ఆ స్కూల్ నుంచే వచ్చిన కేసీఆర్ సీఎం అయ్యారు: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-11-26T17:23:13+05:30 IST

పీవీ నరసింహారావు, ఎన్టీరామారావు తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకలని..

ఆ స్కూల్ నుంచే వచ్చిన కేసీఆర్ సీఎం అయ్యారు: బండి సంజయ్

హైదరాబాద్: పీవీ నరసింహారావు, ఎన్టీరామారావు తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొనియాడారు. పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్‌లను కూల్చాలనీ ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పీవీ, ఎన్టీఆర్‌లు  తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తులని, అలాంటి వారి  ఘాట్‌లను కూల్చాలని కొంతమంది సంఘవిద్రోహ శక్తులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసినవారిపై సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదని మండిపడ్డారు. పీవీ, ఎన్టీఆర్‌ల స్కూల్ నుంచి వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఆయన కుమారుడికి తారక రామారావు అని పేరు కూడా పెట్టుకున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.


తెలంగాణ ఉద్యమ సమయంలో అందరిని కేసీఆర్ ఉపయోగించుకుని.. ఇప్పుడు వారిని తెరమరుగు చేశారని బండి సంజయ్ విమర్శించారు. సీఎంకు విశ్వాసం ఉంటే.. పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్‌లను కూల్చాలని చెప్పిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామని సంజయ్ అన్నారు.

Updated Date - 2020-11-26T17:23:13+05:30 IST