ప్రాంతీయ భాషల్లోనూ పోటీ పరీక్షలు నిర్వహించండి.. కేంద్రానికి కేసీఆర్‌ లేఖ

ABN , First Publish Date - 2020-11-21T17:49:19+05:30 IST

కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోరారు.

ప్రాంతీయ భాషల్లోనూ పోటీ పరీక్షలు నిర్వహించండి.. కేంద్రానికి కేసీఆర్‌ లేఖ

రైల్వే, డిఫెన్స్‌, బ్యాంకు పరీక్షలన్నీ ఇంగ్లిషు, హిందీలోనే

హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్ర నష్టం

సమానావకాశాల ప్రాతిపదికన వీలు కల్పించాలి

ప్రధాని మోదీ, కేంద్ర ఐటీ శాఖ మంత్రికి సీఎం లేఖ


హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోరారు. ఈ మేరకు ప్రధానికి, కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు కేసీఆర్‌ శుక్రవారం లేఖలు రాశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వే, రక్షణ రంగం, జాతీయ బ్యాం కుల్లోని ఉద్యోగాల భర్తీకి  హిందీ, ఇంగ్లిషులోనే పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీంతో ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకోని వారు, హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులు  నష్టపోతున్నారని వివరించారు. అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రాతిపదికన పరీక్షలను నిర్వహించాలని కోరారు.   యూపీఎస్సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, తదితర నియామక సంస్థల పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని సీఎం కోరారు.


తెలుగు అభ్యర్థులకు మొదటి నుంచీ అన్యాయమే

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చేపడతున్న నియామకాల్లో తెలుగు అభ్యర్థులకు మొదటి నుంచీ అన్యాయమే జరుగుతోంది. ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నప్పటికీ కేంద్ర ఉద్యోగాలను ఆశించిన సంఖ్యలో పొందలేకపోతున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే  కాదు... దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులంతా నష్టపోతున్నారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల అభ్యర్థులతో పోటీ పడి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. కేంద్ర నియామక సంస్థలు హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే పోటీ పరీక్షలు నిర్వహిస్తుండటంతో హిందీ రాని తెలుగు అభ్యర్థులు, ఆంగ్ల మాధ్యమంలో చదువుకోని అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోంది. అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాలన్న సమాఖ్య విధానానికి ఇది విఘాతమన్న విమర్శలున్నాయి. అందుకే పోటీ పరీక్షల్లో ప్రాంతీయ భాషలను అనుమతించాలన్న డిమాండ్లు దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. అదే పరంపరలో సీఎం కేసీఆర్‌ తాజాగా ప్రధానికి లేఖ రాశారు. హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లోనే పోటీ పరీక్షలు నిర్వహించడం వల్ల దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులు 10 శాతానికి మించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు.


ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల యువత 40 శాతం ఉద్యోగాలను తన్నుకుపోతున్నారు. వీరికి హిందీ మాతృభాషగా ఉండటం, విద్యాభ్యాసం కూడా హిందీలోనే కొనసాగడంతో పోటీ పరీక్షల్లో సులభంగా నెట్టుకువస్తున్నారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ అభ్యర్థులు సైతం 50 శాతానికిపైగా ఉద్యోగాలను సాధించుకోగలుగుతున్నారు. 2013లో కేంద్రంలోని సెకండరీ విద్యా విభాగంలో 3034 పోస్టులకు పోటీ పరీక్ష నిర్వహిస్తే... ఉత్తరాదికి చెందిన అభ్యర్థులు 1,585 ఖాళీలను కైవసం చేసుకోగా, దక్షిణాది అభ్యర్థులకు 48 ఉద్యోగాలే లభించాయి. సెంట్రల్‌ రీజియన్‌ పరిధిలోకి వచ్చే  బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ అభ్యర్థులు 859 పోస్టులకు ఎంపికయ్యారు. 2016లో నిర్వహించిన ఇదే పరీక్షలో 6431 పోస్టులకుగాను నార్త్‌, సెంట్రల్‌ రీజియన్ల అభ్యర్థులు 4,522 పోస్టులకు ఎంపికయ్యారు. దక్షిణాది అభ్యర్థులకు 515 ఉద్యోగాలే లభించాయి. 


కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చినా..

తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో బ్యాంకు పోటీ పరీక్షలను నిర్వహిస్తామని 2019లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. అయినా అది కార్యరూపం దాల్చలేదు. 

Read more