వారిని చూసి వావ్ అనాల్సిందే..
ABN , First Publish Date - 2020-03-16T06:08:57+05:30 IST
మహిళల భద్రత ఈ రోజుల్లో గాల్లో దీపం చందంగా మారింది. దాంతో క్యాబ్ ప్రయాణాల పట్ల కూడా మహిళల్లో కొంత అభద్రతాభావం నెలకొని ఉంటోంది. ఇలాంటప్పుడు ఒంటరి మహిళలు ఎలాంటి భయానికీ లోను...
- అవసరాలు బతుకుదెరువుకు బాటలు వేస్తాయి!
- ఒకరివి ఆర్థిక ఇబ్బందులైతే, మరొకరివి పిల్లల అనారోగ్యాలు.
- ఏదైతేనేం... కష్టం వచ్చిందని కుంగిపోకుండా అవకాశాన్ని
- అందిపుచ్చుకున్నారా మహిళలు! తొలి మహిళా క్యాబ్ డ్రైవర్లుగా సాటి మహిళలను గమ్యాలకు చేరవేసే విధుల్లో చేరబోతున్నారు!
- వీరికి చేయూతనిచ్చిన ‘యోదీ’ సంస్థ వ్యవస్థాపకురాలు, ఫిక్కీ (ఎఫ్‌ఎల్‌ఓ) మాజీ ఛైర్‌పర్సన్ జ్యోత్స్న అంగారాను, ‘ఉమెన్ ఆన్ వీల్స్’ (వావ్)ను ‘నవ్య’ కలిసింది! వారి ఆశలు, ఆశయాలు ఇలా వెల్లడయ్యాయి!
మహిళల భద్రత ఈ రోజుల్లో గాల్లో దీపం చందంగా మారింది. దాంతో క్యాబ్ ప్రయాణాల పట్ల కూడా మహిళల్లో కొంత అభద్రతాభావం నెలకొని ఉంటోంది. ఇలాంటప్పుడు ఒంటరి మహిళలు ఎలాంటి భయానికీ లోను కాకుండా, ప్రయాణాలు చేయాలంటే ఆ క్యాబ్ నడిపే వ్యక్తి మహిళ అయి ఉండాలి. అలాగే అలా క్యాబ్ డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకునే మహిళ కూడా అంతులేని మానసిక స్థయిర్యం కలిగి ఉండాలి. వృత్తిని ప్రేమించడంతో పాటు, నిబద్ధతతో పని చేయగలగాలి. ఇలా రెండు కోణాల్లో మహిళలకు తోడ్పడేలా, అవసరంలో ఉన్న మహిళలకు స్వయం స్వావలంబన కలిగించడంతో పాటు, అదే సమయంలో సాటి మహిళలకు ప్రయాణ అవసరాలు తీరేలా ఓ వినూత్న ప్రయత్నానికి పూనుకున్నారు ఫిక్కీ మాజీ అధ్యక్షురాలు, యోది సంస్థ స్థాపకురాలు జ్యోత్స్న అంగారా.
అందుకోసం తన స్వీయ సంస్థ ‘యోషా ధిదితి’ సహాయంతో 36 మంది పేద మహిళలను ఎంపిక చేసి కారు నడపడంలో శిక్షణ ఇప్పించారు. వారికి బ్యాంకు రుణ సదుపాయంతో కార్లు ఇప్పించారు. ఆ మహిళా క్యాబ్ డ్రైవర్లలో ఆత్మస్థయిర్యాన్ని నింపి, వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఈ ఆలోచన వచ్చింది మొదలు కార్యరూపం దాల్చడానికి సరిగ్గా నాలుగేళ్ల సమయం పట్టింది అంటున్నారామె. ఈ సంకల్పం వెనక ఎంతో పరిశోధన, అంతర్మథనం జరిగిందని కూడా చెప్పారు. ఆమె ఏమన్నారంటే....
నాలుగేళ్ల శ్రమ!
