గ్రామీణ కాలేజీల్లో గుబులు

ABN , First Publish Date - 2020-10-27T16:30:34+05:30 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్న విశాలమైన భవనం నల్లగొండ జిల్లా సాగర్‌ రోడ్డు సమీపంలోని శ్రీ రామానంద తీర్థ ఇంజనీరింగ్‌ కాలేజీ. 1996లో ప్రారంభమైన తొలి ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఇదే. తొలుత ఈ కాలేజీలో 900 సీట్లు ఉండేవి. క్రమంగా విద్యార్థులు తగ్గడంతో ఈ కాలేజీ మూతపడింది.

గ్రామీణ కాలేజీల్లో గుబులు

ఈసారి మూతబడేవెన్నో..?  

తొలివిడత కౌన్సెలింగ్‌లో భర్తీ అంతంతే

ఇంజనీరింగ్‌ కాలేజీలపై వేలాడుతున్న కత్తి  

ఆరేళ్లలో 156 కాలేజీలు మూత 


ఈ చిత్రంలో కనిపిస్తున్న విశాలమైన భవనం నల్లగొండ జిల్లా సాగర్‌ రోడ్డు సమీపంలోని శ్రీ రామానంద తీర్థ ఇంజనీరింగ్‌ కాలేజీ. 1996లో ప్రారంభమైన తొలి ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఇదే. తొలుత ఈ కాలేజీలో 900 సీట్లు ఉండేవి. క్రమంగా విద్యార్థులు తగ్గడంతో ఈ కాలేజీ మూతపడింది. 


(ఆంధ్రజ్యోతి-హైదరాబాద్‌)


రామానంద తీర్థ, లక్ష్య ఇంజనీరింగ్‌ కాలేజీలకు మాత్రమే సంబంధించిన సమస్య కాదిది. ఆరేళ్లలో రాష్ట్రంలో ఇలా 156 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడ్డాయి. 2014-15లో 325 కాలేజీలుండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 178కి పడిపోయింది. వీటిల్లో 90ు గ్రామీణ ప్రాంతాల్లోనివే. హైదరాబాద్‌, రంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో 40 వరకు రాజకీయ నేతల కాలేజీలే ఉన్నాయి. ఇక్కడ ఏటా డిమాండ్‌కు తగ్గట్టు కొత్త సీట్లు కేటాయిస్తుండటం, ప్రభుత్వం వీటినే ప్రోత్సహిస్తూ వస్తుండటంతో  జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురై మూతపడుతున్నాయి. 


గ్రామీణ కాలేజీలపైనే ప్రభావం.. 

2014లో రాష్ట్రం ఆవిర్భవించాక కాలేజీల సంఖ్యను భారీగా కుదించారు. ఇబ్బడి ముబ్బడిగా కాలేజీలుంటే విద్యలో నాణ్యత తగ్గుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు విద్యార్థులు తక్కువగా ఉన్న కాలేజీలపై ముందుగా దృష్టి సారించిన జేఎన్‌టీయూ 2014-15లో వందకు పైగా కాలేజీలకు అనుమతులు ఇవ్వలేదు. వీటిలో 90ు కాలేజీలు గ్రామీణ ప్రాంతాల్లోనివే. తర్వాత విద్యార్థుల సంఖ్య ఆధారంగా అనుమతులు కేటాయిస్తూ వస్తున్నారు. మొత్తం సీట్లలో 50ు నిండకపోతే ఆ కోర్సుకు వచ్చే ఏడాది అనుమతి లభించడం లేదు. 


కొత్త సీట్లన్నీ పెద్ద కాలేజీలకే.. 

