సర్కారీ మెడికల్‌లో ‘ప్రైవేటు’ సీటు

ABN , First Publish Date - 2020-09-25T17:18:02+05:30 IST

ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ. అందులోనూ గిరిజన ప్రాంతం పాడేరులో ప్రత్యేకంగా ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ. రెండు వారాల్లో వాటి నిర్మాణానికి టెండర్లు, ఆ వెంటనే చకచకా కార్యాచరణ! రాష్ట్రంలో రోగుల

సర్కారీ మెడికల్‌లో ‘ప్రైవేటు’ సీటు

భారీగా చెల్లిస్తేనే  కాలేజీల్లోకి ప్రవేశం

ఇకపై ప్రైవేటు కాలేజీల తరహాలోనే..

నిర్మించే 15 కొత్త కాలేజీల్లో అమల్లోకి

ప్రతిపాదనలు సిద్ధంచేసిన ప్రభుత్వం

వ్యతిరేకిస్తున్న వైద్య విద్యార్థులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)


ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ. అందులోనూ గిరిజన ప్రాంతం పాడేరులో ప్రత్యేకంగా ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ. రెండు వారాల్లో వాటి నిర్మాణానికి టెండర్లు, ఆ వెంటనే చకచకా కార్యాచరణ! రాష్ట్రంలో రోగుల అవసరాలకు సరిపడా వైద్యులు అందుబాటులో లేని పరిస్థితుల్లో జగన్‌ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనను ఎవరైనా స్వాగతించాల్సిందే! అయితే, కొత్తగా నిర్మించే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ప్రైవేటు తరహా నిర్వహణకు సన్నాహాలు చేస్తుండటం, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలుచేసి.. వాటితో ఈ కాలేజీలను నిర్వహించాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చదివే ఎంబీబీఎస్‌ వైద్యవిద్యార్థి ప్రస్తుతం ఏడాదికి రూ.10వేలు కడితే సరిపోతుంది. మిగతా ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. కొత్త విధానం అమల్లోకివస్తే.. రాష్ట్రంలో నిర్మిస్తున్న 15 మెడికల్‌ కాలేజీల్లో కొన్ని లక్షలు చెల్లించి సీటు పొందాల్సిందే! ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ నిర్మించాలని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో 15 ఏరియా ఆస్పత్రులను గుర్తించి మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.


ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలున్నాయి. ఇవికాకుండా మరో 14కొత్త మెడికల్‌ కాలేజీలతో పాటు పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో రెండు వారాల్లో వీటి నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కొత్త కాలేజీల నిర్వహణ ఎలా అన్న దానిపైనే ఆరు నెలలుగా తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం మెడికల్‌ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని తొలుత భావించారు. 33 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు లీజుకు అప్పగించి కాల పరిమితి ముగిసిన తర్వాత ప్రభుత్వం స్వాధీనపర్చుకొనేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.


ప్రైవేటు సంస్థలతో కాలేజీల నిర్మాణం చేయించి, సగం సీట్లు అవి అమ్ముకునేలా ఒప్పందం కుదుర్చుకోవాలనేది రెండో ప్రతిపాద. అది కాదంటే మూడో ప్రతిపాదనగా.. ప్రభుత్వం కాలేజీల నిర్మాణం పూర్తి చేసి, ఎంసీఐ అనుమతిచ్చిన సీట్లలో సగం కన్వీనర్‌, సగం మేనేజ్‌మెంట్‌ కోటా కింద విభజించాలి. మేనేజ్‌మెంట్‌ కోటా కింద వచ్చిన సీట్లను ప్రభుత్వం అధిక ఫీజులకు విక్రయిస్తుంది. దీనికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది.


నిర్మాణాలు పూర్తయితే కొత్త మెడికల్‌ కాలేజీల్లో దాదాపు 1600 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇందులో 800 సీట్లు కన్వీనర్‌ కోటా పోతే, మిగిలిన 800 సీట్లుకు ప్రభుత్వం ఒక ఫీజు నిర్ణయిస్తుంది. దాని ప్రకారం సీట్ల అమ్మకాలు జరుగుతాయి. ఇలా వచ్చిన ఆదాయాన్ని మెడికల్‌ కాలేజీ, దానికి అనుబంధంగా ఉండే ఆస్పత్రి నిర్వహణకు ప్రభుత్వం వినియోగిస్తుంది. 


సీటు రూ.12 లక్షలపైనే...

కొత్త కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో ఇచ్చే ఒక్కో సీటు ధర దాదాపు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా. మొత్తంగా 800 సీట్లకుగాను ఏడాదికి రూ.96 కోట్లకుపైగానే విద్యార్థుల దగ్గర నుంచి ప్రభుత్వం వసూలు చేయనుంది. ప్యాకల్టీ జీతాలు తప్ప తక్కిన నిర్వహణ అవసరాలకు విద్యార్థులు ఫీజుల రూపంలో కట్టే ఈ మొత్తాల్లోంచే ఖర్చు చేస్తారు.


ఒక మెడికల్‌ కాలేజీ నిర్వహణకు ఏడాదికి సుమారు రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. ఉద్యోగుల జీతాలను కూడా కలిపితే ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఆ స్థాయిలో నిధులు కేటాయించే అవకాశం లేదు. కాబట్టి ఈ విధంగా విద్యార్థులపై భారం వేసి, వాళ్లు ఇచ్చిన నిధులతో కాలేజీలను నడపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. 


గిరిజనులు అడుగుపెడతారా?

గిరిజనులకు కూడా ఉన్నత చదువులు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాడేరులో గిరిజన మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేపడుతోంది. లక్ష్యమైతే బాగుందని కానీ ఆచరణలో సాధ్యమవుతుం దా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పాడేరు మెడికల్‌ కాలేజీలోనూ మేనేజ్‌మెంట్‌ సీట్లు అమ్మకానికి పెట్టాలి.


ప్రభుత్వం నిర్ణయించే భారీ ఫీజులను చెల్లించి మెడికల్‌ సీటు కొనుగోలు చేసే పరిస్థితి ఈ వర్గాల్లో ఉండదు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం నిర్మించిన కాలేజీల్లో సీట్లు అమ్మకానికి పెట్టడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతాయి. పేద వారికి వైద్య విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు ఉంటున్నాయని విద్యార్థులు ఆగ్రహిస్తున్నారు. Updated Date - 2020-09-25T17:18:02+05:30 IST