‘ఉమెన్ ఆన్ వీల్స్’ నా నాలుగేళ్ల కల. 2016లో ఈ ఆలోచన వచ్చినప్పుడు దీనిలో ఉన్న ఇబ్బందులు, లోటుపాట్ల గురించి పరిశోధన మొదలుపెట్టాను. గ గతంలో ఇలాంటి ఉద్దేశంతోనే మొదలైన ‘షీ క్యాబ్స్’ పలు కారణాల వల్ల విఫలమైంది. షీ క్యాబ్స్ విఫలమవడానికి దారితీసిన అంశాలను తెలుసుకొని అలాంటి వాటికి ఆస్కారం లేకుండా ‘ఉమెన్ ఆన్ వీల్స్’ను రూపొందించాను. అయితే అన్నిటికన్నా పెద్ద సవాల్ ఎటువంటి ష్యూరిటీ లేకుండా కార్ల కొనుగోలుకు బ్యాంకు రుణం పొందడం. ఈ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డి.జి.ఎమ్ వినీతా భట్టాచార్య మహిళ అయి ఉండడం మాకు కలిసివచ్చింది. ఆవిడ మా ప్రయత్నాన్ని ప్రోత్సహించి, రుణసదుపాయం కల్పించారు. అయితే డ్రైవింగ్ పురుషులకు పరిమితమైన రంగం.
ఇదే వృత్తిలో మహిళలకు ఎదురయ్యే భిన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, వాటిని ఎదుర్కొనే నేర్పరితనం, మెలకువలు నేర్పాం. స్థయిర్యం కల్పించడం కోసం, శిక్షణకు రెండేళ్లు కేటాయించాం. శిక్షణలో భాగంగా మారుతీ డ్రైవింగ్ స్కూల్‌లో డ్రైవింగ్‌తో పాటు, చిన్నా చితకా రిపేర్లు, షీ టీమ్స్ సహాయంతో ఆత్మరక్షణ మెలకువలు కూడా నేర్పించాం. ఒత్తిడిని తగ్గించే యోగా, ఇంగ్లీషు, హిందీ భాషల్లో పట్టు ఏర్పడేలా కూడా శిక్షణ ఇప్పించాం. అంతే కాదు. రుణంతో అందిస్తున్న వాహనాలు కాబట్టి అప్పు తీరేవరకూ మహిళా డ్రైవర్లు వెనుకంజ వేయకుండా అదే వృత్తిలో కొనసాగగలగాలి. రోజంతా కారు నడపడంతో పాటు కుటుంబాన్నీ నడపగలగాలి. కుటుంబ తోడ్పాటు ఉండవచ్చూ, ఉండకపోవచ్చు. అయినా పట్టుదలతో వృత్తి జీవితంలో నెగ్గగలగాలి. ఇలా అన్ని కోణాల్లోనూ ఆలోచించి అందుకు అవసరమైన ఏర్పాట్లు, శిక్షణ పూర్తి చేయడానికి ఇంత సమయం పట్టింది.
సీఎన్‌జీ కార్లు!
‘ఉమెన్ ఆన్ వీల్స్’ ఉపయోగించేవన్నీ మారుతి సెలేరియో సీఎన్‌జీ కార్లే. ఈ కార్లన్నీ వి6 ఇంజన్ రకానికి చెందినవి. ఒక్కో కారు ఖరీదు 5 లక్షల 25 వేలు. 2.25 లక్షల సబ్సిడీ ఇప్పించాం. కారు నడపగా వచ్చే ఆదాయం నేరుగా డ్రైవర్ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఆ అకౌంట్ నుంచి వాయిదాల పద్ధతిలో నెల నెలా రుణం బ్యాంకుకు వెళ్లిపోతూ ఉంటుంది. కాబట్టి ఇతర క్యాబ్ సర్వీసులోలా ఆదాయం నుంచి క్యాబ్ కంపెనీకి చెల్లింపులేవీ ఉండవు. కాబట్టి ఈ మహిళల కష్టానికి తగిన ఫలం దక్కుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ‘ఉమెన్ ఆన్ వీల్’ క్యాబ్ సేవలు పగటి వేళల్లోనే అందుబాటులో ఉంటుంది. మున్ముందు రాత్రుళ్లూ నడుస్తాయి. మరో 20 కార్లు త్వరలో రోడ్డెక్కబోతున్నాయి. మున్ముందు మహిళా ‘వావ్’ ఆటో డ్రైవర్లను కూడా ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మా వారు కూడా కారు డ్రైవరే. కానీ ఆయన సంపాదనలో ఏమీ గల్చలేకపోతున్నారు. దాంతో ఆయన చేయలేని పని నేను చేసి చూపిస్తానని శపథం చేశాను. అందుకోసమే ఈ వృత్తిలోకి వచ్చాను. సాధారణ డ్రైవింగ్ క్లాసులు 10 రోజుల వరకే ఉంటాయి. కానీ మాకు మూడు నెలల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ సాగింది కాబట్టి ఎలాంటి తడబాటు లేకుండా కారు నడపగలను. రిస్కులు, ఇబ్బందులు ప్రతి రంగంలోనూ ఉంటాయి. అలాగే డ్రైవింగ్‌లో కూడా. మరీ ముఖ్యంగా మహిళలకు ఈ రంగంలో సవాళ్లూ ఎక్కువే. అయినా నెగ్గుకురాగలననే నమ్మకం నాకు ఉంది. ఈ వృత్తిలో ఓపిక ఉన్నంత కాలం కొనసాగుతాను.
