కళాశాలల్లో వృక్ష సంబంధ వనాలు

ABN , First Publish Date - 2020-07-19T22:18:27+05:30 IST

హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వృక్షసంబంధ ఉద్యానవనాలను (బొటానికల్‌ గార్డెన్లు) ఏర్పాట్లు చేయాలని ఇంటర్‌ బోర్డు

కళాశాలల్లో వృక్ష సంబంధ వనాలు

స్థలం అందుబాటులో ఉంటే ఏర్పాటు 

అధికారులకు ఇంటర్‌ బోర్డు ఆదేశాలు 


హైదరాబాద్‌, జులై 18(ఆంధ్రజ్యోతి): హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వృక్షసంబంధ ఉద్యానవనాలను (బొటానికల్‌ గార్డెన్లు) ఏర్పాట్లు చేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని అన్ని జిల్లాల ఇంటర్‌ బోర్డు అధికారులకు బోర్డు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 404 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. అనేక చోట్ల కళాశాలలకు విశాలమైన స్థలాలున్నందున బొటానికల్‌ గార్డెన్లను ఏర్పాటు చేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. గురువారం విద్యా శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలో దీనిపైనా ప్రముఖంగా చర్చ జరిగింది. బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్న జడ్జర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాటనీ ఆసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సదాశివయ్యను ముఖ్యమంత్రి స్వయంగా అభినందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాలమైన స్థలాలున్న చోట వీటిని ఏర్పాటు చేయాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ నిర్ణయించారు. వీటితో కళాశాల ఆవరణ పచ్చదనంతో పాటు విద్యార్థులకు శాస్ర్తీయ విద్యపై అవగాహన కలుగుతుందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన శనివారం అన్ని జిల్లాల ఇంటర్‌ బోర్డు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రస్తావించారు. అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న స్థలం వివరాలను పంపించాలని అధికారులను ఆయన ఆదేశించారు. స్థల లభ్యతను బట్టి బొటానికల్‌ గార్డెన్ల ఏర్పాటుపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. 


25న ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు 

ఇంటర్‌ రీవెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఫలితాలను ఒకేసారి ఈనెల 25న ప్రకటించాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రీవెరిఫికేషన్‌ కోసం దాదాపు 60 వేలు, రీ కౌంటింగ్‌ కోసం 15 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిసారి దరఖాస్తు చేసిన వారం పదిరోజుల్లో వీటిని ప్రకటిస్తుండగా.. ఈసారి బోర్డులో పలువురికి కరోనా రావడం, సిబ్బంది సంఖ్య తగ్గడంతో జాప్యమైంది. గతంలో పాజిటివ్‌ వచ్చిన సిబ్బంది కూడా ఇప్పుడు కోలుకొని విధులకు హాజరవుతున్నారు. మరో వారం రోజుల్లో ప్రక్రియ అంతా పూర్తిచేయాలన్న లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఫెయిలై ప్రభుత్వ నిర్ణయంతో పాసైన సెకండియర్‌ విద్యార్థులకు ఆగస్టు మొదటి వారంలో షార్ట్‌ మెమోలు జారీచేయాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2020-07-19T22:18:27+05:30 IST