పిల్లలకు ఆ ఆహారం పెట్టవచ్చా..?

ABN , First Publish Date - 2020-07-19T23:03:21+05:30 IST

ప్రశ్న: పది సంవత్సరాల వయసున్న పిల్లలకు ప్రతిరోజూ మాంసాహారం పెట్టవచ్చా?

పిల్లలకు ఆ ఆహారం పెట్టవచ్చా..?

ఆంధ్రజ్యోతి(19-07-2020)

ప్రశ్న: పది సంవత్సరాల వయసున్న పిల్లలకు ప్రతిరోజూ మాంసాహారం పెట్టవచ్చా?


- పిల్లా నారాయణస్వామి, చిత్తూరు 


డాక్టర్ సమాధానం: కోడి, మాంసం, గుడ్లు మరియు చేపలు మొదలైనవన్నీ మాంసాహారం కింద పరిగణించబడతాయి. ఈ రకమైన ఆహారంలో ప్రొటీన్‌ మరియు విటమిన్‌ బి పుష్కలంగా ఉంటాయి. మాంసాహారం మన కండరాలను బలపరుస్తుంది. అధిక ఐరన్‌ ఉండడం వలన మాంసాహారం రక్తంలోని హిమోగ్లోబిన్‌ను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. మాంసాహారంలో బీ 12 కూడా ఎక్కువే. వీటన్నిటితో పాటు మాంసాహారంలో సాచ్యురేటెడ్‌ కొవ్వులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల పరిమితి దాటి మాంసాహారం తీసుకుంటే ఇబ్బందులు కూడా వస్తాయి. సమతుల్యమైన ఆహారపు అలవాట్లలో భాగంగా రోజూ మితంగా మాంసాహారం తీసుకుంటే మంచిదే కానీ శాకాహారం మానేసి అధికంగా మాంసాహారం తీసుకుంటే మాత్రం దుష్పరిణామాలుంటాయి. చిన్న పిల్లలకు అవసరమైన పలు రకాల పోషకాలను మాంసాహారం అందిస్తుంది కాబట్టి ప్రతిరోజూ వారికి మాంసాహారం పెట్టడం మంచిదే కానీ, కేవలం ఒక పూట మాత్రమే, అది కూడా యాభై నుండి వంద గ్రాములకు మించకుండా మాత్రమే పెట్టాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మలబద్దకం కూడా వచ్చే అవకాశం ఉంది. మాంసాహారం తీసుకునే పూట తప్పనిసరిగా దానితో పాటు కొంత ఆకుకూర, సలాడ్స్‌ కూడా పెడితే పిల్లలకు మలబద్దకం సమస్య రాదు. బయట నుంచి తెచ్చినది, డీప్‌ ఫ్రై చేసినది, బాగా నూనె ఎక్కువ వేసి వండినది అయితే రోజుకు ఒకపూట మాత్రమే మాంసాహారం తీసుకున్నా పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లో తక్కువ నూనె వేసి వండినదైతే పరవాలేదు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-07-19T23:03:21+05:30 IST