ఇప్పుడు అవసరమా!

ABN , First Publish Date - 2020-10-31T16:30:49+05:30 IST

రెండు మూడు కేసులున్నప్పుడే స్థానిక ఎన్నికలు వాయిదా వేశారు! ఇప్పుడు రోజుకు 3 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరి.. స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? ..ప్రభుత్వ పెద్దల ప్రశ్న!

ఇప్పుడు అవసరమా!

పాఠశాలలు తెరవడంపై ఇదే ప్రశ్న

రోజుకు 3 వేల కేసులంటూ స్థానికానికి ‘నో’.. బడులు, కాలేజీలకు మాత్రం ‘ఎస్‌’

సెకండ్‌ వేవ్‌ సంకేతాలు బేఖాతరు

గుమికూడకుండా పిల్లల్ని ఆపగలరా?

వారి ద్వారా ఇళ్లలోని పెద్దలకు వైరస్‌ రాదా!?

సందేహాల నివృత్తికి వెళ్లిన వారికీ పాజిటివ్‌

22 రాష్ట్రాలు ఆన్‌లైన్‌ వైపే మొగ్గు

ఏపీలో మాత్రం భిన్న వైఖరి

వర్సిటీలు కూడా ఎల్లుండి నుంచే


రెండు మూడు కేసులున్నప్పుడే స్థానిక ఎన్నికలు వాయిదా వేశారు! ఇప్పుడు రోజుకు 3 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరి.. స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? ..ప్రభుత్వ పెద్దల ప్రశ్న!


మూడువేల కేసులు నమోదవుతున్నాయి కాబట్టి, స్థానిక ఎన్నికలు జరపొద్దని అంటున్నారు. కానీ... స్కూళ్లు, కాలేజీలు తెరవొచ్చా? 

..మరి ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారా?


(అమరావతి - ఆంధ్రజ్యోతి): కరోనా ఒక్కటే! దాని తీవ్రత కూడా రాష్ట్రంలో ఒక్కటే. అయితే, స్థానిక ఎన్నికల నిర్వహణకేమో ‘కరోనా ఉంది! ఎన్నికలకు ‘నో’ అని ప్రభుత్వం అంటోంది. అదే... పిల్లల చదువుల దగ్గరికి వచ్చేసరికి... ‘కరోనా ఉంది. అయినా ఎస్‌’ అని విద్యాశాఖ తేల్చిచెబుతోంది. రాజకీయాలు, భిన్న ధోరణులు పక్కనపెడితే... ఇప్పుడు స్కూళ్లు తెరవడమంటే కరోనాను ఆహ్వానించడమే అని విద్య, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘కరోనా ఇంకా పోలేదు. పండగలొచ్చాయని ఊళ్లకు వెళ్లొద్దు. జాగ్రత్తగా ఉండండి’’ అని స్వయంగా ప్రధాని మోదీయే హెచ్చరించారు. ఇప్పటికే యూర్‌పను ‘సెకండ్‌ వేవ్‌’ కుదిపేస్తోంది. అదే పరిస్థితి భారత్‌కూ వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


అయినా సరే... నవంబరు 2 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీలను తెరవాలని సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘పూర్తి సురక్షితం అనుకునేదాకా మా పిల్లలను బడికి పంపించం’ అని కరోనాపై అవగాహన ఉన్న తల్లిదండ్రులు చెబుతున్నట్లు రాష్ట్రం నలుమూలల నుంచి సమాచారం అందుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలు తెరిచినా అంగీకారపత్రం ఇవ్వబోమని తేల్చిచెబుతున్నారు.


గజిబిజి పాఠాలు...

ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించి తలెత్తే సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సెప్టెంబరు 5వ తేదీ నుంచి తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావచ్చని ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా తరగతుల విద్యార్థుల్లో దాదాపు 30 నుంచి 40 శాతం మంది వరకు పాఠశాలలకు వెళ్తున్నారు. ఈ విధానం ప్రభుత్వం ఆశించిన రీతిలో అమలు కావడం లేదు.  ఒకవైపు ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాల బోధన, మరోవైపు కొందరు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడం, మరి కొందరు ఈ రెండింటికీ దూరంగా ఉండటం వంటి వేర్వేరు పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఒకే తరగతి విద్యార్థులకు భిన్నమైన రీతిలో బోధన జరుగుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆచరణలో వచ్చే సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారో తెలియని పరిస్థితి.


ఉపాధ్యాయుల పర్యవేక్షణలో తరగతి గదుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇంటర్వల్‌, భోజన సమయాల్లో గుమికూడకుండా పిల్లలను ఎలా నియంత్రిచగలరనే ప్రశ్న తలెత్తుతోంది. కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోక ముందే పిల్లలను పాఠశాలలకు రప్పించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామనడం కచ్చితంగా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.  14 సంవత్సరాల వయస్సులోపు పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపించకపోయినప్పటికీ... వారి ద్వారా ఇళ్లలో ఉండే వృద్ధులు, పెద్దలకు వైరస్‌ సోకే అవకాశాలు తోసిపుచ్చలేమని చెబుతున్నారు. అంటే... విద్యార్థులే ‘సూపర్‌ స్ర్పెడర్స్‌’గా మారతారన్న మాట!


ఈ ‘పాఠం’ మరచిపోతారా?

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గవండ్లపాలెం, ముండ్లమూరు మండలం మారెళ్లలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు ఆన్‌లైన్‌ పాఠాలపై సందేహాల నివృత్తికోసం వచ్చిన 9-10 తరగతుల విద్యార్థుల్లో 12 మందికి పాజిటివ్‌ వచ్చింది. 


విజయనగరం జిల్లా గంట్యాడ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. 


గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చందవరం యూపీ స్కూలు హెడ్మాస్టర్‌కు, రాజుపాలెం మండలం గణపవరం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు తాజాగా పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. 


ఇతర రాష్ట్రాల్లో ఇలా... 

జాతీయ ప్రైవేట్‌ పాఠశాలల సంఘాల సమాఖ్య సమాచారం ప్రకారం... దేఽశంలో 22 రాష్ట్రాలు ఆన్‌లైన్‌ తరగతులకే కట్టుబడి ఉన్నాయి. 


నాగాలాండ్‌, అసోం రాష్ట్రాలు పాఠశాలలను పునఃప్రారంభించి... మళ్లీ మూసివేశాయి.


ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబరు 21 నుంచి 9, 10, 11, 12 తరగతుల వరకు పాఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను మూసేయాల్సిందిగా ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీశ్‌ సిసోడియా ఆదేశించారు.


మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. పాఠశాలలను మళ్లీ తెరవలేదు.


కర్ణాటక ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరాన్ని రద్దు చేసి, జీరో ఇయర్‌గా ప్రకటించింది.


ఇప్పట్లో పిల్లల్ని పంపం- ఆదం సాహెబ్‌, గనికపూడి, గుంటూరు జిల్లా

స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ మా పిల్లలను పంపించం. మా గ్రామంలో కరోనా బారినపడ్డ వారు ఎక్కువగా ఉన్నారు. వ్యాధి తగ్గుముఖం పట్టేవరకు వేచి చూస్తాం. 


పాఠశాలలు తెరిస్తే రిస్కే- సుబ్బారావు, మధురవాడ, విశాఖపట్నం 

కరోనా పల్లెలకు విస్తరించిన తరుణంలో పాఠశాలలు తెరిస్తే రిస్క్‌ ఉంటుంది. పాఠశాలల్లో శానిటైజేషన్‌ సరిగా జరగదు. ఒకేచోట గుమికూడకుండా పిల్లల్ని నియంత్రించడం కూడా కష్టం. మా పిల్లలు మధురవాడలోని జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ క్లాసులు మాత్రమే వింటున్నారు. Read more