సొంత జిల్లాల్లోనే టెన్త్‌ పరీక్షలు రాయొచ్చు

ABN , First Publish Date - 2020-06-06T17:35:51+05:30 IST

పదో తరగతి విద్యార్థులు ఇతర జిల్లాల్లో చదువుకున్నా.. సొంత జిల్లాల్లోనే పరీక్షలు రాసేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించనుంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ 10వ తరగతి పరీక్షలు తిరిగి ఈ

సొంత జిల్లాల్లోనే టెన్త్‌ పరీక్షలు రాయొచ్చు

నేటి సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలి

కరోనా నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు 

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులు ఇతర జిల్లాల్లో చదువుకున్నా.. సొంత జిల్లాల్లోనే పరీక్షలు రాసేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించనుంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ 10వ తరగతి పరీక్షలు తిరిగి ఈ నెల 8వ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు(డీఈవోలు) శుక్రవారం ప్రకటనలు జారీ చేశారు. సొంత జిల్లాల్లో పరీక్షలు రాయాలనుకుంటున్న విద్యార్థులు ఈ నెల 6 (శనివారం) సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ప్రొఫార్మాలో ఆయా జిల్లాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కరోనా లాక్‌డౌన్‌తో పరీక్షలు వాయిదా పడడంతో చాలా మంది విద్యార్థులు సొంత జిల్లాలకు వెళ్లిపోయారు.


ప్రస్తుతం అక్కడి నుంచి.. చదువుకున్న ప్రాంతాలకు వచ్చి పరీక్షలు రాయాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. పైగా ప్రముఖ విద్యాసంస్థలన్నీ హాస్టళ్లను మూసేశాయి. రవాణా సదుపాయాలూ అంతంతే. పూర్తి స్థాయిలో రైళ్లు, బస్సులు నడవడం లేదు. ప్రైవేటు హాస్టళ్లు, హోటళ్ల సౌకర్యం కూడా లేదు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో పదో తరగతి చదివి వివిధ జిల్లాల్లోని సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులు నగరానికి వచ్చేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ సూచించారు. విద్యార్థుల అభ్యర్థనలను పరిశీలించి తగిన సాయం చేస్తామన్నారు. 


‘పది’ పరీక్షలను వాయిదా వేయాలి: టీపీటీఎఫ్‌

రోజురోజుకూ పెరిగిపోతున్న కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి వార్షిక పరీక్షలను వాయిదా వేయాలని టీపీటీఎఫ్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌, ప్రధాన కార్యదర్శి రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో పెరిగిపోతున్న కొవిడ్‌ కేసులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని, పరీక్షల సమయంలో విద్యార్థులు కరోనా బారిన పడితే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


జాబితాలో నంబర్లు లేక విద్యార్థుల ఆందోళన

కరోనా సమయంలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి వస్తుండటం, భౌతికదూరం పాటించాల్సి ఉండటంతో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించారు. దీంతో కొంతమంది విద్యార్థుల పరీక్ష కేంద్రాలు మారాయి. అయితే హాల్‌ టికెట్‌ నెంబర్లు, పరీక్ష కేంద్రాలను వివరిస్తూ విద్యాశాఖాధికారులు విడుదల చేసిన జాబితాలో కొంతమంది విద్యార్థుల నంబర్లు కనిపించడంలేదు. దీంతో ఎవరిని సంప్రదించాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి ఇచ్చిన ఫోన్‌ నంబరు (040-29701474) కూడా పని చేయడంలేదని వారు అంటున్నారు. 

Updated Date - 2020-06-06T17:35:51+05:30 IST