సెప్టెంబరు 24న హెచ్‌సీయూ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-08-20T17:33:47+05:30 IST

సెప్టెంబర్‌ 24 నుంచి 26 వరకు హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వైస్‌ ఛాన్స్‌లర్‌ పొదిలె అప్పారావు ప్రకటించారు. వివిధ పోస్టు గ్రాడ్యుయేట్‌, రీసర్చ్‌ కోర్సుల్లో ప్రవేశానికి

సెప్టెంబరు 24న హెచ్‌సీయూ ప్రవేశ పరీక్ష

దేశవ్యాప్తంగా 38 కేంద్రాల్లో నిర్వహణ 

నేటి నుంచే ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభం 


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): సెప్టెంబర్‌ 24 నుంచి 26 వరకు హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వైస్‌ ఛాన్స్‌లర్‌ పొదిలె అప్పారావు ప్రకటించారు. వివిధ పోస్టు గ్రాడ్యుయేట్‌, రీసర్చ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 38కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. ఈ మేరకు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో  వైస్‌ ఛాన్స్‌లర్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 62వేల మంది విద్యార్థులు హాజరవుతారని, పరీక్షా కేంద్రాల్లో అన్నీ రకాల కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుందని, ఆయా పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తామని తెలిపారు. కాగా, గురువారం నుంచి యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభిస్తున్నట్లు వైస్‌ ఛాన్స్‌లర్‌ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కొంతమంది విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సమస్యలను దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకడమిక్‌ ఇయర్‌ను ప్రారంభించేందుకు దేశంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన మొట్టమొదటి యూనివర్సిటీ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీయేనని తెలిపారు. విద్యా సంవత్సరం ఫీజులను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్సు ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ పి.వినోద్‌ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభించే ప్రక్రియను సులభతరం చేయడానికి యూనివర్సిటీ తీసుకున్న చర్యలను వివరించారు.   


త్వరలోనే ఇన్నోవేషన్‌ పార్కు 

ఆవిష్కరణల్లో హెచ్‌సీయూకు పదో ర్యాంకు రావడం పట్ల వీసీ పొదిలె అప్పారావు ఆనందం వ్యక్తం చేశారు. హెచ్‌సీయూలో విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఇన్నోవేషన్‌ పార్కును ఏర్పాటు చేయడానికి ఇప్పటికే మానవ వనరుల మంత్రిత్వ శాఖ అనుమతి కోరినట్లు తెలిపారు. ఇన్నోవేషన్‌ పార్కు ఏర్పాటు చేయడం వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. 

Updated Date - 2020-08-20T17:33:47+05:30 IST