటే దేవుడు చాలా ఎక్కువ ఇచ్చాడు. ఈ విషయంలో నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు! ఒకవేళ ఇప్పుడూ దేవుడిని ఏమైనా అడిగితే నా అంత స్వార్థపరురాలు ఎవరూ ఉండరు. గుడికి వెళ్లే ముందు ‘ఇది అడగాలి. ఇది అడగాలి’ అనుకుంటాను. వెళ్లిన తర్వాత దేవుడు ముందు నిలబడినప్పుడు మాత్రం థ్యాంక్యూ’ చెప్పేసి వస్తుంటా.


స్వీటీ... హీరోలు  (అనుష్క మాటల్లో... ఆమె హీరోల గురించి)

చిరంజీవి: ఆయనతో ఫుల్‌ లెన్త్‌ రోల్‌ చేయలేదు కానీ, నా దృష్టిలో ఆయన స్టార్‌. తిరుగులేని లెజెండ్‌. 

రజనీకాంత్‌: సూపర్‌ స్టారైనా సాదాసీదాగా ఉండే వ్యక్తి. ఎనిమిదికి షూటింగ్‌ అంటే ఏడుమ్ముప్పావుకే సెట్‌లో రెడీగా ఉండేవ్యక్తి. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. 

బాలకృష్ణ: అనుక్షణం ఉత్సాహం, ఉత్తేజం తొణికిసలాడే మంచి మనిషి. ఇష్టమైన వ్యక్తి. 

నాగార్జున: నా తొలి చిత్ర హీరో. నా మనసుకు దగ్గరైన వ్యక్తి. 

వెంకటేశ్‌: ఎప్పుడూ స్టార్‌లా ప్రవర్తించని మంచి మనిషి. 

రవితేజ: పనిచేయడం బోలెడంత వినోదం. 

మహేశ్‌ బాబు: ప్రొఫెషనల్‌. పేరు చెప్పగానే స్టార్‌ అనిపిస్తుంది.

ప్రభాస్‌: నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌.

రానా: నాకు బ్రదర్‌. నన్ను కూడా బ్రో అని పిలుస్తాడు.

అల్లు అర్జున్‌: ఆయన హార్డ్‌ వర్క్‌, ఎంచుకొనే సినిమాలు అద్భుతం.

గోపీచంద్‌: కెరీర్‌ తొలినాళ్ళలో కలసి చాలా సినిమాలు చేశాం.మంచి ఫ్రెండ్‌. 

సూర్య: వెరీ నైస్‌ హ్యూమన్‌ బీయింగ్‌.

మాధవన్‌: ఎమేజింగ్‌ యాక్టర్‌. అపారమైన నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తి. ఎన్నో కోణాలున్న ప్రజ్ఞావంతుడు. అంత తెలిసినా, సింపుల్‌గా ఉండే మనిషి. 


-రెంటాల జయదేవ, సత్య పులగం

Updated Date - 2020-03-15T06:59:55+05:30 IST