మారిన మాస్టారు

ABN , First Publish Date - 2020-06-25T17:38:05+05:30 IST

కూలీలకు ఉపాధి లేకుండా చేసిన కరోనా వైరస్‌.. ప్రైవేటు టీచర్లను ఉపాధి కూలీలుగా మార్చింది! బడిలో పాఠాలు చెప్పి రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక ప్రైవేటు పాఠశాలలు వారిని తొలగిస్తుంటే.. పొట్ట కూటి కోసం వారు భవన నిర్మాణ కూలీలుగా

మారిన మాస్టారు

బీడీలు చుట్టడం, టైలరింగ్‌ వంటి పనుల్లో మహిళా ఉపాధ్యాయులు

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో టీచర్లను అర్ధాంతరంగా తొలగిస్తున్న పాఠశాలలు

70% ఉపాధ్యాయులు విధులకు దూరం... ఏప్రిల్‌, మే వేతనాలు పూర్తిగా కోత

మార్చి నెల వేతనంలో సగమే చేతికి... ఆన్‌లైన్‌ విద్యతో కొందరికే ఉపాధి


కూలీలకు ఉపాధి లేకుండా చేసిన కరోనా వైరస్‌.. ప్రైవేటు టీచర్లను ఉపాధి కూలీలుగా మార్చింది! బడిలో పాఠాలు చెప్పి రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక ప్రైవేటు పాఠశాలలు వారిని తొలగిస్తుంటే.. పొట్ట కూటి కోసం వారు భవన నిర్మాణ కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు! మహిళా టీచర్లు బీడీలు చుట్టడం, టైలరింగ్‌ వంటి పనులు చేస్తున్నారు!! తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సినవారు.. తట్ట, పార పట్టుకుని పొలంలో పనులకు వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ప్రైవేటు టీచర్ల దయనీయస్థితి ఇది!!


(హైదరాబాద్‌-ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల దయనీయస్థితికి అద్దంపట్టే ఉదాహరణలివి. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌, పాఠశాలల మూసివేత.. వారి ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బకొట్టింది. సూటిగా చెప్పాలంటే.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయుల జీవితాలను దుర్భరం చేసింది. ఎన్నో కుటుంబాల పొట్టకొట్టింది. ఉన్నచోట ఉద్యోగం పోయినా.. మరోచోట చేరే పరిస్థితి కూడా వారికి లేదు. ఇప్పటికే మూడు నెలలుగా మూసి ఉన్న కొన్ని పాఠశాలలు శాశ్వతంగా మూతకు సిద్ధం కాగా.. ఆర్థిక భారాన్ని తగ్గించుకునే క్రమంలో మరికొన్ని పాఠశాలలు మొదటి వేటు టీచర్లపైనే వేస్తున్నాయి. కొందరిని పూర్తిగా తీసేసి.. మరికొందరికి అరకొర వేతనాలిస్తూ.. మనుగడ సాగించే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు మార్చి  జీతం చెల్లించి ఏప్రిల్‌, మే జీతాలు ఆపేయగా.. మరికొన్ని మార్చి జీతమూ సగమే చెల్లించాయి. ఉన్నవారికి జూన్‌  వేతనాలు చెల్లిస్తాయో లేదో తెలియని పరిస్థితి.


వేలాది మంది..

రాష్ట్రంలో దాదాపు 11,700 దాకా ప్రైవేటు పాఠశాలలున్నాయి. వాటిలో 1,20,350 మంది వరకూ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. కరోనా ప్రభావం ఈ పాఠశాలలన్నింటిపైనా పడింది. బడులు తెరవొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో చాలా స్కూళ్లు ఆన్‌లైన్‌ పాఠాలకు మళ్లాయి. నిపుణులైన కొంతమంది ఉపాధ్యాయులతోనే ఆన్‌లైన్‌ తరగతులను నడిపిస్తూ.. మిగతా ఉపాధ్యాయులను విధులకు రావొద్దని చెప్పేశాయి. తాము సూచించే వరకు రావొద్దని కొన్ని పాఠశాలలు చెప్పగా... విధుల నుంచే తొలగించినట్లు మరికొన్ని పాఠశాలలు చెప్పేశాయి. ఇలా దాదాపు 70 శాతం మంది దాకా ప్రైవేటు ఉపాధ్యాయులు విధులకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. వారంతా వేరే ఉపాధి వెతుక్కుంటున్నారు. మహిళా టీచర్లు బీడీలు చుడుతూ రూ.5-6 వేల సంపాదనతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. మరికొందరు టైలరింగ్‌ పనులు చేసుకుంటున్నారు. నగరాల్లోని ప్రైవేటు ఉపాధ్యాయులు.. పెట్రోలు బంకులు, రెస్టారెంట్లలో పనికి కుదురుతున్నారు.


