గ్రూప్‌-1 మెయిన్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-12-10T15:59:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఈ నెల 14న నిర్వహించ తలపెట్టిన గ్రూప్‌-1 మెయిన్స్‌

గ్రూప్‌-1 మెయిన్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌

పరీక్ష నిలుపుదలకు నిరాకరించిన హైకోర్టు 

సింగిల్‌ జడ్జి తీర్పులో జోక్యానికి నో.. అప్పీలు పిటిషన్ల తోసివేత


అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఈ నెల 14న నిర్వహించ తలపెట్టిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ పరీక్ష నిలుపుదలకు నిరాకరించింది. పరీక్ష వాయిదా కోరుతూ పలువురు దాఖలు చేసిన అప్పీలు పిటిషన్లను తోసిపుచ్చింది. సింగిల్‌ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎన్‌.సాయిదినేశ్‌, ఎల్‌.నారాయణరావు, ఉప్పల శివలక్ష్మి తదితరులు హైకోర్టులో అప్పీలు చేశారు. ఫైనల్‌ ‘కీ’లో వచ్చిన తప్పులను సరిదిద్దేందుకు నిపుణుల కమిటీని నియమించేలా ఆదేశించాలని, పిటిషన్లు పరిష్కారమయ్యే వరకూ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థించారు.


ఆ పిటిషన్లపై ఇటీవల విచారణ రిపిన ధర్మసనం నిర్ణయాన్ని వాయిదా వేసింది. తీర్పును బుధవారం వెలువరించింది. ‘‘ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’లో పేర్కొన్న సమాధానాలు సరైనవేనని 26మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఆ జవాబుల ప్రామాణికతను న్యాయస్థానం తేల్చడం సరికాదు. సింగిల్‌ జడ్జి ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి ప్రశ్నల మూల్యాంకానికై ఆదేశాలు జారీ చేశారు. అందువల్ల మళ్లీ మూల్యాంకనం కోరడం సబబు కాదు. ప్రశ్నలు సరిగ్గా ఇవ్వనందున నష్టపోవడమనేది అభ్యర్థులందరికీ వర్తిస్తుంది. అయినా ప్రస్తుతం అప్పీళ్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఆదిలో ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు. గత ఏడాది మే 26న ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, 50వేల మంది హాజరయ్యారు. అనంతరం పలుమార్లు అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. నెల గడువు ఇచ్చినా కేవలం 100 అభ్యంతరాలే వచ్చాయి. వాటిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సవరణ ‘కీ’ విడుదల చేశారు. ఆ తరువాత కూడా అభ్యంతరాలకు అవకాశం, సవరించిన ‘కీ’ ఇచ్చినా, మళ్లీ అభ్యంతరం చెప్పడం సరికాదు. ఏ విధంగా చూసినా సింగిల్‌ జడ్జి తీర్పులో జోక్యం చేసుకునేందుకు తగిన కారణాలు కనిపించడం లేదు’’ అని ధర్మాసనం తీర్పులో తేల్చిచెప్పింది.

Updated Date - 2020-12-10T15:59:44+05:30 IST