వారందరికీ షాక్ ఇచ్చిన టీఆర్ఎస్..

ABN , First Publish Date - 2020-11-21T14:26:09+05:30 IST

మొదటి నుంచి చెబుతున్నట్టుగానే టీఆర్‌ఎస్‌ కొందరు సిటింగ్‌లకు షాక్‌ ఇచ్చింది. 27 మంది సిటింగ్‌ల స్థానంలో ఇతరులకు అవకాశం కల్పించారు. ఇందులో కొందరు అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో అభ్యర్థులే పోటీకి నిరాసక్తత చూపగా.. స్థానికంగా నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలోనే మిగతా

వారందరికీ షాక్ ఇచ్చిన టీఆర్ఎస్..

హైదరాబాద్ :  మొదటి నుంచి చెబుతున్నట్టుగానే టీఆర్‌ఎస్‌ కొందరు సిట్టింగ్‌లకు షాక్‌ ఇచ్చింది. 27 మంది సిటింగ్‌ల స్థానంలో ఇతరులకు అవకాశం కల్పించారు. ఇందులో కొందరు అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో అభ్యర్థులే పోటీకి నిరాసక్తత చూపగా.. స్థానికంగా నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలోనే మిగతా వారిని అధిష్ఠానం మార్చినట్టు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు టీఆర్‌ఎస్‌ మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో బీ-ఫారంలు కూడా అందజేసింది. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 99 స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు కార్పొరేట ర్లు పార్టీని వీడగా... టీడీపీ, కాంగ్రె్‌సల నుంచి ఒక్కో కార్పొరేటర్‌ గులాబీ గూటికి చేరారు. దీంతో గ్రేటర్‌లో అధికార పార్టీ సిటింగ్‌ల సంఖ్య 99గా ఉంది.


27 మంది సిటింగ్‌లకు నో ఛాన్స్‌...

అభ్యర్థుల ఎంపికపై టీఆర్‌ఎస్‌ భారీ కసరత్తు చేసింది. ఇంటెలిజెన్స్‌ నివేదికలతో పాటు ప్రైవేట్‌ ఏజెన్సీలతో నాలుగు సర్వేలు చేయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిటింగ్‌లు, ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం సేకరించారు. ఆ నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 27 మంది సిటింగ్‌లను మార్చారు. మూడో జాబితాలో 25 మందిని ప్రకటించగా.. 17 మంది సిటింగ్‌లకు ఛాన్స్‌ దక్కలేదు. వ్యూహాత్మకంగానే ఈ జాబితాను ఆలస్యంగా విడుదల చేసినట్టు చెబుతున్నారు. వీరిలో సోమాజిగూడ కార్పొరేటర్‌ అత్తలూరి విజయలక్ష్మి అనారోగ్య కారణాలతో పోటీ చేయనని ముందే చెప్పారు. మియాపూర్‌ కార్పొరేటర్‌ మరణించడంతో ఆయన స్థానం లో మరొకరికి అవకాశం కల్పించారు. మెట్టుగూడ, బౌద్ధనగర్‌, అడ్డగుట్ట, సుభా్‌షనగర్‌, గోల్నాక స్థానాల నుంచి సిటింగ్‌ల నిరాసక్తత నేపథ్యంలో ఇతరుల పేర్లు ఖరారు చేసినట్టు చెబుతున్నారు. అత్యధికంగా ఉప్పల్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో నలుగురు చొప్పున సిటింగ్‌లను మార్చారు.


చర్లపల్లి డివిజన్‌ నుంచి మేయర్‌ బొంతు రామ్మోహన్‌ స్థానంలో ఆయన సతీమణి బొంతు శ్రీదేవీయాదవ్‌ను బరిలో నిలిపారు. 

సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని తార్నాక కార్పొరేటర్‌ అలకుంట సరస్వతి స్థానంలో మోతె శ్రీలతకు అవకాశం దక్కింది. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ తనకు టికెట్‌ రాకుండా చేశారని ఆరోపించిన సరస్వతి తిరుగుబాటుదారుగా నామినేషన్‌ వేశారు. 

ఉప్పల్‌ నియోజకవర్గంలోని చిలుకానగర్‌, ఉప్పల్‌, హెచ్‌బీ కాలనీ కార్పొరేటర్లు గోపు సరస్వతి, మేకల అనలా రెడ్డి, గొల్లూరి అంజయ్యలకు నిరాశే మిగిలింది. 

శేరిలింగంపల్లి డివిజన్‌లో చందానగర్‌, హైదర్‌నగర్‌, వివేకానందనగర్‌ కాలనీల కార్పొరేటర్లు బొబ్బ నవతారెడ్డి, జానకి రామరాజు, లక్ష్మిబాయిలకు అవకాశం దక్కలేదు. మేకా రమేష్‌ మరణంతో మియాపూర్‌ అభ్యర్థిని మార్చారు. 

మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, గౌతమ్‌నగర్‌, నేరేడ్‌మెట్‌ సిటింగ్‌లు ఆకుల నర్సింగరావు, శిరీషా జితేందర్‌రెడ్డి, కే శ్రీదేవిలకు మొండిచేయి చూపారు. 

అంబర్‌పేట నియోజకవర్గంలో గోల్నాక, కాచిగూడ, అంబర్‌పేట కార్పొరేటర్లు కాలేరు పద్మ, ఎక్కాల చైతన్య, పులి జగన్‌లకు అవకాశం రాలేదు.

Updated Date - 2020-11-21T14:26:09+05:30 IST