స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం కేసులో సుప్రీం వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-10-07T16:39:39+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు మాతృభాషలో పునాదులు అవసరమని స్పష్టం చేసింది. ‘దీనిని మామూలు అంశంగా మేం భావించడం లేదు. ఇంగ్లీష్ మాధ్యమం,

మాతృభాషలోనే పిల్లలకు పునాది!
అనేక దేశాల్లో అమ్మ భాషలోనే బోధన
ఇంగ్లీష్ వైపే 96% తల్లిదండ్రుల మొగ్గు
ఆంధ్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదన
గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేం
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం
న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు మాతృభాషలో పునాదులు అవసరమని స్పష్టం చేసింది. ‘దీనిని మామూలు అంశంగా మేం భావించడం లేదు. ఇంగ్లీష్ మాధ్యమం, ఇతర భాషల మాధ్యమం విషయంలో తేడా ఉంటుంది. అంతర్జాతీయంగా పరిశీలిస్తే.. రష్యా, చైనాతో పాటు అనేక దేశాల్లో మాతృభాషలోనే విద్యను బోధిస్తున్నారు’ అని వ్యాఖ్యానించింది. తామేమీ విభేదించడం లేదని.. తెలుగు మీడియంను కూడా అందుబాటులో ఉంచుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ అన్నారు. ‘వ్యక్తిగతంగా మీ వాదనను అంగీకరిస్తున్నాం. కానీ మా అభిప్రాయాలను రుద్దాలనుకోవడం లేదు. అన్నీ పరిశీలించాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం మీతో విభేదిస్తున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. ఆంగ్ల మాధ్యమంలో బోధన నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. వేరే ధర్మాసనం నుంచి తమ ముందుకు ఈ వ్యాజ్యం వచ్చినందున దీనిని అధ్యయనం చేయలేదని, కాబట్టి విచారణ వాయిదా వేస్తామని తెలిపింది.
అయితే 3 నిమిషాల సమయం ఇవ్వాలని విశ్వనాథన్ విజ్ఞప్తి చేశారు. అందుకు కోర్టు అనుమతిచ్చింది. ఆయన వాదనలు వినిపిస్తూ.. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఆసక్తిగలవారి కోసం మండలానికో తెలుగు మాధ్యమం పాఠశాలను ఏర్పాటు చేస్తోందని.. ఇంగ్లీష్ మీడియంలోనూ తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటుందని.. అయితే ఈ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసిందని వివరించారు. ‘మీ ముందు వాదించగలుగుతున్నానంటే ఇంగ్లీష్ మీడియంలో చదివినందుకే. అయినా నా మాతృభాష విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. చాలా మంది ఇతర భాషల్లో చదువుకున్న వారు ఆంగ్లంలో వాదించడానికి ఇబ్బంది పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. తెలుగు మీడియంలో చదువుకునేవారు సుప్రీంకోర్టులో వాదించడానికి వచ్చే వరకు మధ్యలో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని, ఆంగ్లం మాత్రమే కాకుండా ప్రసంగాలు చేయడం వంటివీ నేర్చుకోవచ్చని తెలిపింది.
పునాదులు ముఖ్యమని విశ్వనాథన్ అనగా.. ‘పిల్లలకు మాతృభాషలో పునాదులు అవసరం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ దశలో విద్యా హక్కు చట్టంపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రస్తావించబోగా.. ఏ మీడియం బోధన కావాలో తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చిందని విశ్వనాథన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారని, అలాంటప్పుడు వారికి ఇంగ్లీష్ విద్యను ఎలా దూరం చేయగలుగుతామని ప్రశ్నించారు. గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతోందని.. రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోందని విశ్వనాథన్ ప్రస్తావించగా.. ‘ఇప్పుడు మేం వాదనలు వినడం లేదు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే నిరాకరించాల్సి వస్తుంది’ అని హెచ్చరించింది. అలా చేయవద్దని, దానివల్ల తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్వనాథన్ అన్నారు. తదుపరి విచారణను ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది.