ఆన్‌లైన్‌ విద్యకు 43శాతం గుడ్‌బై!

ABN , First Publish Date - 2020-07-19T22:33:08+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టేసిన అనంతరం విద్యారంగం రూపురేఖలే మారిపోతున్నాయి. అన్ని దేశాలూ ఆన్‌లైన్‌ బాటపడుతున్నాయి. ఈ-విద్య విషయంలో మన దేశం

ఆన్‌లైన్‌ విద్యకు 43శాతం గుడ్‌బై!

విద్యార్థులకు వైకల్యమే శాపం

మధ్యలోనే చదువు మానేస్తున్న వైనం


న్యూఢిల్లీ, జూలై 18 : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టేసిన అనంతరం విద్యారంగం రూపురేఖలే మారిపోతున్నాయి. అన్ని దేశాలూ ఆన్‌లైన్‌ బాటపడుతున్నాయి. ఈ-విద్య విషయంలో మన దేశం మౌలిక వసతులను మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది. కాస్తో కూస్తో ఆన్‌లైన్‌ తరగతులను అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రాల్లో.. వైకల్యం కారణంగా పలువురు విద్యార్థులు దానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ-విద్యలో తమకు ఉన్న ప్రతికూలతల వల్ల 43శాతం విద్యార్థులు చదువును మధ్యలోనే వదిలేస్తున్నట్టు తేలింది. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న స్వాభిమాన్‌ అనే సంస్థ 3,627 మందిని సర్వే చేసి మరీ నిగ్గు తేల్చింది. ఒడిసా, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, త్రిపుర, తమిళనాడు, సిక్కిం, నాగాలాండ్‌, హరియాణా, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో మే నెలలో ఈ సర్వే చేపట్టింది. 


వైకల్యం వల్ల 56.5 విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తరగతులకు సక్రమంగా వెళ్లలేకపోతున్నారు.

56.48 శాతం మాత్రమే చదువును కొనసాగిస్తున్నారు. మిగిలిన 43.52 శాతం మధ్యలోనే వదిలేస్తున్నారని సర్వే తేల్చింది.

సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలో తెలియడం లేదని 86శాతం మంది దివ్యాంగుల తల్లిదండ్రులు తెలిపారు. 

64శాతం మంది విద్యార్థుల ఇళ్ల వద్ద స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు ఏవీ లేవు. 

ఆన్‌లైన్‌ విద్య కోసం కంప్యూటర్లు కావాలని 67శాతం, డేటా/వైఫై సదుపాయం కావాలని 74 శాతం మంది విద్యార్థులు అభ్యర్థించారు. 


కొండ ఎక్కితేనే చదువు!

ఆన్‌లైన్‌ క్లాసుల సిగ్నల్‌కు బాలుడి కష్టం

జైపూర్‌ : అది ఉదయం 8గంటల సమయం. దరూరా గ్రామానికి చెందిన హరీశ్‌ తన పుస్తకాల సంచీ పట్టుకుని తమ ఊరి సమీపంలోని ఒక కొండ ఎక్కాడు. తిరిగి మధ్యాహ్నం 2గంటలకు కిందికి వచ్చి ఇంటికి చేరుకున్నాడు. ప్రతీరోజూ అతడికి ఇదో దినచర్యగా మారింది. ఇంతకూ రోజూ అతడెందుకు కొండ ఎక్కుతున్నాడనేదేగా మీ అనుమానం. చదువుకోవడానికి! అవును.. మీరు సరిగ్గానే చదివారు. స్థానిక జవహర్‌ నవోదయ విద్యాలయ్‌లో చదువుకుంటున్న హరీశ్‌, తమ ఉపాధ్యాయులు నిర్వహించే ఆన్‌లైన్‌ క్లాసులకు రోజూ హాజరు కాక తప్పదు. ఇంటి వద్దేమో ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. సెల్‌లో నెట్‌ వాడుకుందామంటే.. సిగ్నల్‌ అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఊరి సమీపంలోని కొండ ఎక్కి, సెల్‌లో నెట్‌ సాయంతో క్లాసులు వింటున్నాడు. అవి పూర్తైన తర్వాత మధ్యాహ్నం తిరిగి కిందకు వస్తున్నాడు. రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లాకు చెందిన హరీశ్‌ గురించి స్థానిక మీడియాలో కథనాలు రావడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2020-07-19T22:33:08+05:30 IST