అన్నీ తానై పనిచేస్తున్న రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2020-11-27T17:20:51+05:30 IST

ఆ పార్టీలో నలుగురికి నచ్చినది ఆయనకు నచ్చదు. నలుగురికి నచ్చనిదే ఆయనకు నచ్చుతుంది.

అన్నీ తానై పనిచేస్తున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఆ పార్టీలో నలుగురికి నచ్చినది ఆయనకు నచ్చదు. నలుగురికి నచ్చనిదే ఆయనకు నచ్చుతుంది. అందుకే అక్కడ నిండు రేవంత్‌ ఒకవైపు.. మిగతా లీడర్లు మరోవైపు.. ఆయన సోలోగా మీట్ ది ప్రెస్ కానిచ్చేశారు. గాంధీభవన్‌లో మేనిఫెస్టో విడుదలకు మాత్రం డుమ్మాకొట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ హడావుడి కనిపించడంలేదు. అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్న సందర్భాలు తక్కువే. అభ్యర్థులే తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లుగా చెప్పుకునే నేతలు ఎన్నికల్లో అంటీ అంటనట్లు ఉన్నా.. ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం తన వంతుగా కనీసం 30 డివిజన్లలో పార్టీని గెలిపించేందుకు పనిచేస్తున్నారు. 


నగరంలోని 150 డివిజన్ల సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ ఆశలు మల్కాగ్జిరి పార్లమెంట్ పరిధిలోని డివిజన్లమీదే పెట్టుకుంది. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 47 డివిజన్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్.. పతిష్టాత్మకంగా తీసుకున్నారు. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి పార్టీలో తన పరపతిని మరింత పెంచుకోవాలని కసిగా పనిచేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం అన్నీ తానే అయి పనిచేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అన్ని చోట్ల వెనుకబడినా.. మల్కాగ్జిరి పరిధిలోని డివిజన్లకు మాత్రం ఆయన అభ్యర్థులను వెంటనే ప్రకటించారు. అన్ని డివిజన్లకు సీతక్క వంటి నేతలను ఇన్చార్జులుగా నియమించి వెంటనే ప్రచారం ప్రారంభించారు. అన్ని స్థానాల్లో ప్రచారం చేస్తున్నా.. కనీసం 30 స్థానాల్లో అయినా గెలుస్తామన్న ధీమాను రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. వాటిపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.

Read more