ఉత్సాహం.. ఉత్తీర్ణత తగ్గాయి!

ABN , First Publish Date - 2020-10-07T16:29:06+05:30 IST

ఎంసెట్‌ ఇంజనీరింగ్‌పై విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతోందా? మునుపటిలా ఎంసెట్‌కు క్రేజ్‌ లేదా? ఏడాది క్రితం, ఇప్పటి ఫలితాలను పోల్చి చూస్తే ‘ఔను’ అనే అనిపిస్తోంది

ఉత్సాహం.. ఉత్తీర్ణత తగ్గాయి!

ఎంసెట్‌లో 75% పాస్‌.. నిరుటితో పోల్చితే 7.18 తగ్గుదల 

గత ఏడాది 1,31,209 మందిలో 1,08,213 పాస్‌

ఈసారి హాజరైంది 1,19,183.. ఉత్తీర్ణులైంది 89,734

టాప్‌-10లో అంతా అబ్బాయిలే.. సగం ఏపీ నుంచి

టాపర్‌ హైదరాబాదీ.. 9 నుంచి 36 కేంద్రాల్లో కౌన్సెలింగ్‌ 

స్లాట్‌ వ్యవధి 60 నుంచి 30 నిమిషాలకు కుదింపు 

ఎంసెట్‌కు గైర్హాజరైన వారికి పరీక్ష రేపు


హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ ఇంజనీరింగ్‌పై విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతోందా? మునుపటిలా ఎంసెట్‌కు క్రేజ్‌ లేదా? ఏడాది క్రితం, ఇప్పటి ఫలితాలను పోల్చి చూస్తే ‘ఔను’ అనే అనిపిస్తోంది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఎంసెంట్‌లో విద్యార్థుల హాజరు మాత్రమే కాదు.. ఉత్తీర్ణత కూడా భారీగా తగ్గింది.  ఎంసెట్‌-2020 ఫలితాల్లో 75.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షకు 1,43,326 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,19,183 (83.19%) మంది హాజరయ్యారు.


వీరిలో 89,734 మంది అర్హత సాఽధించారు. నిరుడు పరీక్షకు 1,31,209 మంది పరీక్షకు హాజరవ్వగా 1,08,213 మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 82.47 అంటే ఈసారి ఉత్తీర్ణత శాతం 7.18 శాతం తగ్గింది. మంగళవారం ఇక్కడ జేఎన్‌టీయూలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుల చేశారు. ఈసారి టాప్‌ టెన్‌-10లో అంతా అబ్బాయిలే కావడం విశేషం. వీరిలో ఏపీ నుం చి ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. 147.2905 మార్కులతో హైదరాబాద్‌ విద్యార్థి సాయితేజ వారణాసి టాపర్‌గా నిలిచారు.


మొదటి ర్యాంకుతో పాటు 4, 5, 6, 8 ర్యాంకులు తెలంగాణ విద్యార్థులకు దక్కాయి. 2, 3, 7, 9, 10 ర్యాంకులు ఏపీ విద్యార్థులు దక్కించుకున్నారు. ఏపీ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కె.యశ్వంత్‌ 144 మార్కులతో ద్వితీయ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వాసి టి. మణి వెంకటకృష్ణ (143) తృతీయ ర్యాంకు సాధించారు. గత ఏడాది  ఏపీకి చెందిన కురుశెట్టి రవిశ్రీ తేజ 150.80 మార్కులతో టాపర్‌గా నిలవగా.. ఈసారి టాపర్‌కు 3.51 మార్కులు తగ్గాయి.


కాగా గత నెలలో జరిగిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షకు హాజరుకాలేకపోయిన వారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి అన్నారు. వీరికి హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని అయాన్‌ సెంటర్లో గురువారం (8న) పరీక్ష ఉంటుందన్నారు. 85 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిందరికీ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు.  


ఈడబ్ల్యూఎస్‌ జీవో రాలేదు.. 

