డైలమాలో ఇంటర్‌ అడ్మిషన్లు

ABN , First Publish Date - 2020-10-27T15:49:44+05:30 IST

ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. ఇంటర్‌బోర్డు తొలిసారిగా అమలు చేయతలపెట్టిన ‘ఆన్‌లైన్‌’ విధానం యావత్తూ గందరగోళంగా మారింది. గతానికి భిన్నంగా తీసుకున్న పలు నిర్ణయాలు, అందుకు

డైలమాలో ఇంటర్‌ అడ్మిషన్లు

‘ఆన్‌లైన్‌’ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న మేనేజ్‌మెంట్లు

‘ఫైర్‌ సేఫ్టీ మాటున అవినీతి’ ఆరోపణలు

భవన అనుమతుల్లోనూ అక్రమాలు వెలుగులోకి

‘ఆన్‌లైన్‌’ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న మేనేజ్‌మెంట్లు

ఇన్‌టేక్‌ కెపాసిటీ సమర్పించని కార్పొరేట్‌ కాలేజీలు

ఆ కాలేజీలకు లాగిన్‌ ఇవ్వని బోర్డు

ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. ఇంటర్‌బోర్డు తొలిసారిగా అమలు చేయతలపెట్టిన ‘ఆన్‌లైన్‌’ విధానం యావత్తూ గందరగోళంగా మారింది. గతానికి భిన్నంగా తీసుకున్న పలు నిర్ణయాలు, అందుకు అనుగుణంగా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. నిబంధనల అ మలు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్‌లో ఒక్కో సెక్షన్‌కు ఉన్న ఇన్‌టేక్‌ సీలింగ్‌ను 88 నుంచి 40 సీట్లకు తగ్గిస్తూ ఇచ్చిన జీవో-23 న్యాయ వివాదానికి తెరలేపింది. ఈ ఉత్తర్వులను కేవలం ప్రైవేట్‌ కాలేజీలకు వర్తింపచేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ అసంబద్ధతను ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు సవాల్‌ చేయగా హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సదరు ఉత్తర్వులను నిలుపుదల చేసింది. అయితే ఈ విషయమై ఇంటర్‌బోర్డు స్పష్టత ఇవ్వలేదు.


షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 21 నుంచి ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియను బోర్డు ప్రారంభించింది. అంతకుముందు ఇన్‌టేక్‌ కెపాసిటీని సమర్పించాల్సిందిగా అన్ని కాలేజీలను ఇంటర్‌బోర్డు కోరింది. కానీ జీవో-23ని తప్పుబడుతున్న కార్పొరేట్‌ కాలేజీలు మాత్రం ఇన్‌టేక్‌ కెపాసిటీని సమర్పించలేదు. దీంతో ఆయా కాలేజీలకు ఇంటర్‌బోర్డు లాగిన్‌ ఇవ్వలేదు. ఫలితంగా రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేట్‌ కాలేజీలను వెబ్‌లో పెట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా కాలేజీలలో దాదాపు లక్ష వరకు సీట్లు ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి కార్పొరేట్‌ కాలేజీలు కొన్ని నెలల క్రితమే అనధికారికంగా అడ్మిషన్లు పూర్తిచేశాయి. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి ఫీజులు సైతం వసూలు చేశాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ అడ్మిషన్ల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాలేజీల యాజమాన్యాలు ఆన్‌లైన్‌ ప్రక్రియను సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇప్పుడేం జరుగుతుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


ఈ అంశాలపై స్పష్టత ఏదీ..

అనేక అంశాల్లో స్పష్టతలేకుండా ఇంటర్‌ బోర్డు తీసుకొచ్చిన ‘ఆన్‌లైన్‌’ విధానంతో ఇంటర్‌ విద్యావ్యవస్థ ప్రమాదంలో పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఉపయోగం లేని ఆన్‌లైన్‌ విధానంపై హడావుడి చేస్తోన్న ఇంటర్‌బోర్డు.. ట్యూషన్‌ ఫీజుల విషయాన్ని మాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. ఇంటర్‌ విద్యకు ఏ మాత్రం సరిపోని పాత   ఫీ జులతో కాలేజీలు ఎలా నిర్వహించాలని మేనేజ్‌మెంట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అఫిలియేషన్‌ ఫీజు లు, ఇన్‌స్పెక్షన్‌ ఫీజుల నిర్ధారణకు ప్రైవేట్‌ కాలేజీలను పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల వారీగా కేటగిరీలు చేస్తూ .. అన్ని కాలేజీలకు ఒకే ఫీజు అనడంలో ఔచిత్యం ఏమిటని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. 


