పరీక్షల రద్దు కుదరదు

ABN , First Publish Date - 2020-08-11T21:54:32+05:30 IST

‘‘డిగ్రీల ప్రదానానికి సంబంధించిన నియమనిబంధనలు రూపొందించే అధికారం ఒక్క యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌కు (యూజీసీ) మాత్రమే

పరీక్షల రద్దు కుదరదు

రాష్ట్రాలు పరీక్షల్ని రద్దు చేసేసి..

మమ్మల్ని డిగ్రీలు ఇమ్మంటే ఎలా?

సుప్రీంకోర్టులో యూజీసీ వాదన

పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు

ఇచ్చే ప్రశ్నే లేదని ఎస్‌జీ స్పష్టీకరణ

పరీక్షలకు సిద్ధంగా ఉండాలని

విద్యార్థులకు సూచన

ఆగస్టు 14న తదుపరి విచారణ


న్యూఢిల్లీ, ఆగస్టు 10: ‘‘డిగ్రీల ప్రదానానికి సంబంధించిన నియమనిబంధనలు రూపొందించే అధికారం ఒక్క యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌కు (యూజీసీ) మాత్రమే ఉంది. దీన్ని రాష్ట్రాలు మార్చలేవు. గతంలో జారీ చేసిన ఆదేశాల మేర కు సెప్టెంబరు 30లోగా ఆఖరు సంవత్సరం పరీక్షల నిర్వహణ తప్పనిసరి.’ అని సుప్రీంకోర్టులో యూజీసీ తేల్చిచెప్పింది. విపత్తు నిర్వహణ చట్టం పేరు చెప్పి పరీక్షలను రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని యూజీసీ తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పష్టం చేశారు.


ఆఖరు సంవత్సరం పరీక్షలను నిర్వహించాలన్న యూజీసీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ పలు ప్రాంతాలకు చెందిన 31 మంది విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు. ప్రస్తుతం పరీక్షల నిర్వహణ కష్టమంటూ డిగ్రీ, పీజీ ఆఖరి సంవత్సర పరీక్షలను ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి.. యూజీసీ ఆదేశాలను ప్రశ్నిస్తూ విద్యార్థులు, మహారాష్ట్ర సర్కారు దాఖలు చేసిన వ్యాజ్యాలు సోమవారం జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాషణ్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. రాష్ట్రాలు ఏకపక్షంగా వ్యవహరిస్తే విద్యార్థుల డిగ్రీలను గుర్తించకపోయే అవకాశం ఉందని తుషార్‌ మెహతా చెప్పారు. విద్యార్థులు తమ చదువును కొనసాగించాలని సూచించారు. పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీ ఇచ్చే ప్రశ్నే లేదని చెప్పారు. ‘‘యూజీసీ ఆదేశాలను విపత్తు నిర్వహణ చట్టం అధిగమించగలదా?’’ అని దర్మాసనం ప్రశ్నించింది. ఆగస్టు 14లోగా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని యూజీసీని ఆదేశించి, తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.

Updated Date - 2020-08-11T21:54:32+05:30 IST