జేఈఈ మెయిన్స్‌లో తెలుగు సత్తా

ABN , First Publish Date - 2020-09-12T18:14:40+05:30 IST

జేఈఈ మెయిన్స్‌-2020 పరీక్షలో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు పర్సంటైల్‌ పంట పండించారు.

జేఈఈ మెయిన్స్‌లో తెలుగు సత్తా

టాపర్లలో ఏపీ, తెలంగాణ విద్యార్థులు

దేశవ్యాప్తంగా 24 మందికి 100 పర్సంటైల్‌ 

ఏపీ నుంచి ముగ్గురు.. తెలంగాణ నుంచి 8 మంది

పర్సంటైల్స్‌ విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ


అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్‌-2020 పరీక్షలో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు పర్సంటైల్‌ పంట పండించారు. జాతీయస్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో టాపర్లుగా నిలిచారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థుల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దాదాపు 10 వేల నుంచి 12 వేల మంది వరకూ ఉండవచ్చని అంచనా. వీరిలో ఏపీ నుంచి 6 వేల మంది, తెలంగాణ నుంచి 5 వేల మంది దాకా ఉంటారని సమాచారం. దేశవ్యాప్తంగా 24 మంది అభ్యర్థులు 100 పర్సెంటైల్‌ సాధించారు. ఇందులో ఏపీ విద్యార్థులు ముగ్గురు కాగా, తెలంగాణ విద్యార్థులు ఎనిమిది మంది ఉన్నారు.


ఏపీకి చెందిన లండ జితేంద్ర (చీపురుపల్లి - విజయనగరం జిల్లా), తడవర్తి విష్ణుశ్రీసాయి శంకర్‌ (బాపట్ల- గుంటూరు జిల్లా), వై.ఎ్‌స.ఎ్‌స.నరసింహనాయుడు 100 పర్సెంటైల్‌ సాధించారు. తెలంగాణకు చెందిన వాడపల్లి అరవింద్‌ నరసింహ, ఛాగరి కౌశల్‌ కుమార్‌రెడ్డి,  చుక్కా తనూజ, సాగి శివకృష్ణ, దీతి యశ్‌సచంద్ర, మొర్రెడ్డిగారి లిఖిత్‌ రెడ్డి, రాచపల్లి శశాంక్‌ అనిరుద్‌, రొంగల అరుణ్‌ సిద్ధార్థలు 100 పర్సెంటైల్‌ సాధించిన వారిలో ఉన్నారు. జేఈఈ మెయిన్స్‌-2020 ర్యాంకులు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరిలోనూ, ఈ నెల 2 నుంచి 6 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ పేపర్‌-1 (బీఈ/బీటెక్‌)కు హాజరైన అభ్యర్థులు సాధించిన ర్యాంకులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in లో ర్యాంకులను ప్రదర్శించింది. రెండు విడతల్లోనూ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు సంబంధించి ఏది ఎక్కువ స్కోర్‌ అయితే దానిని పరిగణనలోనికి తీసుకుని వారికి ర్యాంకు కేటాయించారు.


ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన మొదటి విడత జేఈఈ మెయిన్స్‌కు దేశవ్యాప్తంగా 9.21 లక్షల మంది హాజరు కాగా, ఈ నెలలో నిర్వహించిన రెండో విడత పరీక్ష రాసేందుకు 8.58 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకోగా వీరిలో 6.35 (74ు) లక్షల మంది హాజరైనట్లు సమాచారం. రెండో విడత జేఈఈ మెయిన్స్‌ పేపర్‌-1కు ఏపీ నుంచి 82,748 మంది, తెలంగాణ నుంచి 67,319 మంది అభ్యర్థులు రిజిస్టర్‌ అయ్యారు. దేశంలోని ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్‌ నిర్వహించారు. 

Updated Date - 2020-09-12T18:14:40+05:30 IST