స్టార్ క్యాంపెయినర్లు సక్సెస్!
ABN , First Publish Date - 2020-12-05T18:21:03+05:30 IST
టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా.. అన్నట్టు పోటీ పడిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు సత్తా చాటారు.

హైదరాబాద్ సిటీ, డిసెంబరు 4 (ఆంధ్ర జ్యోతి): టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా.. అన్నట్టు పోటీ పడిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు సత్తా చాటారు. మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ తరఫున అన్నీ తానే అయి ప్రచారం నిర్వహించగా.. బీజేపీ మాత్రం అతిరథ మహారథులైన పలువురు రంగంలోకి దింపి అందుకు తగినట్టుగా లబ్ధి పొందింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. గ్రేటర్ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ప్రభావం స్పష్టంగా కనపడిందంటే అతిశయోక్తి కాదు.
ఆ పార్టీ తరఫున.. రాష్ట్రానికి చెందిన నేతలైన కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, డీకే అరుణతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జావడేకర్, స్మృతి ఇరాని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ప్రచారంలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
వారు నిర్వహించిన రోడ్‌షోలు ప్రజలను ఆకర్షించాయి. దీంతో.. 2016 గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 4 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ.. ఈసారి తన బలాన్ని 48కి పెంచుకుంది. కేంద్రమంత్రుల రాక, రోడ్‌షోలతో గ్రేటర్ ప్రజల దృష్టిని ఆకర్షించడంలో బీజేపీ విజయం సాధించింది.