అధ్యాపకుల ప్రగతిభవన్‌ ముట్టడి

ABN , First Publish Date - 2020-12-28T15:54:58+05:30 IST

ఇంజనీరింగ్‌ కాలేజీల అధ్యాపకులు ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. కాలేజీల యాజమాన్యాలు తమకు మే నెల నుంచి

అధ్యాపకుల ప్రగతిభవన్‌ ముట్టడి

సాంకేతిక కాలేజీలు జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన

యాజమాన్యాలను సీఎం ఆదేశించాలని డిమాండ్‌

ముట్టడి అడ్డుకొని స్టేషన్‌కు తరలించిన పోలీసులు

జీతాలు, ఉద్యోగ భద్రత కల్పించేదాకా పోరాడతాం

గోషామహల్‌ మైదానంలో టీఎ్‌సటీసీఈఏ నిరసన

ఇంజనీరింగ్‌ కాలేజీలు జీతాలివ్వడంలేదని ఆందోళన


బేగంపేట/అఫ్జల్‌గంజ్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కాలేజీల అధ్యాపకులు ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. కాలేజీల యాజమాన్యాలు తమకు మే నెల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, దీంతో తాము తీవ్ర అవస్థలు పడుతున్నామని వారు తెలిపారు. సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకొని తమకు వేతనాలిచ్చేలా యాజమాన్యాలను ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. ఇంజనీరింగ్‌ కాలేజీలు పలువురు అధ్యాపకులను తొలగించడం, నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండడంపై ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం ‘అధ్యాపకులకు ఉద్వాసన’ శీర్షికన కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. 


ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర టెక్నికల్‌ కాలేజెస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకులు ఆదివారం ఉదయం ప్రగతి భవన్‌ వద్ద ఆందోళనకు దిగారు. ప్రగతి భవన్‌ వైపునకు చొచ్చుకెళ్లేందుకు వారు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. అనంతరం ఆందోళనకారులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే అధ్యాపకులు అక్కడ కూడా నిరసనకు దిగారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్నామని, కానీ, ఉన్న ఉద్యోగాలు ఊడతాయనుకోలేదని టీఎ్‌సటీసీఈఏ అధ్యక్షుడు సంతో్‌షకుమార్‌ అన్నారు. జీతాలు అడిగితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సాకుతో దాటవేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, జీతాలు చెల్లించేలా, తొలగించిన అధ్యాపకులను విధుల్లోకి తీసుకునేలా చూడాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2020-12-28T15:54:58+05:30 IST