ఇచట పాలు ఉచితం

ABN , First Publish Date - 2020-10-07T06:14:40+05:30 IST

పొద్దున లేవగానే పాల ప్యాకెట్‌ కోసం పరుగెడతాం! కానీ ఆ ఊళ్లలో పశువులున్న ఏ ఇంటికి వెళ్లినా ఉచితంగా పాలు పోస్తారు. అలాఅని మీరు డబ్బులివ్వబోతే మాత్రం చుక్క పాలు కూడా పోయరు. పాలు అమ్మకూడదన్న ఏళ్ల నాటి కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు కర్నూలు జిల్లాలోని గంజహళ్లి, కడిమెట్ల గ్రామస్థులు. ఈ కట్టుబాటు ఎలా మొదలయింది? కట్టుబాటును మీరితే ఏమవుతుంది? ఇలాంటి అనేక అంశాలను గంజహళ్లి గ్రామస్థురాలైన గోవిందమ్మ ‘నవ్య’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...

ఇచట పాలు ఉచితం

పొద్దున లేవగానే పాల ప్యాకెట్‌ కోసం పరుగెడతాం! కానీ ఆ ఊళ్లలో పశువులున్న  ఏ ఇంటికి వెళ్లినా ఉచితంగా పాలు పోస్తారు. అలాఅని మీరు డబ్బులివ్వబోతే మాత్రం చుక్క  పాలు కూడా పోయరు. పాలు అమ్మకూడదన్న ఏళ్ల నాటి కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు కర్నూలు జిల్లాలోని గంజహళ్లి, కడిమెట్ల గ్రామస్థులు. ఈ కట్టుబాటు ఎలా మొదలయింది? కట్టుబాటును మీరితే ఏమవుతుంది? ఇలాంటి అనేక అంశాలను గంజహళ్లి గ్రామస్థురాలైన గోవిందమ్మ ‘నవ్య’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...


‘‘మా ఊళ్లో నాలుగు వందలకు పైనే పశువులున్నాయి. రోజూ ఐదారు వందల లీటర్ల పాలు ఇస్తాయి. కానీ ఏ రోజు కూడా పాలను అమ్మాలని చూడం. అవసరమైన మేరకు ఇంట్లో వాడుకుంటాం. ఎక్కువయితే అడిగిన వారికి ఇస్తాం. ఒక్కపైసా కూడా తీసుకోం. ఊళ్లో వాళ్లందరూ ఇలాగే కట్టుబడి ఉన్నాం. మా ఊరుతో పాటు కడిమెట్లలోనూ ఇదే ఆచారం ఉంది. మా కన్నా వాళ్లకు ఎక్కువ పశువులు ఉన్నాయి. హోటల్‌ నిర్వాహకులు పక్కనే ఉన్న గోనెగండ్ల, ఎమ్మిగనూరు ప్రాంతాల నుంచి పాలు తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటారు. ఈ ఆచారం 400 ఏళ్లుగా వస్తోంది. పాలు అమ్మకూడదు అనడం వెనక రకరకాల కథలు ఉన్నాయి. కొందరు బడేసాబ్‌ తాత కారణమని, మరికొందరు ఊరి దేవుడు చెన్నకేశవ స్వామి కారణమని చెబుతుంటారు. ఊరి జనం భక్తితో పిలుచుకునే తాత పేరు సద్గురు బడేసాహెబ్‌. ఆయన 1667 ఏటా ఆయన సజీవ సమాధి అయ్యారు. 


