జేఈఈ, నీట్‌ వాయిదా వేయండి

ABN , First Publish Date - 2020-08-22T14:21:49+05:30 IST

జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని, లేదంటే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదమున్నదని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

జేఈఈ, నీట్‌ వాయిదా వేయండి

ప్రధానికి సుబ్రహ్మణ్యస్వామి లేఖ


న్యూఢిల్లీ, ఆగస్టు 21: జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని, లేదంటే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదమున్నదని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని నరేంద్ర  మోదీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి అత్యవసర లేఖ రాశారు. వెంటనే జో క్యం చేసుకొని పరీక్షలను వాయిదా వేయాలని విద్యా శాఖ మంత్రిని ఆదేశించాలని ఆ లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు.


ఈ సందర్భంగా ఆయన ముంబైలోని ప్రస్తుత పరిస్థితులను ఉదహరించారు. కరోనా విజృంభణ కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని, విద్యార్థులు 30-40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పరీక్షలకు హాజరు కావడం సాధ్యం కాదని తెలిపారు. పరీక్షలను దీపావళి తరవాత  నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాలకు తాను ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.


కాగా, నీట్‌, జేఈఈ పరీక్షలు సమయానికే జరుగుతాయని కేంద్రంలోని ప్రభుత్వ వర్గాలు మరోమారు స్పష్టం చేశాయి. మరోవైపు.. పరీక్షలు వాయిదా పడే అవకాశాలు లేవని,  అన్ని  రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని పరీక్షల నిర్వహణ సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పేర్కొంది. ఇప్పటికే  జెఈఈ అడ్మిట్‌ కార్డులను జారీ చేశామని ఎన్‌టీఏ అధికారులు తెలిపారు.


ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జేఈఈ, సెప్టెంబరు 13న నీట్‌ను నిర్వహించన్నుట్లు వారు తెలిపారు.

Updated Date - 2020-08-22T14:21:49+05:30 IST