రాజధాని పరిసరాల్లో ఉన్నవాటిలో ఎక్కువ కాలేజీలు రాజకీయ నేతలకు చెందినవే. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఏటా ఈ కాలేజీల్లో సీట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది కొత్తగా కొత్తగా 18,210 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కృత్రిమ మేఽథ(ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ), రోబోటిక్స్‌, డేటా సైన్స్‌ లాంటి కొత్త కోర్సులు ప్రవేశ పెట్టారు. ఈ కోర్సులకు సంబంధించి 90ు సీట్లను రాజధాని పరిసరాల్లోని 40 కాలేజీలకే కేటాయించారు. కొన్ని కాలేజీల్లో సీట్లు గత ఏడాది 500-600 వరకు ఉండగా.. ఈసారి 800-900కి చేరాయి. మరోవైపు  జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సీట్ల సంఖ్య తగ్గింది. గత ఏడాది 50శాతం సీట్లు నిండని కాలేజీల్లో ఈసారి 9,000 సీట్లకు అధికారులు కోత విధించారు. ఇక్కడ ఒక్కో కాలేజీలో ప్రథమ సంవత్సరంలో గరిష్ఠంగా 150- 200 సీట్లు ఉండగా, 100 సీట్లు కూడా భర్తీ కావడం లేదు.


ఈసారి ఎంసెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌లో  70,135 సీట్లలో 50,137 భర్తీ అయ్యాయి. 35 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 100ు సీట్లు భర్తీకాగా.. వీటిలో 28 కాలేజీలు హైదరాబాద్‌ పరిసరాల్లోనివే. మిగతా కాలేజీల్లోనూ 60-80శాతం సీట్లు భర్తీ కాగా.. గ్రామీణ ప్రాంతాల్లోని అత్యధిక కాలేజీల్లో సగం కూడా నిండలేదు. మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టు ఉపాధి అవకాశాలు అందించే కొత్త కోర్సుల కేటాయింపుల్లో ఎక్కువశాతం హైదరాబాద్‌ పరిసరాల్లోని కాలేజీలకే కేటారుస్తుండటంతో విద్యార్థులు ఈ కాలేజీలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలు, జిల్లాల్లోని  కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రతి  తగ్గుతూ వస్తోంది. 


ప్రభుత్వంపైనా భారమే.. 

పెద్ద ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు పెంచుకుంటూ, ఇతర కాలేజీలను విస్మరించడంతో ఏటా ప్రభుత్వం పైనా పెద్ద భారమే పడుతోంది. పెద్ద కాలేజీల్లో వార్షిక ఫీజు రూ.1.22 లక్షల వరకు  ఉండగా.. జిల్లాల్లో అయితే రూ. 40-50వేలలోపే ఉంటుంది. ఈసారి కొత్తగా కేటాయించిన 18,210 సీట్లలో దాదాపుగా అన్నీ పెద్ద కాలేజీలకే చెందినవి కావడంతో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకు సాధించిన వారందరితో పాటు ర్యాంకులతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులకు కళాశాల వసూలు చేసే పూర్తి ఫీజును ప్రభుత్వం  చెల్లిస్తోంది. 10 వేల ర్యాంకులు దాటిన ఓబీసీ విద్యార్థులకు ప్రభుత్వం గరిష్ఠంగా రూ. 35వేలు చెల్లిస్తోంది.  దీంతో ఈ సంవత్సరం ప్రభుత్వంపై అదనంగా రూ. 33.85 కోట్ల భారం పడుతోంది. ఈ లెక్కన వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం పెద్ద కాలేజీలకు రూ. 135 కోట్లు చెల్లిస్తుండగా ఇందులో ఎక్కువ భాగం పెద్ద కాలేజీలకే వెళ్తుంది.


ఇది ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్ల గ్రామంలోని లక్ష్య ఇంజనీరింగ్‌ కాలేజీ. 2008లో యూజీలో-440, పీజీలో 104 సీట్లతో ప్రారంభమైంది. విద్యార్థుల్లేక సీట్ల సంఖ్యను కుదించుకుంటూ వచ్చింది. రెండేళ్ల క్రితం ఇది మూతపడింది. ఖాళీగా ఉండటంతో ఈ భవనాలను గిరిజన సంక్షేమ గురుకులానికి అద్దెకు ఇచ్చారు.


Updated Date - 2020-10-27T16:30:34+05:30 IST