ఆన్‌లైన్‌ పాఠాలకు నోచుకోని మైనార్టీలు

ABN , First Publish Date - 2020-09-03T14:38:21+05:30 IST

ఆన్‌లైన్‌ బోధనపై విద్యాశాఖతో పాటు సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుండగా.. మైనార్టీ విద్యా సంస్థల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

ఆన్‌లైన్‌ పాఠాలకు నోచుకోని మైనార్టీలు

204 పాఠశాలలు.. 90వేల విద్యార్థులు 

రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం 


హైదరాబాద్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ బోధనపై విద్యాశాఖతో పాటు సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుండగా.. మైనార్టీ విద్యా సంస్థల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 204 పాఠశాలల్లో  5 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య 90వేలకు పైగా ఉంది. వీరి కోసం నేటికీ ఆన్‌లైన్‌ పాఠాలపై దృష్టి సారించలేదంటే  ఈ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో విద్యార్థులు ప్రవేశాలు రద్దుచేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ గురుకులాల ఆధ్వర్యంలో 204 పాఠశాలలు, 12 జూనియర్‌ కాలేజీలు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో  సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2 నెలలుగా ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్నారు. కానీ, మైనార్టీ గురుకులాల్లో ఆ ఊసే లేదు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి 5-8 తరగతులకు ప్రవేశ పరీక్ష గత ఏప్రిల్‌ 18న, 9-10 తరగతులకు ఏప్రిల్‌-20న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. అనంతరం వచ్చిన దరఖాస్తుల్లో నుంచి లాటరీ విధానంలో ఎంపికచేసి ప్రవేశాలను పూర్తిచేసినా.. తరగతుల ప్రారంభాన్ని మాత్రం గాలికొదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనార్టీ గురుకుల సొసైటీలోని 3200 ఉపాధ్యాయులు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా వినియోగించుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. 


ఉర్దూలో ఒక్క వీడియో లేదు.. 

మైనార్టీ గురుకులాల్లో 70% సీట్లు ముస్లింలకే కేటాయించారు. విద్యార్థుల ఫస్ట్‌ లేదా సెకండ్‌ లాంగ్వేజ్‌ మాత్రం ఉర్దూ ఉంటుంది. ఆన్‌లైన్‌ ప్రసారాలు ప్రారంభించాలంటే ముందుగా ఆయా తరగతులకు ఇంగ్లిషు మీడియం పాఠాలు రూపొందించాలి. కానీ, ఇంతవరకు ఒక్క వీడియో రూపొందించలేదు. ఈ విషయంపై వివరణ కోరేందుకు మైనార్టీ గురుకులాల సంస్థ కార్యదర్శి బి.షఫీ ఉల్లాను సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.

Updated Date - 2020-09-03T14:38:21+05:30 IST