ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కొత్త ఫీజులకు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-05-08T14:39:09+05:30 IST

ప్రైవేట్‌ అన్‌-ఎయిడెడ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ కోర్సులకు 2019-20 విద్యా సంవత్సరానికి కొత్త ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 15ను హైకోర్టు తదుపరి విచారణ వరకు నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కొత్త ఫీజులకు బ్రేక్‌

జీవో 15ని సస్పెండ్‌ చేసిన హైకోర్టు

విద్యాసంవత్సరం ప్రారంభంలో కాకుండా చివరిలో ఫీజులెలా ఖరారు చేస్తారు?

మూడేళ్లకోసారి నిర్ణయించాలని సుప్రీం చెప్పింది

ఇప్పుడు ఒక్క ఏడాదికే ఎలా నిర్ధారిస్తారు?

కాలేజీల తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రశ్నలు

తదుపరి విచారణ 11కి వాయిదా

విద్యాసంవత్సరం ప్రారంభంలో కాకుండా..చివరిలో ఫీజులెలా ఖరారు చేస్తారు?

ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసులు పెండింగ్‌లో ఉంటే.. కొత్త కమిషన్‌ సూచనలెలా అమలుచేస్తారు?

మూడేళ్లకోసారి ఫీజులు నిర్ణయించాలి

సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది

కాలేజీల తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రశ్నలు


అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ అన్‌-ఎయిడెడ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ కోర్సులకు 2019-20 విద్యా సంవత్సరానికి కొత్త ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 15ను హైకోర్టు తదుపరి విచారణ వరకు నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ చైర్మన్‌లను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే సోమవారాని(11వ తేదీ)కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావ్‌ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 281 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల ఖరారుకు సంబంధించి అడ్మిషన్లు-ఫీజుల నియంత్రణ కమిషన్‌ (ఏఎఫ్‌ఆర్‌సీ )’ చేసిన సిఫారసుల వ్యవహారంలో గతంలో రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్‌ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ఆ వ్యవహారం పెండింగ్‌లో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబరులో రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ (ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ)ను ఏర్పాటు చేసింది. ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులపై ఆ కమిషన్‌ ఇచ్చిన సిఫారసులను ఖరారు చేస్తూ గత మార్చి 24వ తేదీన జీవో నంబరు 15ని జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు జీవోను సవాల్‌ చేస్తూ రాష్ట్రంలోని 23 ఇంజనీరింగ్‌ కాలేజీలు గత నెలలో హైకోర్టును ఆశ్రయించాయి.


పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. విద్యాసంవత్సరం ప్రథమంలో ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులను ఖరారు చేయాల్సి ఉండగా, చివరిలో నిర్ణయించడం సరికాదని వివరించారు. గతంలో ఏఎ్‌ఫఆర్‌సీ ఇచ్చిన సిఫారసులు పెండింగ్‌లో ఉండగానే కొత్త కమిషన్‌ చేసిన సిఫారసులను అమలు చేయడమేంటని ప్రశ్నించారు. అదేవిధంగా మూడేళ్లకోసారి ఇంజనీరింగ్‌ ఫీజులను ఖరారు చేయాల్సి ఉందని, దీనిని సుప్రీంకోర్టు గతంలో స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. కానీ కొత్తగా ఏర్పాటైన కమిషన్‌ ఒక్క ఏడాదికి మాత్రమే ఫీజుల్ని ఖరారు చేయడమంటే సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడమేనని తెలిపారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జీవోను సస్పెండ్‌ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శులను, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ చైర్మన్‌ను ఆదేశించారు.

Updated Date - 2020-05-08T14:39:09+05:30 IST