అవినీతి.. అక్రమాల ఆరోపణలు

ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్ల విషయమై తాజాగా కొత్త నిర్ణయం అమలుచేయడం వల్ల ఆయా కాలేజీలకు అఫిలియేషన్‌ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి జీ+2 వరకు ఉండి 9 మీటర్ల లోపు ఎత్తున్న భవనాల్లో ని కాలేజీలను మాత్రమే వెబ్‌లో చూపించారని అంటున్నారు. ప్రైవేట్‌ కాలేజీలకు తప్పకుండా ఫైర్‌ సేఫ్టీ కావాలి, కానీ ప్రభుత్వ కాలేజీ భవనాలకు అవసరం లేదా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.ఈసర్టిఫికెట్ల విషయంలో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నా యి. ఎన్‌ఓసీ కావాలంటే రూ.87 వేలకు చలానా తీసి, తర్వాత రూ.2 లక్షల విలువైన పరికరాలు కాలేజీ భవనంలో అమర్చాల్సి ఉంటుంది. కానీ, కొన్ని కాలేజీల విషయంలో డిక్లరేషన్‌ తీసుకుని ఎన్‌ఓసీలు జారీచేస్తూ డబ్బులు తీసుకుంటురన్న అభియోగాలు ఉన్నాయి. కాగా, 2నెలల క్రితం పెండింగ్‌లో ఉన్న, ఈ సంవత్సరం ఇంటర్‌ అఫిలియేషన్‌ కోసం ఒక్కో కాలేజీ నుంచి సుమారు రూ.10 వేల వరకు అనధికారికంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ అడ్మిషన్లలో కాలేజీని బోర్డు వెబ్‌సైట్లో పెట్టాలంటే 20వేలు-25 వేల వరకు వసూలు చేస్తున్నారట!


ఈ కాలేజీలకు ఎలా ఇచ్చారు?

విస్తీర్ణం, బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్‌, ఆటస్థలం, మరుగుదొడ్లు, అధ్యాపకులు, సైన్స్‌ లాబ్‌, శానిటేషన్‌, లీజు డాక్యుమెంట్లు, పార్కింగ్‌, సొసైటీ స్థాపన తదితర అంశాల్లో బోగస్‌ డాక్యుమెంట్లు అప్‌లోడింగ్‌, జియో ట్యాగింగ్‌కు పాల్పడుతున్న వారికి అనుమతి ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ప్రకాశం జిల్లా గిద్దలూరులోని విజయ కోఆపరేటివ్‌ జూనియర్‌ కళాశాల, శ్రీసాయి చైతన్య జూనియర్‌ కళాశాల యాజమాన్యాలపై ఈ విధమైన ఆరోపణలు వచ్చాయి. 


పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వికాస్‌ జూనియర్‌ కాలేజీ భవనం కింద ఫ్లోర్‌లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ ఉన్నా, ఫేక్‌ డాక్యుమెంట్లు, ఫొటోలు అప్‌లోడ్‌ చేయడంతో ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు అనుమతి ఇచ్చినట్టు ఆరోపణలొచ్చాయి. 


చిత్తూరు జిల్లా బొమ్మయ్యగారి పల్లి, రొంపిచెర్ల క్రాస్‌ రోడ్‌లో ఒకే భవనంలో శ్రీసాయి ద్వారకా డిగ్రీ కళాశాలను ఒక అంతస్థులో, జూనియర్‌ కళాశాలను మరో అంతస్తులో, డీఎడ్‌ కాలేజీని ఇంకో అంతస్తులో నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీల కరస్పాండెంట్‌ ఇంటర్‌బోర్డు సభ్యుడు, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం(తిరుపతి) పాలకమండలి సభ్యుడు కావడంతో ఈ కాలేజీకి ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు అనుమతిచ్చినట్లు సమాచారం. 


Updated Date - 2020-10-27T15:49:44+05:30 IST