సమీప భవిష్యత్తులో పరీక్షలు నిర్వహిస్తాం
ABN , First Publish Date - 2020-07-10T17:50:45+05:30 IST
రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షలను ఈనెల 8న యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సమీప భవిష్యత్తులో నిర్వహిస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. పరీక్షల తేదీలను

యూజీసీ చెప్పినట్లే డిగ్రీ, పీజీ పరీక్షలు
హైకోర్టుకు నివేదించిన ఏజీ ప్రసాద్
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షలను ఈనెల 8న యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సమీప భవిష్యత్తులో నిర్వహిస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. అన్ని ప్రవేశ పరీక్షలూ వాయిదా వేయాలని, యూజీ/పీజీ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు అకడమిక్ ట్రాక్ రికార్డు ప్రకారం పాస్ చేయాలని కోరుతూ ఎన్‌ఎ్‌సయూఐ అధ్యక్షుడు బీవీ నర్సింగరావు హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యం గురువారం సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు మరోసారి విచారణకు వచ్చింది. గత విచారణ సందర్భంగా అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తామని ఏజీ కోర్టుకు తెలిపారని, అయితే డిగ్రీ/పీజీ కోర్సులకు సంబంధించిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. క్యాంపస్ సెలక్షన్లలో ఎంపికై కొందరు, ఉన్నత చదువులకోసం మరికొందరు విదేశాలకు వెళ్లడానికి సన్నాహాలు చేసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. స్థూలంగా యూజీసీ మార్గదర్శకాలు సూచనప్రాయంగా ఉంటాయని, వాటిని విధిగా పాటించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటికే 7 రాష్ట్రాల్లో డిగ్రీ/పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకుండానే అకడమిక్ ట్రాక్ రికార్డు ఆధారంగా విద్యార్థులకు గ్రేడులు కేటాయించారని తెలిపారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. విధాన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయజాలమని స్పష్టం చేసింది. పరీక్షలను వాయిదా వేయవచ్చని యూజీసీ కూడా చెబుతోందని తెలిపింది. మన రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరింత తీవ్రమైతే.. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. కరోనా కారణంగా తాము సైతం నల్సార్ లా యూనివర్సిటీలో పరీక్షలు జూలైలో నిర్వహించడం లేదని సీజే పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే అంశంపై దాఖలైన మరో రెండు వ్యాజ్యాలను ఈ వ్యాజ్యంతో జతపర్చి విచారణకు వేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది