ఇంటిని బడిగా మార్చేయండి!

ABN , First Publish Date - 2020-09-03T18:00:27+05:30 IST

ఇది కరోనా కాలం. పెద్దల ఉద్యోగాలపైనే కాదు... పిల్లల చదువులపైనా మహమ్మారి పెను ప్రభావమే చూపింది. బడికి వెళ్లి నేర్చుకొనే విద్య... వర్చ్యువల్‌ తరగతులుగా

ఇంటిని బడిగా మార్చేయండి!

ఇది కరోనా కాలం. పెద్దల ఉద్యోగాలపైనే కాదు... పిల్లల చదువులపైనా మహమ్మారి పెను ప్రభావమే చూపింది. బడికి వెళ్లి నేర్చుకొనే విద్య... వర్చ్యువల్‌ తరగతులుగా మారిపోయింది. అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పునకు పిల్లలే కాదు... తల్లితండ్రులు కూడా అలవాటు పడడం కష్టమే. అయితే కొన్ని సూచనలు పాటిస్తే మీ పిల్లల కోసం ఇంటినే బడిగా మార్చేయవచ్చంటున్నారు నిపుణులు.  


‘బ్లాక్స్‌’గా విభజించండి: ముందుగా మనకేం కావాలో తెలుసుకోగలిగితే ఆతృత, ఆదుర్దా తగ్గి పరిమితులు నిర్దేశించుకోగలుగుతాం. అంటే ఏదో చేసేయాలనే ఆలోచనతో గందరగోళ పడకుండా రోజును ‘బ్లాక్స్‌’గా విభజించండి. చదువు, వ్యాయామం, ఆటలు, పనులు, టీవీ... ఇలా ఏమేం చేయాలో రాసుకోండి. స్కూల్లో టైమ్‌టేబుల్‌లాగా ‘ఒక్కో దానికి ఇంత’ అని సమయం కేటాయించండి.   


ఇష్టం తెలుసుకోండి: చాలా ముఖ్యమైన అంశం ఇది. తొలుత సంప్రదాయ అభ్యాస పద్ధతుల నుంచి బయటకు రండి. ఏ పాఠ్యాంశంపై మీ పిల్లలు బాగా ఆసక్తి చూపుతున్నారనేది గమనించండి. రోజూ ఆ సబ్జెక్టుపై కొంత సమయం వెచ్చించేలా చూడండి. అందులో లోతుగా అధ్యయనం చేసేలా వారిని ప్రోత్సహించండి. 


జీవిత పాఠాలు నేర్పండి: పిల్లలకు జీవిత పాఠాలు నేర్పడానికీ, రోజువారీ పనుల్లో వారిని భాగస్వాములను చేయడానికీ ఇంతకు మించిన సమయం దొరకదు. బట్టలు ఉతకడం, వంట చేయడం, ఇల్లు వాకిలీ శుభ్రంగా ఉంచడం వంటి పనులు వారి జీవనంలో భాగంగా మార్చండి.   


భావోద్వేగాల బంధం: ఈ విలువైన సమయాన్ని సాధ్యమైనంత వరకు పిల్లలతో కలిసి గడపండి. వారి మనసు తెలుసుకొంటూ... భావోద్వేగాలను పంచుకొంటూ... అనురాగ బంధాన్ని నిర్మించుకోండి.



Updated Date - 2020-09-03T18:00:27+05:30 IST