ఇంజనీరింగ్ పరీక్షల తేదీలు మార్చాలి
ABN , First Publish Date - 2020-11-13T16:27:32+05:30 IST
ఈనెల 23 నుంచి జరగాల్సిన ఇంజనీరింగ్ పరీక్షలకు తగినంత వ్యవధి ఇవ్వాలని ఉస్మానియా
ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలి
ఉస్మానియా విద్యార్థులు ఆందోళన
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఈనెల 23 నుంచి జరగాల్సిన ఇంజనీరింగ్ పరీక్షలకు తగినంత వ్యవధి ఇవ్వాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు కోరుతున్నారు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్ని నెలలుగా కేవలం ఆన్‌లైన్ తరగతులు మాత్రమే కొనసాగడంతో చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయామని, అందువల్ల ప్రకటించిన తేదీలను వాయిదా వేయాలని కోరుతున్నారు.
నవంబరు-23 నుంచి పరీక్షలు ఉంటాయనే విషయాన్ని నవంబరు-6న వర్సిటీ ప్రకటించిందని, ఇంత తక్కువ వ్యవధిలో మిగిలిన బ్యాక్‌లాగ్స్ అన్నీ పూర్తిచేయడం కష్టమవుతుందని విద్యార్థులు అంటున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షలు రాయడం విద్యార్థులందరికీ ఇబ్బందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉస్మానియా పరిధిలోని గుర్తింపుపొందిన 12 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే పరీక్షలు రాస్తున్నందున.. తమకు ఆ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. విద్యార్థుల ఆందోళన విషయాన్ని రిజిస్ర్టార్ సిహెచ్.గోపాల్‌రెడ్ది దృష్టికి ‘ఆంధ్రజ్యోతి’ తీసుకెళ్లగా.. ఆయన స్పందించారు. కొవిడ్ నేపథ్యంలో పరీక్ష సమయాన్ని రెండు గంటలకు కుదించామని, విద్యార్థులకు అనుకూలంగా ఉండేందుకు ఈసారి పరీక్షల్లో 50శాతం చాయిస్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.