గంజహళ్లిలో బడే సాబ్‌ తాత

గోనెగండ్ల మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో మా ఊరుంది. నాలుగు వందల ఏళ్ల క్రితం మా ఊళ్లో పాడి పశువులకు అంతుచిక్కని వ్యాధి సోకిందట. కొన్ని గోవులు, గేదెలు మృత్యువాత పడగా, కొన్ని పశువులు పాలివ్వడం మానేశాయట. మా ఊళ్లో రాజయోగి (సద్గురు బడేసాబ్‌తాత) ఉండేవాడు. ఆయనకు పాలు తాగాలనిపించి, తన కొడుకు హుస్సేన్‌ సాహెబ్‌ను పాలు తీసుకురమ్మని ఊరిలోకి పంపించాడట. పశువులన్నింటికి జబ్బు చేయడంతో ఏ ఒక్కరూ పాలు పోయలేదు. చివరకు గ్రామ పెద్దయిన పెద్దనాగిరెడ్డి ఇంటికి వెళ్లగా తమ గోవు తీవ్రమైన వ్యాధితో ప్రాణం వదిలిందని, ఊరి చివరనున్న మారెమ్మ ఆలయం వద్ద ఆ కళేబరాన్ని పడేశామని చెప్పాడట. అయితే పాలు కచ్చితంగా తీసుకెళ్ళాలని  హుస్సేన్‌సాహెబ్‌ మారెమ్మవ్వ గుడి వద్దకు వెళ్ళాడట. పాలు తీసుకెళ్ళకపోతే తనతండ్రి కోప్పడతాడని హుస్సేన్‌సాహెబ్‌ మారెమ్మను ప్రార్థించాడట. అతడి ప్రార్థనకు ప్రసన్నురాలైన ఆ తల్లి ‘మీ తండ్రి నామాన్ని ఉచ్చరిస్తూ ఆవును లేపు’అని చెప్పిందట. మారెమ్మవ్వ దేవత చెప్పిన ప్రకారమే తనతండ్రి పేరును ఉచ్చరిస్తూ... ‘బాబాబోలీ దూద్‌దేవ్‌’ అన్నాడట. ఆ మాటలకు ఆవు లేచి హుస్సేన్‌సాహెబ్‌కు పాలు ఇచ్చిందట. ఇప్పటికీ ఈ కథ ఊళ్లలో చెప్పుకుంటూ ఉంటారు. ఆ వింతను చూసిన జనం పశువులు చనిపోకుండా మార్గం చూపండని బడేసాబ్‌ను అడగ్గా గ్రామస్థులెవరూ ఇక నుంచి ఊళ్లో పాలు అమ్మరాదని, పశువులను చంపకూడదని, పశుగ్రాసాన్ని తగుల బెట్టరాదని సూచించారట. ఈ కట్టుబాటుకు లోబడి ఉండాలని ఊరి జనంతో మాట తీసుకున్నారట. ఆ రోజు నుంచి పాడి పంటలతో గ్రామం వృద్ధి చెందుతూ వచ్చిందట. ఆ మాటను ధిక్కరించి పాలు అమ్మిని వారి ఇళ్లలో పాడి పశువులు లేకుండా పోయాయి. కొందరు అనారోగ్యం పాలయ్యారు. మరికొందరు   బికారులయ్యారు. అవన్నీ చూసిన గ్రామ ప్రజలు కట్టుబాటును విస్మరించే సాహసం చేయలేదు.


కడిమెట్లలో చెన్నకేశవుడు

ఎమ్మిగనూరుకు 8 కిలోమీటర్ల దూరంలో కడిమెట్ల గ్రామం ఉంది. ఈ ఊళ్లో ఇప్పటికీ పాలు అమ్మకూడదనే ఆచారం కొనసాగుతోంది. గ్రామంలో పాడిసంపద పుష్కలంగా ఉన్నా పాలు అమ్మి సొమ్ము చేసుకుందామని చూడరు. ఈ ఆచారం వెనక ఒక కథ ఉంది. గ్రామస్థుల ఆరాధ్య ధైవమైన చెన్నకేశవస్వామి పూర్వ కాలంలో యాదవ కులస్థులకు పెట్టిన శాపం ఫలితమని అంటారు. కొందరు పెద్దలు మాత్రం పెద్దలు పెట్టిన కట్టుబాటును కొనసాగిస్తున్నామని అంటారు. ఆవులు, బర్రెలు ఈనితే వాటి పాలను ముందుగా చెన్నకేశవస్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. తరువాత అవసరాలకు వాడుకుంటారు. గ్రామంలో ఉన్న కొన్ని యాదవ కుటుంబాల్లో పాలు తాగడంలో కూడా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. శనివారం రాత్రి పూట, ఆదివారం ఉదయం మాత్రమే పాలు తాగుతారు. మిగతా రోజుల్లో తాగరు. జబ్బు చేసిన వారికి, పసి పిల్లలకు ఉచితంగా పాలు పోయడం లేదా మజ్జిగ అందించడం చేస్తుంటారు’’ అని చెప్పుకొచ్చారు గోవిందమ్మ.


పెద్దలు చెప్పిన మాట! 

పాలు అమ్మిన ఇల్లు పాడైపోతుందని పెద్దలు చెప్పారు. ఆ మాటకు విలువ ఇచ్చి, ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నాం. వంద ఆవులు ఉన్నప్పుడు కూడా పాలు అమ్మలేదు. గ్రామస్థులు ఎవరైనా అడిగితే నెలంతా ఉచితంగా పోస్తాం.  

- చిన్నరామన్న, కడిమెట్ల


ఈ ఆచారం ఇప్పటిది కాదు 

నాకు 90ఏళ్లు ఉంటాయి. నేను పుట్టక ముందు నుంచి మా గ్రామంలో ఈ ఆచారముంది.  దీన్ని ధిక్కరించిన వారికి ఎదో ఒక నష్టం జరుగుతుంది. అందుకే నేటికి ఈ ఆచారం అనుసరిస్తున్నాం. 

- సుంకిరెడ్డి, గంజహళ్లి


- మధుసూదన్‌ ఘట్టమనేని, కర్నూలు


Updated Date - 2020-10-07T06:14:40+05:30 IST