కేంద్ర ఉద్యోగాలకు ఇక.. ఒకే పరీక్ష
ABN , First Publish Date - 2020-08-20T17:55:28+05:30 IST
కేంద్ర ప్రభుత్వంలోని నాన్ గెజిటెడ్ పోస్టులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దిగువస్థాయి పోస్టులకు ఇక ఉమ్మడి ప్రవేశపరీక్ష (సెట్) ఉంటుంది. దీన్ని నిర్వహించేందుకు గాను జాతీయ నియామక సంస్థ -నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

జాతీయ నియామక సంస్థ ఏర్పాటు
తొలుత రైల్వే, బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ఒకే గొడుగుకిందకు
ఏటా 2 సార్లు ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటు
ప్రతి జిల్లాలో ఒక్కో పరీక్షా కేంద్రం
కేంద్ర మంత్రివర్గం ఆమోదం
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వంలోని నాన్ గెజిటెడ్ పోస్టులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దిగువస్థాయి పోస్టులకు ఇక ఉమ్మడి ప్రవేశపరీక్ష (సెట్) ఉంటుంది. దీన్ని నిర్వహించేందుకు గాను జాతీయ నియామక సంస్థ -నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్ సమయంలో ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బుధవారంనాడు సమావేశమైన కేబినెట్ ఈ ఎన్‌ఆర్‌ఏకు సంబంధించిన విధివిధానాలను చర్చించి ఆమోదముద్ర వేసింది. ఇన్నేళ్లూ ఈ ఉద్యోగ నియామకాలను దాదాపు 20 సంస్థలు చేపట్టేవి. ఇప్పడవన్నీ మూతపడతాయి. ఒకే స్థాయిలోని గ్రూప్-బీ, గ్రూప్-సీల కిందకొచ్చే నాన్ గెజిటెడ్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలన్నింటికీ ఈ పరీక్ష జరపనున్నారు.
ఎన్‌ఆర్‌ఏ సెట్- తీరూ తెన్నూ
ఇది ఓ నియామకానికి సంబంధించిన తొలి దశ స్ర్కీనింగ్ మాత్రమే! అయినా చాలా ముఖ్యమైనది.
డిగ్రీ, ఇంటర్ (క్లాస్-12), పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ సెట్ రాయవచ్చు.
పోస్టులను బట్టి ఒక్కో స్థాయి వారికీ ఒక్కో పరీక్ష విడివిడిగా ఉంటుంది.
ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో ఏటా రెండుమార్లు నిర్వహిస్తారు
ఈ పరీక్షలో సాధించే స్కోరు మూడేళ్లపాటు అమల్లో ఉంటుంది.
ఒకవేళ అభ్యర్థులు తమ స్కోరును మెరుగుపరుచుకోదలిస్తే మళ్లీ మళ్లీ సెట్ రాయవచ్చు.
గరిష్ఠ వయో పరిమితిని బట్టి ఎవరైనా ఎన్నిమార్లయినా పరీక్ష రాసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులుంటాయి
నియామక ప్రకటనలు వెలువడ్డపుడు ఈ స్కోరే ప్రధాన భూమిక అవుతుంది.
దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఒక్కో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు దూరాలు వెళ్లనక్కరలేదు
వెనుకబడిన ప్రాంతాల్లోని జిల్లాలు సహా దేశమంతటా దాదాపు 1000 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
అభ్యర్థుల దరఖాస్తులు, రోల్ నంబర్లు, అడ్మిట్ కార్డులు, మార్కుల జాబితా, మెరిట్ కార్డు అన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి
అన్ని భాషల్లోనూ ఈ ప్రవేశపరీక్ష ఉంటుంది. అందరికీ సమానావకాశాలుంటాయి
ప్రస్తుత రిజర్వేషన్ విధానమే అమలవుతుంది
దేశంలోని ఏ సెంటర్ నుంచైనా ఈ పరీక్ష రాయొచ్చు.
ఉమ్మడి ప్రవేశ పరీక్ష అంతా మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే ఉంటుంది.
తొలిదశలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎ్‌ససీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ పర్సనెల్ (ఐబీఎ్‌సపీ) ల ద్వారా నిర్వహిస్తున్న నియామకాలను ఈ సెట్ ద్వారా చేపడతారు.
మిగిలిన అన్ని సంస్థలనూ దశల వారీగా చేరుస్తారు.
సెట్ స్కోరు తరువాత రెండో, మూడో దశల పరీక్షలను- అంటే మౌఖిక, ఇతరత్రా పరీక్షలను సంబంధిత రిక్రూటింగ్ సంస్థలు నిర్వహిస్తాయి.
సెట్ స్కోరును కావలిస్తే రాష్ట్రాల్లోని నియామక సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా వినియోగించుకోవచ్చు
ఎన్‌ఆర్‌ఏ రూపురేఖలు
కార్యదర్శి స్థాయిలో ఉండే అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు
ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీఎస్‌పీ సహా అనేక రిక్రూటింగ్ సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
వచ్చే మూడేళ్ల కాలానికి 1517.57 కోట్లను ఎన్‌ఆర్‌ఏకు కేటాయించారు.
యువతకు ఎన్‌ఆర్‌ఏ ఓ వరం: మోదీ
ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు దేశంలోని నిరుద్యోగ యువతకు ఓ వరమని ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘‘ఎన్‌ఆర్‌ఏ వల్ల కోట్లాది మంది లాభపడతారు. ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు రాయక్కరలేదు. డబ్బు, సమయం, వనరులు ఆదా అవుతాయి. అంతేకాక, దీని వల్ల నియామకాల్లో పారదర్శకత కూడా పెరుగుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘ఇదొక విప్లవాత్మకమైన సంస్కరణ’ అని కేబినెట్ సమావేశ వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్, జితేంద్ర సింగ్ అభివర్ణించారు.