కులవృత్తుల్లోకి..

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో 206 ప్రైవేటు పాఠశాలలుండగా.. వాటిలో దాదాపు 2000 మంది ఉపాధ్యాయులు పని చేసేవారు. వారిలో సుమారు 500 మందిని విధుల నుంచి తొలగించారు. మరో వెయ్యి మందికి వేతనాలివ్వకుండా నిలిపేశారు. కంప్యూటర్‌ నైపుణ్యాలు, ఆన్‌లైన్‌లో తరగతులు చెప్పే సామర్థ్యం ఉన్నవారినే ఉపాధ్యాయులుగా కొనసాగిస్తున్నారు. అటు.. పెద్దపల్లి జిల్లాలో చాలా మంది ప్రైవేటు టీచర్లు కుల వృత్తులు చేసుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లాలో చేనేత పని వచ్చినవారు ఆ వృత్తిలోకి దిగిపోయారు. కొందరు వస్త్ర ఉత్పత్తి రంగంలో పని చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయులే కాదు.. కొంత మంది లెక్చరర్లు వ్యవసాయ పనులు చేస్తున్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో చాలా మంది టీచర్లు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి లేక భవన నిర్మాణ కూలీలుగా పని చేస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రైవేట్‌ స్కూళ్లలో పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది కేరళకు చెందినవారే. లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా అక్కడికి వెళ్లలేక.. ఇక్కడ ఉపాధి లేక.. దుర్భర స్థితిని ఎదుర్కొన్నారు. భవిష్యత్తులో ఉద్యోగం వస్తుందో లేదోనన్న ఆందోళనతో ప్రైవేటు ఉపాధ్యాయులు కాలం గడుపుతున్నారు.


ప్రభుత్వమే ఆదుకోవాలి

పదేళ్లుగా పలు ప్రైవేటు స్కూళ్లలో టీచర్‌గా పని చేశాను. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన పాఠశాల తెరుచుకోలేదు. మాకు ఏప్రిల్‌, మే నెలల వేతనాలు ఇవ్వలేదు. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారడంతో నాకు వచ్చిన టైలరింగ్‌ పనిలో కొనసాగుతున్నా. ఉపాధి లేక రోడ్డున పడిన టీచర్లను ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలే ఆదుకోవాలి.


- మమత, 

విద్యానగర్‌, జగిత్యాల


రోజు కూలీకి వెళ్తున్నా

నెలకు రూ.8 వేల జీతానికి పరిగిలో ఒక ప్రైవేటు స్కూల్‌లో పనిచేస్తున్నా. నాలుగు నెలల నుంచి జీతం రావట్లేదు. కుటుంబం గడవడం కష్టంగా మారింది. దీంతో, ఏ పని దొరికినా వెళ్తున్నా. ఇసుక లోడింగ్‌, అన్‌లోడింగ్‌, బావుల్లో పూడికతీత, పొలం పనులకు వెళ్తున్నా. ప్రభుత్వమే మాలాంటివారిని ఆదుకోవాలి.


- కుమార్‌, పరిగి, వికారాబాద్‌ జిల్లా


ఇది న్యాయం కాదు

ఉపాధ్యాయులతో ఇన్ని రోజులూ పని చేయించుకుని, ఇప్పుడు వారిని కరివేపాకుల్లా విధుల నుంచి తొలగించడం సరైన చర్య కాదు. పాఠశాలల యాజమాన్యాలే మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రైవేటు స్కూలు టీచర్ల బతుకుల్లో భరోసా నింపాలి.


- షేక్‌ షబ్బీర్‌ అలీ, టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు


బీడీలు చుడుతున్నా...

గత పన్నెండేళ్లుగా ఒక ప్రైవేటు స్కూలులో పని చేస్తున్నాను. జూన్‌ నెల గడిచిపోతున్నా... నేను పని చేసే పాఠశాల తెరుచుకోలేదు. మూడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నాం. బీడీలు చుట్టడం నాకు తెలిసిన విద్య కావడంతో ప్రస్తుతం ఆ పనితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నా.

- గన్నె జమున, 

శ్రీరాంనగర్‌, జగిత్యాల


సిద్దిపేటకు చెందిన కరుణాకర్‌..  ఎంఏ (ఇంగ్లిష్‌) పూర్తి చేసి, చాలా ఏళ్లుగా ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పని చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం ఆయనను విధుల్లోంచి తొలగించింది. దీంతో ఇప్పుడు భవన నిర్మాణ కూలీగా రోజుకు రూ.400 సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.


Updated Date - 2020-06-25T17:38:05+05:30 IST