వరదల వేళ.. తొలి మహిళా మేయర్.. ఏం చేశారో తెలుసా..?

ABN , First Publish Date - 2020-11-21T18:01:14+05:30 IST

ఒంటి చేత్తో కుటుంబాన్ని నెట్టుకొచ్చే మహిళలు పరిపాలనా రంగంలోనూ అంతకంటే ఎక్కువ నేర్పుతో వ్యవహరించగలరనడానికి రాజకీయ క్షేత్రంలో రాణించిన, రాణిస్తున్న నాయకురాళ్లే నిదర్శనం. ఆ పరంపరలో జానంపల్లి రాణి కుముదినీ దేవి ఒకరు. అర్ధ శతాబ్దం కిందటే చారిత్రక నగర పీఠంపై మేయర్‌గా కొలువుదీరిన ఆమె పరిపాలనా దక్షతకు స్ఫూర్తి. బల్దియా నేతలకూ ఆదర్శనీయం.

వరదల వేళ.. తొలి మహిళా మేయర్.. ఏం చేశారో తెలుసా..?

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి) : ఒంటి చేత్తో కుటుంబాన్ని నెట్టుకొచ్చే మహిళలు పరిపాలనా రంగంలోనూ అంతకంటే ఎక్కువ నేర్పుతో వ్యవహరించగలరనడానికి రాజకీయ క్షేత్రంలో రాణించిన, రాణిస్తున్న నాయకురాళ్లే నిదర్శనం. ఆ పరంపరలో జానంపల్లి రాణి కుముదినీ దేవి ఒకరు. అర్ధ శతాబ్దం కిందటే చారిత్రక నగర పీఠంపై మేయర్‌గా కొలువుదీరిన ఆమె పరిపాలనా దక్షతకు స్ఫూర్తి. బల్దియా నేతలకూ ఆదర్శనీయం. కుముదినీ సేవలను స్మరించుకోవడం ఇప్పటి ప్రాసంగికత కూడా. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చరిత్రలో తొలి మహిళా మేయర్‌గా 1962లో రాణి కుముదిని దేవి ఎంపికయ్యారు. ఆమె హైదరాబాద్‌ సంస్థానం చివరి ఉప ప్రధాని పింగళి వెంకటరమణా రెడ్డి కుమార్తె. వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వరరావు - 2 కుమారుడు రాజా రామ్‌దేవ్‌రావ్‌కి సతీమణి. అయితే ఆమె కుటుంబ నేపథ్యానికున్న పరపతికి దూరంగా, ప్రజాక్షేత్రంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. 1957లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హెల్త్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అప్పటికే ఆమె సికింద్రాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని బేగంపేట డివిజన్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్‌ ఇలాకాలో కుష్ఠు వ్యాధి చికిత్సా కేంద్రం నెలకొల్పాలని కౌన్సిల్‌లో ప్రతిపాదన పెట్టారు. అందుకు మిగతా సభ్యులంతా వ్యతిరేకించారు. దాంతో ఆమె 1958లోనే కుష్ఠు రోగుల చికిత్స కోసం సొంతంగా శివానంద ఆశ్రమం నెలకొల్పారు. 


1962 వరద సమయంలో....

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు, 1955 ప్రకారం... 1960, ఆగస్టు మూడున సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ కార్పొరేషన్లను కలిపారు. దాంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌గా రూపాంతరం చెందింది. 1962లో రాణి కుముదిని దేవి నగర ప్రథమ మహిళ (తొలి మేయర్‌)గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది, నగరాన్ని వరదలు ముంచెత్తాయి. పాతబస్తీతో పాటు పశ్చిమ ప్రాంతంలోనూ కొన్ని కాలనీలు నీటమునిగాయి. కొన్ని వందల మంది నిలువ నీడలేక రోడ్డున పడ్డారు. ఆ సమయంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆ కేంద్రాలను వరద బాధితులకు తాత్కాలిక పునరావాస కేంద్రాలుగా మలిచారు. వారందరికీ పదిరోజుల పాటు ఆహారం, రోగులకు ఉచిత చికిత్స, మందులు అందించారు. నగర మేయర్‌గా ఆమె నేరుగా ఆనాటి ప్రధాని నెహ్రూని కలిసి నగరానికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సిందిగా కోరారు. కుముదిని దక్షత చూసి, నెహ్రూ అభినందించడమేగాక, వెంటనే ప్రత్యేక సాయం ప్రకటించినట్లు ఆమె జ్ఞాపకాలు పుస్తకంలో ప్రస్తావించారు. 


నౌబత్‌ పహాడ్‌ పార్కు...

యాభై ఏళ్ల కిందటే నగర సుందరీకరణలో భాగంగా కుముదిని పాలనలో అప్పటి నౌబత్‌ పహాడ్‌ (ఇప్పుడు లేదు) వద్ద పీపుల్స్‌ పార్కును రూపొందించారు. నిజాం ట్రస్ట్‌ నిధుల సహకారంతో పేదల కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. నిజామ్స్‌ ఉమెన్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌గానూ పలు విద్యాసంస్థలు నెలకొల్పడంలో కుముదిని కీలక పాత్ర వహించారు. అనాథ బాలికల కోసం విజయనగర్‌కాలనీలో సేవాసమాజ వసతిగృహాన్ని స్థాపించారు. తద్వారా కొన్ని వందల మంది ఆడపిల్లలకు ఆశ్రయం కల్పిస్తూ, ఆదరవుగా నిలిచారు. తన భర్త రాజా రాందేవ్‌రావు పేరుతో కూకట్‌పల్లిలో ఆస్పత్రిని నెలకొల్పారు. కుముదిని ప్రారంభించిన శివానంద ఆశ్రమం, రాందేవ్‌రావు ఆస్పత్రుల సేవలు నేటికీ కొనసాగుతున్నాయి. నగరంలో నామమాత్రపు ఫీజులో డయాలసిస్‌ చికిత్సనందించే కేంద్రంగా రాందేవ్‌ రావు ఆస్పత్రికి పేరు. అదే ఆవరణలో 350 బెడ్ల క్షయ చికిత్సాలయం, ప్యాలేటీవ్‌ కేర్‌ సెంటర్‌ తదితర వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. 


రెండు పదవుల్లోనూ...

నగర మేయర్‌గా సేవలందిస్తూనే, 1962 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి ఎమ్మెల్యేగానూ గెలుపొందారు. 1964వరకూ మేయర్‌ హోదాలో కొనసాగారు. అనంతరం 1972లో శాసనసభ సభ్యురాలిగా కొనసాగారు. అనంతరం ఎన్నికల్లో ఆమె భర్త సోదరుడి కుమారుడు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న కారణంగా, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రాజకీయాల్లో ఉండటం సహేతుకం కాదని భావించి, ప్రజా క్షేత్రం నుంచి స్వచ్ఛందంగా పక్కకు తొలిగారు. అదే సమయంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో మరింత నిమగ్నమయ్యారు. పరిపాలనా దక్షతను, సేవా నిరతిని కలిగిన రాణి కుముదిని 2009, ఆగస్టు ఆరున తుదిశ్వాస విడిచారు. చివరి వరకూ పరుల కోసం పరితపించిన కుముదిని దేవి సేవలు నగర యవనికపై సుస్థిరం.


Updated Date - 2020-11-21T18:01:14+05:30 IST