రెండు కాలేజీల మధ్య నలిగి..మెడిసిన్‌ సీటు కోల్పోయిన పేద విద్యార్థి

ABN , First Publish Date - 2020-12-28T16:00:57+05:30 IST

ఒక పేద విద్యార్థికి వైద్య కళాశాలలో వచ్చిన సీటు చివరి క్షణంలో చేజారింది. కళాశాల యాజమాన్యం సమయానికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో.. ఆ విద్యార్థి భవిష్యత్తు

రెండు కాలేజీల మధ్య నలిగి..మెడిసిన్‌ సీటు కోల్పోయిన పేద విద్యార్థి

సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వని అగ్రి కళాశాల యాజమాన్యం

గద్వాల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఒక పేద విద్యార్థికి వైద్య కళాశాలలో వచ్చిన సీటు చివరి క్షణంలో చేజారింది. కళాశాల యాజమాన్యం సమయానికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో.. ఆ విద్యార్థి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన సి.విక్రమ్‌.. నీట్‌లో 430 మార్కులు సాధించాడు. క్యాటగిరీ ర్యాంకు 9,628, ఆల్‌ ఇండియా ర్యాంకు 1,52,189 వచ్చింది. కానీ, తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు రాలేదు. ఎంసెట్‌లో కూడా 3,840 ర్యాంకు రావడంతో.. ఆ కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. జగిత్యాలలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రభుత్వ ఆగ్రికల్చర్‌ కళాశాలలో ఏజీ బీఎస్సీలో సీట్‌ రావడంతో.. జాయిన్‌ అయ్యాడు. ఇంతలో.. నీట్‌ రెండో విడత కౌన్సిలింగ్‌లో సీట్‌ వచ్చినట్లుగా కరీంనగర్‌లోని ఓ మెడికల్‌ కళాశాల నుంచి 22న అర్ధరాత్రి సమాచారం వచ్చింది. 26 లోపు సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని వారు తెలిపారు. 24వ తేదీన విక్రమ్‌.. అగ్రికల్చర్‌ కళాశాలకు వెళ్లి, విషయం చెప్పి.. తన అడ్మిషన్‌ రద్దు చేసి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరాడు. కానీ, సరిఫికెట్లు వెంటనే ఇవ్వలేమని, కస్టోడియన్‌ సర్టిఫికెట్‌ మాత్రమే ఇస్తామని కళాశాల అధికారులు చెప్పారు. దీంతో విక్రమ్‌ ఆ సర్టిఫికెట్‌ను తీసుకొని అదే రోజు మెడిసిన్‌ కౌన్సెలింగ్‌కు వెళ్లాడు. కానీ, వాళ్లు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తప్పనిసరి అని చెప్పారు. అలాగే, సీట్‌ అలాట్‌మెంట్‌కు రూ.10 వేలు, ట్యూషన్‌ ఫీజు కింద 1.05 లక్షలు చెల్లించాలన్నారు. దీంతో.. 500 కిలోమీటర్ల దూరంలోని సొంత గ్రామానికి వెళ్లి నగదు సమకూర్చుకొని 26న కరీంనగర్‌కు వెళ్లాడు. అక్కడ ఒరిజిల్‌ సర్టిఫికెట్లు ఉంటేనే సీటు ఇస్తామని, అది కూడా నాలుగు గంటల్లోపు ఇవ్వాలని.. మూడు గంటలప్పుడు మెడికల్‌ కళాశాల యాజమాన్యం తేల్చిచెప్పింది.


దీంతో.. ఓ అద్దె వాహనం తీసుకొని 4:30కు జగిత్యాల వెళ్లాడు. అక్కడ ఇద్దరు, ముగ్గురు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో.. సాయంత్రం ఆరు గంటలకు కరీంనగర్‌లోని మెడికల్‌ కళాశాలకు చేరుకొని పరిస్థితిని వివరించాడు. అదే సమయంలో సర్టిఫికెట్లు ఇస్తామంటూ వ్యవసాయ కళాశాల అధికారులు ఫోన్‌ చేసి చెప్పడంతో.. సాయంత్రం 6.30 గంటలకు మళ్లీ జగిత్యాల వెళ్లాడు. రాత్రి 8.30 గంటలకు సర్టిఫికెట్లు తీసుకొని.. 10 గంటలకు కరీంనగర్‌కు చేరుకున్నాడు. కానీ, ఇప్పటికే ఆలస్యమైపోయిందని, నువ్వు జాయిన్‌ కాలేదన్న సమాచారాన్ని వైద్య విశ్వవిద్యాలయానికి సమాచారం ఇచ్చేశామని అధికారులు తేల్చి చెప్పేశారు. చెప్పేదేమైనా ఉంటే.. అక్కడికే వెళ్లి చెప్పుకోవాలని సూచించారు. దీంతో.. విక్రమ్‌ అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోయాడు. ఉన్నతాధికారులు స్పందించి.. తనకు మెడికల్‌ సీటు ఇప్పించాలని విక్రమ్‌ విజ్ఞప్తి చేశాడు.


Updated Date - 2020-12-28T16:00:57+05:30 IST