అన్నపూర్ణమ్మగారి బొమ్మల కొలువు

ABN , First Publish Date - 2020-12-10T06:06:06+05:30 IST

ఒక చిన్న పేపర్‌ ముక్క కనిపిస్తే, దాన్ని ఆకర్షణీయంగా ఎలా మలుచుకోవచ్చని ఆలోచించే తత్వం నాది. చిన్నప్పటి నుంచీ నాది ఇదే ధోరణి. చీపురు పుల్లలు,

అన్నపూర్ణమ్మగారి బొమ్మల కొలువు

పనికిరాని వస్తువులతో పనికొచ్చే బొమ్మలను తయారుచేయడంలో 67 ఏళ్ల అడవి అన్నపూర్ణ గారిది అందె వేసిన చేయి . తన సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకుంటూ,  సరికొత్త ప్రయోగాలు చేస్తూ విలక్షణమైన బొమ్మలు తయారుచేస్తూ వచ్చారు ఆవిడ. వీటిలో వస్త్రాల బొమ్మలు రెట్టింపు ఆదరణ పొందాయి. పండగలు, పెళ్లిళ్లు, వేడుకల్లో కొలువుతీరే స్థాయికి చేరిన ఆ బొమ్మల గురించి ఆమె నవ్యతో పంచుకున్న విశేషాలు!


ఒక చిన్న పేపర్‌ ముక్క కనిపిస్తే, దాన్ని ఆకర్షణీయంగా ఎలా మలుచుకోవచ్చని ఆలోచించే తత్వం నాది. చిన్నప్పటి నుంచీ నాది ఇదే ధోరణి. చీపురు పుల్లలు, పనికిరాని వస్త్రాలు, సాక్సులు... ఇలా దేన్నీ వదిలేదాన్ని కాదు. వాటితో ఇంటి అవసరాలకు ఉపయోగపడే వస్తువులను తయారుచేసేదాన్ని. క్రమేపీ ముడిసరుకులు మారుస్తూ ప్రయోగాలూ చేసేదాన్ని. నా అభిరుచికి పెళ్లి, పిల్లలు, వారి పెంపకంతో అడపా దడపా బ్రేక్‌ పడుతూ వచ్చింది. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడడంతో నాలుగేళ్ల క్రితం నుంచి మళ్లీ బొమ్మల తయారీ కోసం నా పూర్తి సమాయాన్ని కేటాయించడం మొదలుపెట్టాను. వస్త్రం, ఫర్‌ ప్రధాన ముడిసరుకుగా బొమ్మలు తయారుచేస్తున్నాను.


 బొమ్మల్లో పిల్లలూ, పెద్దలూ, వృద్ధులూ... ఇలా అన్ని వయసుల వారివీ ఉంటాయి. వాటి కట్టు బొట్టు కూడా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటాను. వెంట్రుకల కోసం ఊలును వాడతాను. స్కెచ్‌ పెన్నుతో కనుముక్కు దిద్దుతాను. అయితే నా బొమ్మల అలంకరణ మొత్తం సంప్రదాయ రీతిలో సాగుతుంది. వాటికి నప్పే ఆభరణాలు కూడా తయారుచేసి అలంకరిస్తాను. ఇలా ఒక బొమ్మకు అందమైన రూపం తీసుకురావడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది. 




థీమ్‌కు తగ్గట్టు...

పుట్టినరోజు మొదలు షష్ఠిపూర్తి వరకూ జీవితంలో ఎదురయ్యే ప్రతి వేడుకకూ తోడ్పడేలా వేర్వేరు థీమ్‌లతో బొమ్మలు తయారుచేస్తూ ఉంటాను. ఇటీవలి కాలంలో వేడుకలు జరుపుకునే ప్రదేశంలో, ఆ వేడుకను తలపించే బొమ్మలతో ప్రదర్శన ఏర్పాటుచేయడం పరిపాటిగా మారింది. దాంతో పుట్టినరోజులు, పెళ్లిళ్లు, బారసాలలు, అన్నప్రాసనలు, గృహప్రవేశాలు, షష్ఠిపూర్తి... ఇలా సందర్భానికి తగ్గట్టు బొమ్మల థీమ్‌ తయారుచేసి అందిస్తూ ఉంటాను.


