23 శాతం మందికి 10/10

ABN , First Publish Date - 2020-06-23T17:06:18+05:30 IST

ఎప్పుడెప్పుడా అని పదోతరగతి విద్యార్థులు ఎదురుచూస్తున్న గ్రేడ్లు ఖరారయ్యాయి. 23 శాతం మంది విద్యార్థులు 10/10 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,34,903 మంది ఈసారి పరీక్షలకు పేరు నమోదు

23 శాతం మందికి 10/10

పది విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు 

మొరాయించిన వెబ్‌సైట్‌.. 

రాత్రి వరకు నిరీక్షణ 

ప్రత్యామ్నాయ వెబ్‌సైట్‌ 

ప్రారంభించిన విద్యాశాఖ


హైదరాబాద్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా అని పదోతరగతి విద్యార్థులు ఎదురుచూస్తున్న  గ్రేడ్లు ఖరారయ్యాయి. 23 శాతం మంది విద్యార్థులు 10/10 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,34,903 మంది ఈసారి పరీక్షలకు పేరు నమోదు చేసుకోగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌ (ఎఫ్‌ఏ) మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ మేరకు గ్రేడ్ల ఖరారు సోమవారం పూర్తయింది. విద్యార్థులు తమ గ్రేడ్లను అధికారిక వెబ్‌సైట్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. దీంతో అందరూ ఒక్కసారిగా వెబ్‌సైట్‌ను సందర్శించడంతో 30 నిమిషాల్లోనే సర్వర్‌ డౌన్‌ అయింది. అప్పటికే దాదాపు 1.80 లక్షల మంది విద్యార్థులు గ్రేడ్‌లను తెలుసుకున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అప్పటినుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు మీసేవ కేంద్రాలు, ఇంటర్‌నెట్‌ సెంటర్ల వద్ద బారులు తీరారు. సమస్యను గుర్తించిన విద్యాశాఖ యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రత్యామ్నాయంగా మరో క్లౌడ్‌ వెబ్‌సైట్‌ను రాత్రి 8-30 గంటలకు అందుబాటులోకి తేవడంతో సమస్య పరిష్కారమైంది. 


1,20,000 మందికి 10/10.. 

ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారందరూ ఉత్తీర్ణులయ్యారు. ఎఫ్‌ఏ మార్కులు తెలియక చాలామంది విద్యాశాఖ కేటాయించే గ్రేడ్లకోసం నిరీక్షించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మొత్తం విద్యార్థుల్లో 1,20,000కి పైగా  10/10 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. ఈ లెక్కన వీరంతా 91-100 మార్కులతో ఏ-ప్లస్‌ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం విద్యార్థుల్లో ఇది 23 శాతం. అలాగే మిగిలిన వారిలో ఎక్కువశాతం మంది ఏ-2, బీ-1, బీ-2 గ్రేడ్లు సాధించినవారే  ఉన్నారు. ఈలెక్కన ఈసారి మొత్తం విద్యార్థుల్లో 90 శాతానికి పైగా ఏ-1, ఏ-2, బీ-1, బీ-2 గ్రేడ్‌లు సాధించినవారే ఉన్నారు. ఏఫ్‌ఏలో పాస్‌ కావాలంటే మొత్తం 20కి కనీస మార్కులు 7 ఉండాల్సిందే. ఇంటర్నల్స్‌లో ఎందుకు ఫెయిల్‌ చేయాలన్న భావనతో పరీక్షకు హాజరైన వారందరికీ కనీసం 10 మార్కులు ఎలాగూ వేస్తారు. ఇక కాస్త ప్రతిభ చూపినవారు కనీసం 15 మార్కులు సాధిస్తారు. దీంతో ఈసారి అత్యధికులు ఉత్తమ గ్రేడ్‌లు సాధించారు. 2019లో జరిగిన పదోతరగతి పరీక్షలకు మొత్తం 5,46,728 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 92.43శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Read more