ఖాళీలను దాచేసి కౌన్సెలింగ్‌!

ABN , First Publish Date - 2020-10-31T15:55:10+05:30 IST

ఆరోగ్యశాఖలోని డీఎంఈ విభాగానికి నిబంధనలు పట్టడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులను కూడా మార్చేసి, కొత్త నిబంధనలు తెరపైకి తీసుకొస్తున్నారు. చివరికి రాజ్యాంగ బద్ధంగా

ఖాళీలను దాచేసి కౌన్సెలింగ్‌!

డీఎంఈలో అడ్డగోలుగా నియామకాలు

755 ఖాళీల్లో 302 మాత్రమే చూపించారు

కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖలోని డీఎంఈ విభాగానికి నిబంధనలు పట్టడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులను కూడా మార్చేసి, కొత్త నిబంధనలు తెరపైకి తీసుకొస్తున్నారు. చివరికి రాజ్యాంగ బద్ధంగా నిర్వహించాల్సిన పోస్టుల భర్తీలోనూ నిబంధనలు గాలికొదిలేసి గందరగోళంగా మార్చేశారు. ఈ మఽధ్యకాలంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) అధికారులు చేపట్టిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో నిబంధనలు, జీవోలను పరిగణలోకి తీసుకోలేదు. అఽధికారులకు నచ్చినట్టు, ఇష్టారాజ్యంగా పోస్టులు భర్తీ ప్రక్రియను పూర్తిచేశారు. 


రాష్ట్రంలో 2006 వరకూ డీఎంఈ, ఏపీవీవీపీ (ఏపీ వైద్య విధాన్‌ పరిషత్‌) విభాగాలకు కావాల్సిన వైద్యుల నియామకాలు మొత్తం డీహెచ్‌లో జరిగేవి. 2006 నుంచి డీఎంఈ అధికారులే నేరుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అప్పటి నుంచి జీవో 154 ఆధారంగా నియామకాలు చేపడుతున్నారు. ఈ జీవో ప్రకారం మొత్తం పోస్టుల్లో 60 శాతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, 40 శాతం లెట్రల్‌ ఎంట్రీ (డీహెచ్‌, ఏపీవీవీపీల్లో ఉన్న స్పెషలిస్ట్‌ వైద్యులు) ద్వారా భర్తీ చేయాలి. ఈ ఏడాది మొత్తం 755 పోస్టులను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో 60 శాతం అంటే 453 పోస్టులు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 302 పోస్టులు లెట్రల్‌ ఎంట్రీ ద్వారా భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత లెట్రల్‌ ఎంట్రీ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. వాటికోసం వేలాది దరఖాస్తులు రాగా అధికారులు మెరిట్‌ లిస్ట్‌ సిద్ధం చేసి, కౌన్సెలింగ్‌ నిర్వహించారు. నిబంధనల ప్రకారం తొలుత డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేసినా, లెట్రల్‌ ఎంట్రీ చేసినా కౌన్సెలింగ్‌లో ఉన్న ఖాళీలు మొత్తం చూపించాలి. అందులో అభ్యర్థులకు నచ్చిన చోట ఆప్షన్‌ తీసుకుంటారు. కానీ అధికారులు లెట్రల్‌ ఎంట్రీ ద్వారా 302 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నాం కాబట్టి అవే చూపిస్తామని చెబుతూ కౌన్సెలింగ్‌ పూర్తిచేశారు.


కౌన్సెలింగ్‌కు వచ్చిన వైద్యులకు మిగిలిన 453 ఖాళీలను చూపించకుండా దాచేశారు. దీంతో లెట్రల్‌ ఎంట్రీ వైద్యులకు కావాల్సిన చోట పోస్టింగ్‌లు లేక.. ఉన్న వాటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జీవో 154 ప్రకారం ఉన్న పోస్టులను 60:40 ప్రకారం భర్తీ చేయాలన్న నిబంధన ఉంది. కానీ కౌన్సెలింగ్‌ సమయంలో ఖాళీలను కూడా 60:40 చూపాలని ఎక్కడా లేదు. డీఎంఈ అధికారులు ఈ ఏడాది కొత్తగా ఈ నిబంధన తెరపైకి తెచ్చి  లెట్రల్‌ వైద్యులకు తీవ్ర అన్యాయం చేశారు. దీని వెనక భారీగా చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావాలనే కొన్ని పోస్టులను ముందుగానే బ్లాక్‌ చేసి తమకు కావాల్సిన వారికి ఆ పోస్టులు వచ్చేలా పక్కా స్కెచ్‌ వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను రద్దు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. 


మంచి ఖాళీల కోసమే అని సాకులు

డీఎంఈ హాస్పిటల్స్‌ నగరాల్లోనే ఉంటాయి. వాటిలోనూ విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు మెడికల్‌ కాలేజీల్లో వైద్యుల పోస్టులకు మరింత ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఏడాది నియామకాల్లో లెట్రల్‌ ఎంట్రీ వైద్యులకు మొత్తం 755 ఖాళీలు ఎందుకు చూపించలేదని అధికారుల్ని ప్రశ్నిస్తే.. మంచి ఖాళీల కోసమే అని సమాధానం ఇచ్చారు. నిబంధనల ప్రకారం లెట్రల్‌ ఎంట్రీ వైద్యులకు 755 ఖాళీలను చూపిస్తే విశాఖ, విజయవాడ, కర్నూలు లాంటి ముఖ్యమైన చోట్ల పోస్టులన్నీ వారే తీసేసుకుంటారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వాళ్లకి మంచి పోస్టులు దక్కవు. కాబట్టి ఖాళీలను కూడా 60:40 చేశామని డీఎంఈలోని ఉన్నతాధికారి ఒకరు బదులిచ్చారు. దీని ప్రకారం లెట్రల్‌ ఎంట్రీ వైద్యుల హక్కును కాలరాసే విధంగా డీఎంఈ అధికారులు నియామకాలు చేపట్టారని అర్థమవుతోంది. వాస్తవానికి ఈ సమస్యను పరిష్కరించేందుకే అప్పట్లో జీవో 154లో ఫైవ్‌ సైకిల్‌ నిబంధన పెట్టారు. అంటే ఉన్న ఖాళీల్లో 3:1:1 నిబంధన అమలు చేయాలి.


అంటే ఉదాహరణకు ఐదు పోస్టులు ఉంటే అందులో 3 డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌కు, 1 ట్యూటర్స్‌కి, 1 డీహెచ్‌, ఏపీవీవీపీ వైద్యులకు కేటాయించాలి. ఈ నిబంధన ప్రకారం నియామకాల సమయంలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, లెట్రల్‌ ఎంట్రీ పోస్టులు ఒకేసారి భర్తీచేయాలి. లేదంటే తొలుత డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలి. దాని వల్ల వాళ్లు ఫస్ట్‌ ప్రభుత్వ సర్వీ్‌సలోకి వచ్చేస్తారు. కాబట్టి సీనియారిటీలో ఎలాంటి సమస్య రాదు. డీఎంఈ అధికారులు ఈ మధ్య కాలంలో జరిగిన నియామకాల్లో ఈ నిబంధనలేవీ పాటించలేదు. దీనిపై అధికారుల్ని ప్రశ్నిస్తే ఒకేసారి వేల పోస్టల భర్తీ చేయడం కష్టం అవుతుందని సాకులు చెబుతున్నారు. ఈ నెపంలో నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు భర్తీచేసి వైద్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. 



Updated Date - 2020-10-31T15:55:10+05:30 IST