దివ్యాంగ విద్యార్థులకు ‘ఆన్‌లైన్’ కష్టాలు!
ABN , First Publish Date - 2020-06-22T19:03:09+05:30 IST
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విద్యాసంస్థలు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితులు లేకపోవడంతో బోధన ఆన్‌లైన్‌లోకి మారిపోయింది. అయితే దివ్యాంగులైన విద్యార్థులు ఈ ఆన్‌లైన్ విధానంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. సవిత (పేరు మార్చాం) అనే విద్యార్థి మెదడుకు సంబంధించిన

పాఠాలు అర్థంకాక ఇబ్బందులు
సాధారణ విద్యార్థులకూ తప్పని వెతలు
ప్రత్యేక సౌకర్యాల కోసం ప్రభుత్వానికి వినతి
న్యూఢిల్లీ, జూన్ 21: కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విద్యాసంస్థలు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితులు లేకపోవడంతో బోధన ఆన్‌లైన్‌లోకి మారిపోయింది. అయితే దివ్యాంగులైన విద్యార్థులు ఈ ఆన్‌లైన్ విధానంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. సవిత (పేరు మార్చాం) అనే విద్యార్థి మెదడుకు సంబంధించిన సమస్యతో బాధపడుతోంది. కొన్ని రోజులుగా ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతోంది. కానీ, అక్కడ ఉపాధ్యాయులు చెప్పేది ఆమె అర్థం చేసుకోలేకపోతోంది. తరగతి గదిలోనయితే.. తనకు అర్థంకాని విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునేది. కానీ, ఇక్కడ ఆమెకు ఆ అవకాశం లేకుండాపోతోంది. మరో దివ్యాంగ విద్యార్థి రఘు (పేరు మార్చాం)కు ఓ చేయి లేదు. మిగిలిన విద్యార్థుల లాగా వేగంగా టైప్ చేయలేడు. ఈ సమస్య వల్ల అతడు వెనకబడిపోతున్నాడు. నరేశ్, నాగేంద్రలు (పేర్లు మార్చాం) వినికిడి లోపంతో బాధపడుతున్నారు. తరగతి గదుల్లో ఎలాగోలా నెట్టుకొచ్చే వీళ్లు.. ఆన్‌లైన్‌లో ఏమీ వినబడక తలలు పట్టుకుంటున్నారు. తమకు ఆన్‌లైన్‌లో సంజ్ఞల ద్వారా బోధించాలని వీరు కోరుతున్నారు. ఇలాంటి వారు దేశంలో ఎంతమంది ఉన్నారో సరైన లెక్క కూడా లేదని ఈ అంశంపై అధ్యయనం చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు.
ఆన్‌లైన్ విద్యలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకునేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించి, తదనుగుణంగా మార్పులు చేయాలని సెంటర్ ఫర్ అడ్వకసీ అండ్ రీసెర్చి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అఖిలా శివదాస్ డిమాండ్ చేశారు. కాగా, దేశంలో ఉన్న సుమారు 35 కోట్ల మంది విద్యార్థుల్లో అధిక శాతం మందికి ఇంటర్నెట్, ఆన్‌లైన్ డివై్‌సలను ఉపయోగించడంపై అవగాహన లేదు.గ్రామీణ విద్యార్థుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. చాలా పల్లెలకు ఇంటర్నెట్ లేకపోవడం కూడా మరో కారణం. ఇలాంటి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని స్వచ్ఛంద సంస్థలు సూచిస్తున్నాయి.
ఆన్‘లైన్’ లేని వారికి పుస్తకాల వితరణ
ఇంటర్నెట్ సౌకర్యం లేని, ఉన్నా.. భరించగలిగే స్థోమత లేని విద్యార్థులకు సురాజ్ పటేల్ అనే ఓ ట్రైనీ ఐఏఎస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురాజ్.. 12 వేల మంది 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ప్రాథమిక విద్యాశాఖ ద్వారా ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. లాప్‌టా్‌పలు, స్మార్ట్‌ఫోన్లు, ఆన్‌లైన్ సౌకర్యం లేని విద్యార్థులకు పుస్తకాలు అందించామని ప్రాథమిక విద్యాశాఖ అధికారి తెలిపారు.