 పెళ్లిళ్లకు సంబంధించి పెళ్లికూతురిని చేయడం, ముత్తయిదవులు కలిసి పసుపు కొట్టడం, పెళ్లి పీటల మీద కూర్చోడం, భోజనాలు... ఇలా వేర్వేరు ఘట్టాలను తలపించే బొమ్మలు పెళ్లి వేడుకకు తగ్గట్టుగా తయారుచేసి అందిస్తూ ఉంటాను. కొందరు షోకేసుల్లో అలంకరించుకోవడానికి దేవతామూర్తుల బొమ్మలు కూడా అడుగుతూ ఉంటారు. అలా లక్ష్మీదేవి, పార్వతి, శివపార్వతులు, డాన్స్‌ బొమ్మలు కూడా తయారుచేసి ఇచ్చాను. అన్ని బొమ్మలూ పది అంగుళాల పొడవు ఉంటాయి. ఇప్పటివరకూ సుమారు 900 బొమ్మలు తయారుచేశాను.



ఆదాయమంతా సేవకే !

లాభాపేక్షతో బొమ్మల తయారీ మొదలుపెట్టలేదు. ప్రారంభంలో ఇరుగుపొరుగు, బంధువులు, స్నేహితులకు బొమ్మలను బహుమతులుగా ఇచ్చేదాన్ని. అలా నా బొమ్మల గురించి తెలుసుకున్న వాళ్లు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. దాంతో ఒక్కొక్కటిగా తయారుచేసి, అమ్మడం మొదలుపెట్టాను. క్రమేపీ ఆర్డర్లు పెరిగాయి. ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా కూడా ఆర్డర్లు అందుతూ ఉంటాయి. ఎక్కువగా వేడుకకు సంబంధించిన థీమ్‌ బొమ్మల ఆర్డర్లు వస్తూ ఉంటాయి. అయితే వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి కూడా సొంతానికి వాడుకోను. అది ఎంత పెద్ద మొత్తమైనా దాచి, అంధుల పాఠశాలలకు, మానసిక వికలాంగుల అవసరాలకు విరాళంగా ఇస్తూ ఉంటాను. గోశాలలో గోవుల సంక్షేమానికి కూడా సహాయపడుతూ ఉంటాను.



అమెరికాలోనూ...

అమెరికాలో ఉన్న నా మనవడు, మనవరాలి కోసం బొమ్మలు తయారుచేసి తీసుకువెళ్లేదాన్ని. వాళ్ల ఇంటికొచ్చే అతిథులు, ఇరుగుపొరుగు నా బొమ్మలను మెచ్చి, ఆర్డర్లు ఇచ్చేవాళ్లు. అలా అమెరికాలో స్థిరపడిన ఓ గుజరాతీ కుటుంబం పెళ్లి థీమ్‌తో 30 బొమ్మలు కావాలని అడిగింది. గుజరాతీ సంస్కృతి, వారి వస్త్రధారణ, ఆభరణాల గురించి తెలుసుకుని, వారికి నచ్చేలా  బొమ్మలు తయారుచేసి అందించాను. ఆ ఆర్డరుకు నాకు ఏకంగా 30 వేల రూపాయలు దక్కాయి. ఆ డబ్బునూ సమాజసేవకే వినియోగించాను. అమెరికాతోపాటు న్యూజిల్యాండ్‌, సింగపూర్‌లో స్థిరపడిన మనవాళ్లు నా బొమ్మలు కొనుగోలు చేసి, తీసుకువెళతారు.


కథలకు ప్రాధాన్యం

ఇప్పటి తరం పిల్లలకు భారతభాగవతాల్లోని కథల గురించి తెలియదు. వాటి పట్ల అవగాహన ఏర్పరచడం కోసం పండగ రోజుల్లో ఇరుగు పొరుగును, పిల్లలనూ ఇంటికి పిలిపించి కాళింది మర్ధనం, కృష్ణకుచేలోపాఖ్యానం మొదలైన ఘట్టాలను బొమ్మలతో వివరిస్తూ ఉంటాను. అలాగే కథలు చెప్పే సంస్కృతి కూడా క్రమేపీ అంతరిస్తోంది. అందుకే ఓ ఛానల్‌లో కొంతకాలం పాటు కథలు చెప్పాను. కథ చెప్పడమే కాకుండా, దానిలోని నీతిని నిజ జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో నేర్పించేదాన్ని. 

 




ఇది నా కుటుంబం

మాది పశ్చిమ గోదావరిలోని భీమవరం. ఇంటర్‌ వరకూ చదువుకున్నాను. మా వారు అడవి వెంకట కృష్ణారావు ఫార్మసూటికల్‌ కంపెనీలో పనిచేసేవారు. దాంతో ఆయన వృత్తిరీత్యా 1984లో హైదరాబాద్‌ వచ్చేశాను. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబాబుకు అమెరికాలో ఉద్యోగం. చిన్నబాబు బెంగళూరులో స్థిరపడ్డాడు.



 

Updated Date - 2020-12-10T06:06:06+05:30 IST