ప్రభుత్వ స్కూళ్లలో ‘కేజీ’ విద్య

ABN , First Publish Date - 2020-07-22T18:03:22+05:30 IST

ప్రాథమిక విద్యారంగంలో కీలక మార్పుల దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కిండర్‌ గార్టెన్‌(కేజీ)పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పాఠశాల విద్య పరిధిలోకి పీపీ-1, పీపీ-2 క్లాసు(ఎల్‌కేజీ, యూ

ప్రభుత్వ స్కూళ్లలో ‘కేజీ’ విద్య

స్కూళ్ల పక్కనే అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు: సీఎం

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక విద్యారంగంలో కీలక మార్పుల దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కిండర్‌ గార్టెన్‌(కేజీ)పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పాఠశాల విద్య పరిధిలోకి పీపీ-1, పీపీ-2 క్లాసు(ఎల్‌కేజీ, యూకేజీ)లను తీసుకురానుంది. ఈ పిల్లలకూ నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. పాఠశాల విద్య, గోరుముద్దపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. స్కూళ్ల పక్కనే అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌, పరిశుభ్రత పాటించడంపై అవగాహన కల్పించాలన్నారు.  ప్రైవేటు స్కూళ్లకూ అక్రెడిటేషన్‌ విధానం ఉండాలని, వాటి ఫీజులపై పర్యవేక్షణ ఉండాలని, ఏటా తనిఖీలు చేయాలని, అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు ఒక యాప్‌ తీసుకురావాలి సూచించారు. ఇంగ్లీషు భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు టోఫెల్‌ తరహా పరీక్షలు నిర్వహించాలని, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌పైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక భవనం ఉండేలా చూసుకోవాలని సీఎం తెలిపారు. మండలానికో హైస్కూలును జూనియర్‌ కాలేజీగా మార్చేలా ఇదివరకే నిర్ణయం తీసుకున్నామన్నారు.

జూనియర్‌ కాలేజీల్లో పోటీ పరీక్షలకు తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. ఇందుకు సంబంధించి విధివిధానాల రూపకల్పనపై కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్‌లైన్‌లో స్కూళ్లకు అనుమతులు, గుర్తింపు పత్రాలు జారీచేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-07-22T18:03:22+05:30 IST