కనుపాప జాగ్రత్త.. ఆన్‌లైన్‌ క్లాసులతో కళ్లకు ముప్పు

ABN , First Publish Date - 2020-06-22T21:07:36+05:30 IST

తరగతి గదిలో స్నేహితులతో కలిసి పాఠాలు వినాల్సిన విద్యార్థులు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారు. ఆన్‌లైన్‌లో పాఠం వింటూ అవగతం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

కనుపాప జాగ్రత్త.. ఆన్‌లైన్‌ క్లాసులతో కళ్లకు ముప్పు

రేడియేషన్‌తో అనారోగ్య సమస్యలు

వైద్య నిపుణుల హెచ్చరిక


కర్నూలు: తరగతి గదిలో స్నేహితులతో కలిసి పాఠాలు వినాల్సిన విద్యార్థులు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారు. ఆన్‌లైన్‌లో పాఠం వింటూ అవగతం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు కూడా తమ సెల్‌ఫోన్లను పిల్లల చేతికిచ్చి ప్రోత్సహిస్తున్నారు. కరోనా తెచ్చిన తంటా ఇది. ఇప్పట్లో స్కూళ్లు తెరిచే పరిస్థితి లేదు. విద్యార్థులు నష్టపోకుండా విద్యా సంస్థల యాజమాన్యాలు చేపట్టిన ఈ చర్యలకు తల్లిదండ్రులు కొంత మద్దతు పలుకుతున్నారు. కానీ ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్స్‌ వాడకం చిన్నారుల ఆరోగ్యానికి హాని చేస్తుంది. గంటల తరబడి వాటి ముందు కూర్చుంటే కంటి చూపు దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. రేడియేషన్‌ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 


కంటి సమస్యలు

ఫాస్టుఫుడ్‌, జంక్‌ఫుడ్‌కి పిల్లలు బాగా అలవాటు పడ్డారు. దీంతో సంప్రదాయ పౌష్టికాహారం దూరమైంది. ఐదేళ్ల ప్రాయానికే కొందరికి నేత్ర సమస్యలు వస్తున్నాయి. విటమిన్‌-ఎ లోపంతో చూపు మందగిస్తోంది. కనీసం పదేళ్ల వయసు వరకూ కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎనిమిది నుంచి పదేళ్ల మధ్య రెటీనా సహా కంటిలోని పలు భాగాలు వృద్ధి చెందుతాయి. ఈ వయసులో చూపులో సమస్య తలెత్తితే భ విషత్తు ఇబ్బందికరంగా మారిపోతుంది. సున్నితమైన కళ్లపై ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాలు దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గంటల తరబడి సెల్‌ఫోన్లను చూస్తున్నారు. దీనికి ఆన్‌లైన్‌ క్లాసులు తోడయ్యాయి. 


చికాకులు తప్పవు..

ఐప్యాడ్లు, స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ స్ర్కీన్లను తదేకంగా చూడటం వల్ల పిల్లల కళ్లు అలసిపోతాయి. ఆయా ఎలకా్ట్రనిక్‌ వస్తువుల నుంచి వచ్చే నీలికాంతి కంటి శుక్లంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. చిన్నతనంలోనే దృష్టి సమస్యలతో తమ వద్దకు 30 నుంచి 50 శాతం మంది వస్తున్నారని నేత్ర వైద్యులు అంటున్నారు. ఆన్‌లైన్‌ విధానం కొనసాగితే ఈ సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎలకా్ట్రనిక్‌ పరికరాల్లో స్ర్కీన్లు, వినికిడి పరికరాలు సరిగా లేకుంటే చిన్నారులు మరింత ఇబ్బంది పడతారు. స్ర్కీన్‌ వైపు మరింత పరీక్షగా చూస్తారు. ఇంటర్‌నెట్‌ సరిగ్గా లేకపోయినా ఇదే సమస్య ఉంటుంది. పదేపదే హెడ్‌ఫోన్లను, బ్లూ టూత్‌లను చెవులకు నొక్కుకుంటూ, కళ్లను నులుముకుంటారు. దీనివల్ల చిన్నారుల్లో కంటి, చెవి సమస్యలు తలెత్తుతాయి. 


జాగ్రత్తలు తీసుకోవాలి..

గంటల తరబడి తదేకంగా స్ర్కీన్లను చూడటం వల్ల కంటికి చాలా నష్టం జరుగుతుంది. పిల్లల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. దృష్టిని స్ర్కీన్‌ నుంచి మరల్చకపోవడం వల్ల డిజిటల్‌ ఐ స్టెయిన్‌ ఏర్పడుతుంది. ఫలితంగా కళ్లలో తేమ ఆరిపోతుంది. ఎర్రగా మారి మంటలు వస్తాయి. మున్ముందు దృష్టి లోపం పెరిగే ప్రమాదం ఉంటుంది. ఆన్‌లైన్‌ పాఠాలకు హాజరయ్యేటప్పుడు నెట్‌ కనెక్షన్‌తో పాటు మంచి స్ర్కీన్లు ఉన్న పరికరాలు ఎంపిక చేసుకోవాలి. కను రెప్పలను నిమిషానికి కనీసం పదిహేను సార్లు మూసి తెరుస్తుండాలి. దీన్ని బ్లింక్‌ రేట్‌ అంటారు. దీనివల్ల కళ్లలో తేమ ఆరిపోకుండా ఉంటుంది. ఇక మైనస్‌ పవర్‌ ఉన్న వాళ్లు మరీ దగ్గరగా స్ర్కీన్లను చూడడం ప్రమాదకరం. మొబైల్‌ ఫోన్లకు బదులుగా పిల్లలు ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్లను వినియోగించడం కొంతలో కొంత మంచిది. 

- డాక్టర్‌ సుధాకరరావు, కంటి వైద్య నిపుణులు, కర్నూలు

Updated Date - 2020-06-22T21:07:36+05:30 IST