- తిప్పన శారద, మిర్యాలగూడ.
పేపర్‌లో యాడ్ చూడగానే, డ్రైవింగ్ నేర్చుకుని, ఉపాధి పొందవచ్చనే ఆలోచన వచ్చింది. దాంతో వెంటనే చేరిపోయాను. మా వారు ఎలక్ట్రీషియన్. పిల్లల చదువుల ఖర్చు, ఇల్లు గడవడానికి ఆయన ఆదాయం సరిపోవడం లేదు. దాంతో ఈ వృత్తి అక్కరకొస్తుందనే ఆలోచన కూడా నేను డ్రైవర్‌గా మారడానికి కారణం. డ్రైవింగ్‌తో నెలకు రూ. 10 నుంచి 15 వేలు సంపాదించవచ్చనే నమ్మకం నాకుంది.
- మలిగిరెడ్డి సౌజన్య, వనస్థలిపురం, హైదరాబాద్.
కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను పెద్దగా చదువుకోలేకపోయాను. దాంతో చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. పిల్లలు పుట్టిన తర్వాత ఆయన నన్ను వదిలేశారు. అప్పట్లో నా దగ్గర టాటా ఏస్ ఉండేది. దాన్ని నడపడం నేర్చుకున్నా. ఆ తర్వాత మారుతి డ్రైవింగ్ స్కూల్‌లో నాలుగేళ్ల పాటు ఉద్యోగం కూడా చేశా. అయితే ఆ ఉద్యోగంలో కష్టానికి తగిన ఫలం దక్కేది కాదు. దీనిలో మనం కారు నడిపినంత మేరకు ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఈ ఆలోచనతో జ్యోత్స్న గారిని కలిసి, ‘ఉమెన్ ఆన్ వీల్స్’లో చేరాను. మున్ముందు పిల్లల చదువులకు నా ఆదాయం తోడ్పడితే చాలు.
- డి.శారద, ఓల్డ్ సిటీ, హైదరాబాద్
మాది నిరుపేద కుటుంబం. బాబుకు గుండె జబ్బు. చికిత్స చేయించే స్థోమత లేదు. మావారు స్కూల్ బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు వచ్చే రూ. 12 వేల జీతంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నప్పుడు, బాబుకు చికిత్స ఎలా చేయించగలం? మిగతా వృత్తుల్లో పనివేళలు ఎక్కువ. కానీ ఈ వృత్తిలో అవసరానికి తగ్గట్టు పని చేసుకోగలిగే వెసులుబాటు ఉంది. కాబట్టి బాబు చికిత్సకు డబ్బు సమకూర్చగలను అనే నమ్మకంతో ఈ వృత్తి ఎంచుకున్నాను. కారు నడపడం పురుషులకే సొంతమైన నైపుణ్యం కాదు. ‘మహిళలం కూడా అంతే సమర్ధంగా కారు నడపగలం’ అని కూడా నిరూపించాలనే పట్టుదల కూడా ఉంది.
- - వాకిటి ధనలక్ష్మి, ఎల్.బి.నగర్, హైదరాబాద్
- - గోగుమళ్ల కవిత
- ఫొటోలు: అశోకుడు