పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌కు ఓకే!

ABN , First Publish Date - 2020-05-30T16:59:43+05:30 IST

పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) మెడికల్‌ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. వాస్తవానికి గత నెలలో ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్‌ను ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. రిజర్వేషన్లు,

పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌కు ఓకే!

ఎట్టకేలకు సర్కారు పచ్చజెండా

నోటిఫికేషన్‌ విడుదల చేసిన హెల్త్‌ వర్సిటీ

జీవో 43కి సవరణలు.. రిజర్వేషన్లపై స్పష్టత

రేపటితో ముగియనున్న కౌన్సెలింగ్‌ గడువు

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) మెడికల్‌ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. వాస్తవానికి గత నెలలో ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్‌ను ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. రిజర్వేషన్లు, ఫీజులపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో నెల రోజుల నుంచి కౌన్సెలింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. గురువారం అర్థరాత్రికి రిజర్వేషన్‌, ఫీజుల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో ఆరోగ్యశాఖ జీవో జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులు కౌన్సెలింగ్‌కు గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇప్పటికే కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించిన వర్సిటీ అధికారులు మెరిట్‌ లిస్ట్‌ను కూడా సిద్ధం చేశారు. దీని ఆధారంగా తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.


పీజీ కోర్సుల్లో చేరే అభ్యర్థులకు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఆప్షన్లకు అవకాశం కల్పించారు. డెంటల్‌ కోర్సుల్లో చేరే అభ్యర్థుల కోసం శుక్రవారం మధ్యాహ్నం నుంచి 31వ తేదీ ఉదయం 9 వరకు అవకాశం ఇచ్చారు. మెరిట్‌ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులు మాత్రమే సీట్లు కోసం ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొనడం గమనార్హం. ఎంసీఐ నిబంధనల ప్రకారం మే 31లోపు కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. అయితే, మన రాష్ట్రంలో ఆ సమయానికి తొలి విడత కౌన్సెలింగ్‌ కూడా పూర్తయ్యే అవకాశం లేదని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కౌన్సెలింగ్‌ గడువు పొడిగిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు. దీనిపై ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులను ప్రశ్నించగా గడువు పొడిగింపుపై ఎంసీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. సుప్రీంకోర్టు గడువు పొడిగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.  


రిజర్వేషన్‌ కేటగిరీకే సీటు

రిజర్వేషన్‌ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2013లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 43కి కొన్ని సవరణలు చేశారు. జీవో 43 ప్రకారం రిజర్వేషన్‌ అభ్యర్థి ఓపెన్‌ కేటగిరీలోని ఒక విభాగంలో సీటు తీసుకుని, ఆ తర్వాత అదే అభ్యర్థి రిజర్వేషన్‌ కేటగిరీలో మరో విభాగంలో సీటు పొందితే తొలుత తీసుకుని వదిలేసిన సీటును ఓపెన్‌ కేటగిరీకే కేటాయించేవారు. దీనికి సవరణ చేసి వదిలేసిన సీటును రిజర్వేషన్‌ కేటగిరీకి కేటాయించేలా మార్చారు. ఈమేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి శుక్రవారం వేర్వేరుగా జీవోలు 56,57లను విడుదల చేశారు. దీనిపై బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.


Updated Date - 2020-05-30T16:59:43+05:30 IST