ప్రతి విద్యార్థికీ ‘ఆన్‌లైన్’ పాఠం.. సందేహాల నివృత్తికి వాట్సాప్ గ్రూప్
ABN , First Publish Date - 2020-09-01T15:04:59+05:30 IST
నేటి నుంచి టీ-శాట్, దూరదర్శన్ యాదగిరి చానళ్ల ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. మార్చి మూడో వారం నుంచి మూత పడిన పాఠశాలలు ఆగస్టు 27న తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్

జిల్లాలో 3.5 శాతం పిల్లలకు టీవీలు, స్మార్ట్‌ఫోన్లు లేవు
అలాంటి వారికి నేరుగా ఉపాధ్యాయుల బోధనలు
లేకుంటే తోటి విద్యార్థుల ఇళ్లలో పాఠాలు వినేందుకు చర్యలు
ఇప్పటివరకు 90 శాతం పుస్తకాలు పంపిణీ
ఆన్‌లైన్ తరగతులపై ప్రత్యేక శ్రద్ధ
‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ
నేటి నుంచి టీ-శాట్, దూరదర్శన్‌లో
ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): నేటి నుంచి టీ-శాట్, దూరదర్శన్ యాదగిరి చానళ్ల ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. మార్చి మూడో వారం నుంచి మూత పడిన పాఠశాలలు ఆగస్టు 27న తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లు, ప్రణాళికలను డీఈఓ వెంకటనర్సమ్మ ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. ఆమె మాటల్లోనే..
96.5 శాతం మందికి సాధనాలు..
జిల్లాలో మొత్తం 689 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలున్నాయి. 2019-20 విద్యాసంవత్సరం లెక్కల ప్రకారం దాదాపు 82,653 మంది చదువుతున్నారు. ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో ఎంతమంది విద్యార్థుల ఇళ్లలో టీవీలు, రేడియోలున్నాయి, ఎంతమంది తల్లిదండ్రుల వద్ద స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టా్‌పలున్నాయనే దానిపై ఇటీవల ఇంటింటి సర్వే నిర్వహించాం. ఇందులో 96.5 శాతం మందికి సాధనాలుండగా, 3.5 శాతం మంది పిల్లలకు ఇవి అందుబాటులో లేవని తేలింది.
వర్క్‌షీట్లతో నేరుగా బోధనలు
టీవీలు, స్మార్ట్‌ఫోన్లు లేని విద్యార్థుల ఇంటికి ఉపాధ్యాయులు నేరుగా వెళ్లి ఎస్‌సీఈఆర్‌టీ వర్క్‌షీట్ల ఆధారంగా బోధన చేస్తారు. స్మార్ట్‌ఫోన్ ఉండి, అదే తరగతికి చెందిన విద్యార్థి ఆ ఇంటి సమీపంలో ఉంటే వారిద్దరూ ఒకేచోట కూర్చుని పాఠాలు వినే విధంగా ఏర్పాట్లు చేశాం. విద్యార్థి, ఉపాధ్యాయుడి మధ్య తరగతి గదిలో జరిగే ప్రత్యక్ష బోధన నుంచి పరివర్తన ఇది. ఆన్‌లైన్‌లో డిజిటల్ పాఠాలు ప్రయోగం కాదు. రాబోయే రోజుల్లో కరోనా కంటే ఇంకా ఏవైనా అనుకోని పరిణామాలు ఎదురైతే ఇది అనుభవంగా, ప్రత్యామ్నాయంగా ఉండగలదు.
సందేహాల నివృత్తికి వాట్సాప్ గ్రూప్
ఒకటి నుంచి ఆరో తరగతి వరకు దూరదర్శన్‌లోని యాదగిరి చానల్, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు టీ-శాట్ చానల్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు బోధించేందుకు ఎస్‌సీఈఆర్‌టీ తగిన ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉపాధ్యాయులు కూడా తమ సబ్జెక్టు క్లాస్ పూర్తయిన వెంటనే సంబంధించిన వర్క్‌షీట్లను ఎస్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులకు చేరవేయాల్సి ఉంటుంది.
ఒక పాఠ్యాంశం పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఉపాధ్యాయుడి సెల్ నంబర్‌కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. అలాగే తరగతి వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో కూడా సందేహం పోస్ట్ చేయవచ్చు.
తరగతుల వారీగా షెడ్యూల్
ఆన్‌లైన్ క్లాసులను విద్యార్థుల తల్లిదండ్రులందరూ స్వాగతిస్తున్నారు. కొవిడ్ కారణంగా పిల్లలు సమయాన్ని వృథా చేస్తున్నారని ఇటీవల సర్వే నిర్వహించిన సమయంలో తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకొచ్చారు. ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నా ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
తరగతుల వారీగా టైం టేబుల్ ఉంది. వారికి కేటాయించిన సమయం ప్రకారం టీవీల్లో క్లాసులు వినాలి. ఆన్‌లైన్ క్లాసులపై ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సా్‌పల ద్వారా సమాచారాన్ని చేరవేశాం. ఆటోల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నాం. ఆన్‌లైన్ తరగతులపై ఉపాధ్యాయులందరూ ప్రత్యేక శ్రద్ధ వహించి, లక్ష్యాన్ని నెరవేర్చాలి.
పాఠ్యపుస్తకాల పంపిణీ
జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇప్పటివరకు 90 శాతం వరకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశాం. విద్యార్థులకు 100 శాతం యూనిఫాంలు చేరవేశాం. 10 నుంచి 20 మంది విద్యార్థుల చొప్పున పాఠశాలలకు రప్పించి యూనిఫాంలు అందజేస్తాం. మధ్యాహ్న భోజనం నిర్వహణను పట్టించుకోవాలని చాలామంది అడుగుతున్నారు. విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే దీనిని అమలు చేస్తాం.