దమ్ముంటే అరెస్ట్ చేయండి.. సంజయ్ సవాల్

ABN , First Publish Date - 2020-11-21T20:19:41+05:30 IST

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయి మండిపడ్డారు. భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడంపై తనను ప్రశ్నిస్తున్న వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు.

దమ్ముంటే అరెస్ట్ చేయండి.. సంజయ్ సవాల్

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయి మండిపడ్డారు. భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడంపై తనను ప్రశ్నిస్తున్న వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీడియాతో శనివారం మాట్లాడిన ఆయన.. భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం పాక్ లో ఉందా.. బంగ్లాదేశ్‌లో ఉందా అని అడిగారు. భాగ్యనగర్‌కు ఆ పేరు వచ్చిందే... భాగ్యలక్ష్మి దేవి ద్వారా అన్నారు. సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని, ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్టుగా కేసీఆర్ ఉన్నారన్నారు. ఓట్లకు భయపడి మక్కాకు అయినా వెళతారనుకున్నానని ఆయన రాలేదన్నారు. మరో దేవాలయానికి అయినా వెళ్లడానికి సిద్ధమని, ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. సీఎం రాకపోవడం దురదృష్టకరమన్నారు. నిజమైన హిందువు అయితే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు రావాలని... రావడానికి ఎందుకు సంకోచమన్నారు.


ఎస్ఈసీకి అందిన లేఖ తనది కాదని, ఆ విషయాన్ని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారన్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు దీనిపై ఎందుకు స్పందించడం లేదన్నారు. తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఓ ఛానల్ లోగో మార్చి ... విషప్రచారానికి దిగారని విమర్శించారు. ‘ఎవరు రాశారు.. ఎవరు ప్రింట్ చేశారు అనే అంశంపై విచారణ చేయొచ్చు కదా... చిన్న చిన్న వాటికే .. దర్యాప్తు జరిపి అరెస్ట్ చేస్తున్న మీరు... ఈ విషయంలో నిర్లక్ష్యం ఎందుకు?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మరో వాగ్దానం చేశారు. బల్దీయా పీఠం తమ సొంతమైతే.. గతంలో ఎవరికి పదివేలు వచ్చాయో.. వారికి మళ్లీ పదివేలు ఇస్తామని హామీ ఇచ్చారు.  


విద్యాసంస్థల ఉన్న ఓ నాయకుడు రైతు బంధు సహాయాన్ని పెద్ద ఎత్తున పొందారని.. తాము అధికారంలోకి వస్తే వాటన్నింటినీ బయటకు తీస్తామన్నారు. పక్కా అందరి విషయాలను బయటపెడతామన్నారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. ‘చాతనైతే అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. ప్రభుత్వమే ఫిర్యాదు చేసింది. 30శాతం ఉన్న ముస్లింల గురించి సీఎం రెచ్చగొట్టినట్టు మాట్లాడొచ్చు.. 80శాతం హిందువుల గురించి నేను మాట్లాడితే తప్పా. మమ్మల్ని కంట్రోల్ చేసే శక్తి ఎవరికీ లేదు. ఆ శక్తి కేవలం ప్రజలకు మాత్రమే ఉంది. ఇంకా రెచ్చగొట్టడం మేం స్టార్ట్ చేయలేదు’ అని సంజయ్ వ్యాఖ్యానించారు.  

Read more