ఈనెల 9 నుంచి ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ జరుగుతుందని ఎంసెట్‌ ప్రవేశాలకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లా కేంద్రాల్లోని 36 కౌన్సిలింగ్‌ సెంటర్ల ద్వారా ఈ ప్రక్రియ ఉంటుందన్నారు. ప్రతిసారి ఒక్కో స్లాట్‌ వ్యవధి 60 నిమిషాల పాటు ఉండగా.. ఈసారి కరోనా నేపథ్యంలో విద్యార్థుల రద్దీని తగ్గించాలన్న లక్ష్యంగా వ్యవధిని 30 నిమిషాలకు కుదించామన్నారు. ప్రతి స్లాట్‌లో ఐదారు విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. మైనారిటీ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఎంసెట్‌ రాయకపోయినా ప్రవేశాలు పొందే అవకాశం ఉందన్నారు. ఈసారి కౌన్సిలింగ్‌లో కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాల సంఖ్యను తెలిపినా చాలన్నారు. ఈసారి రెవెన్యూ సర్వర్‌తో అనుసంధానం చేసినందున సర్టిఫికేట్లు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. నవంబరు 4న స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. ఈసారి కౌన్సిలింగ్‌లో క్రీడా కోటా అమలుచేస్తున్నామని, ఈడబ్ల్యూఎ్‌సపై ప్రభుత్వం నుంచి ఇంకా జీవో విడుదల కానందున అమలు గురించి నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. 


ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల వెనుకంజ

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు వెనుకబడ్డారు. ఈసారి 8799 మంది పరీక్షకు హాజరవ్వగా వీరిలో 6046 (68.71%) మంది అర్హత సాధించారు.  


జేఈఈలో 6, ఎంసెట్‌లో 5వ ర్యాంకు 

జేఈఈతో పాటు ఎంసెట్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సత్తా చాటాడు హైదరాబాద్‌ విద్యార్థి హార్థిక్‌ రాజ్‌పాల్‌. భోపాల్‌కు చెందిన ఈయన కుటుంబం ఐదేళ్లుగామణికొండలో స్థిరపడింది. జేఈఈ ఫలితాల్లో ఓపెన్‌  విభాగంలో హార్థిక్‌ జాతీయస్థాయిలో 6వ ర్యాంకు సాధించగా.. ఎంసెట్‌లో 5వ ర్యాంకు సాధించారు. ఐఐటి బాంబేలో కం ప్యూటర్‌  సైన్స్‌ ఇంజినీరింగ్‌లో చేరుతానని హార్థిక్‌ రాజ్‌పాల్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాగా, ఎంసెట్‌ ఫలితాల్లో క్వాలిఫై కాలేదనే ఆవేదనతో జగిత్యాల జిల్లా హస్నాబాద్‌ గ్రామవాసి చింతనూరి వెంకటేశ్‌(19) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  


టాపర్లు వీరే

ర్యాంకు        పేరు కంబైన్డ్‌ స్కోర్‌ ఎంసెట్‌ మార్కులు 


1) సాయితేజ వారణాసి 93.3757 147.2905 

2)  కె. యశ్వంత్‌ సాయి 92.6199  144.5225 

3)  టి. మణివెంకట క్రిష్ణ 91.9234 143.7478 

4)  కౌశల్‌ కుమార్‌ రెడ్డి 91.8498 142.6118 

5) హార్దిక్‌ రాజ్‌పాల్‌ 89.8031 139.2244 

6) నాగెల్లి నితిన్‌ సాయి 89.6648 140.3515 

7)  తవ్వ క్రిష్ణకమల్‌ 89.5296 138.8187 

8)  అన్నం సాయివర్ధన్‌ 89.4362 139.3306  

9)  పి.వి.ఎస్‌. హర్షవర్ధన్‌ 89.2191 138.6007 

10)  వారణాసి వచన్‌ సిద్దార్థ్‌  89.1052 137.2910
Read more