లైన్‌మెన్‌ పోస్టుల భర్తీలో లింగవివక్ష సరికాదు

ABN , First Publish Date - 2020-12-03T15:45:42+05:30 IST

జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీలో లింగ వివక్ష చూపడం సరికాదని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

లైన్‌మెన్‌ పోస్టుల భర్తీలో లింగవివక్ష సరికాదు

మహిళా అభ్యర్థులకు పోల్‌ క్లయింబింగ్‌ టెస్ట్‌ 

నిర్వహించండి:  ట్రాన్స్‌కోకు హైకోర్టు ఆదేశం


జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీలో లింగ వివక్ష చూపడం సరికాదని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. భారత నౌకాదళంలో కమిషన్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల్లో మహిళా అభ్యర్థుల నియామకంపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని గుర్తు చేసింది. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులకు పోల్‌ క్లయింబింగ్‌ టెస్టు నిర్వహించకపోవడం వివక్ష చూపడమేనని,  ఈ చర్య రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21లను ఉల్లంఘించడమేనని కోర్టు వ్యాఖ్యానించింది.


అర్హులైన  మహిళా అభ్యర్థులకు నెలరోజుల్లోగా పోల్‌ క్లయింబింగ్‌ పరీక్షలు నిర్వహించి ఫలితాలను సింగిల్‌ జడ్జి ముందుంచాలని తేల్చిచెప్పింది.ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది.




రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పటికీ మహిళా అభ్యర్థులకు పోల్‌ క్లయింబింగ్‌ టెస్ట్‌ నిర్వహించక పోవడాన్ని ప్రశ్నిస్తూ బి.భారతి, మరో  ఏడుగురు మహిళా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌కో తరపు సీనియర్‌ న్యాయవాది వాదిస్తూ... అభ్యర్థుల్లో ఇద్దరు మాత్రమే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న సింగిల్‌ జడ్జి ఆరుగురి పిటిషన్లను డిస్మిస్‌ చేశారు.


అయితే రాతపరీక్షల్లో అర్హత సాధించిన ఇద్దరు మహిళా అభ్యర్థులకు భవిష్యత్‌లో పోల్‌ క్లైంబింగ్‌ టెస్టు పెడితే అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. సింగిల్‌ జడ్జి ఆదేశాలపై  వి.భారతి, బి. శిరీష డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేశారు. ఈ  పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం లింగ వివక్ష చూపడం సరికాదని స్పష్టం చేసింది. 

Updated Date - 2020-12-03T15:45:42+05:30 IST