కాంట్రాక్టు లెక్చరర్ల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2020-09-05T17:05:11+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 3720 మంది అధ్యాపకులకు గత ఆరు

కాంట్రాక్టు లెక్చరర్ల ఆకలి కేకలు

3,720 మందికి 6 నెలలుగా జీతాల్లేవు

ఆర్థికశాఖలో మగ్గుతున్న రెన్యువల్‌ ఫైల్‌

ఇంత కష్టంలోనూ పట్టించుకోని ప్రభుత్వం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 3720 మంది అధ్యాపకులకు గత ఆరు నెలలుగా జీతాలు అందటం లేదు. రెగ్యులర్‌ ఉద్యోగులు మాదిరిగా గ్రీన్‌ చానెల్‌లో పెట్టి నెలనెలా జీతాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి వాగ్దానం అమలునకు నోచుకోలేదు. దీంతో వారి కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా జూనియర్‌ కాలేజీలు మూతపడినప్పటి నుంచి వారి కుటుంబాలు ఆర్థిక సమస్యలతో రోడ్డున పడ్డాయి. అప్పులు దొరక్క, కుటుంబాలు పోషించుకోలేక, పిల్లల ఆన్‌లైన్‌ బోధనకు ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు, కాంట్రాక్టు లెక్చరర్లను రెన్యువల్‌ చేయాలని ఈ ఏడాది మార్చి 13నే ప్రభుత్వానికి ఇంటర్మీడియెట్‌ విద్యా కమిషనర్‌ లేఖ రాసినా ఇప్పటికీ సదరు ఫైల్‌ ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ లోనే మగ్గుతుండటం గమనార్హం. ఈ విద్యా సంవత్సరానికి 12 నెలల రెన్యువల్‌ ఎప్పటికైనా వస్తుందిలే అన్న ఉద్దేశంతో కరోనా కష్టకాలంలో కూడా అధికారులు ఆదేశించిన అన్ని విధులను కాంట్రాక్టు లెక్చరర్లు నిర్వర్తించారు.


అయితే, దీనిపై 12 నెలల రెన్యువల్‌పై అనేక కొర్రీలు  పెడుతూ గత ఐదు నెలలుగా కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వకుండా ప్రభుత్వం దోబూచులాడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూలై 13న సీఎం అధ్యక్షతన సీఎస్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో మన ప్రభుత్వమే కాంట్రాక్టు లెక్చరర్లకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌  ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ, ఈ టైమ్‌ స్కేలుకు (12 నెలలు) తిరిగి ప్రభుత్వమే మంగళం పలికింది. 9 నెలల 20 రోజులకే  జీతాలు  ఇవ్వాలనే పాత పద్ధతిని తెరమీదకు వచ్చింది. ఇది ఎంతవరకు సమంజసమని కాంట్రాక్టు లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధలను అర్థం చేసుకుని 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2021 మార్చి 31 వరకు రెన్యుల్‌ ఇవ్వాలని వారు కోరుతున్నారు. 


Updated Date - 2020-09-05T17:05:11+05:30 IST