బాసర ట్రిపుల్ ఐటీ సీట్లన్నీ ప్రభుత్వ విద్యార్థులకే
ABN , First Publish Date - 2020-10-21T16:13:13+05:30 IST
రాష్ట్రంలోని ఏకైక నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఈసారి అంతా ప్రభుత్వ విద్యార్థులే ఎంపికయ్యారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి

జాబితా విడుదల, ఈసారి ప్రవేశాలకు తీవ్ర పోటీ
బాసర, అక్టోబరు 20: రాష్ట్రంలోని ఏకైక నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఈసారి అంతా ప్రభుత్వ విద్యార్థులే ఎంపికయ్యారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. కరోనా కారణంగా ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించకుండానే మార్కుల ఆధారంగా వెల్లడించిన ఫలితాల్లో చాలా మంది విద్యార్థులు జీపీఏ 10/10 పొందారు. 1500 సీట్లకు 40,158 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా.. వారిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 23,331 మంది ఉన్నారు. మంగళవారం ప్రకటించిన 1193 మంది విద్యార్థుల జాబితాలో అందరూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలో చదివి జీపీఏ 10 వచ్చిన విద్యార్థులు ఒక్కరు కూడా ఎంపిక కాలేకపోయారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పదో తరగతిలో వచ్చిన జీపీఏకు అదనంగా 0.4 జీపీఏ కలపడంతో.. అంతా వారే ఎంపికయ్యారు. మంగళవారం బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో 2020-21 విద్యా సంవత్సరంలో ఎంపికైన విద్యార్థుల జాబితాను అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏవో) రాజేశ్వర్‌రావు విడుదల చేశారు. మొత్తం 1500 సీట్లలో 1193 సీట్లకు సంబంధించిన జాబితాను విడుదల చేయగా, మిగిలిన 307 సీట్లను ఆంధ్రప్రదేశ్, పీహెచ్, క్యాప్, స్పోర్ట్స్ కోటా కింద త్వరలోనే విడుదల చేస్తామని కళాశాల ఏవో తెలిపారు.కాగా, టిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులకు కరోనా కారణంగా రోజుకు 250 మంది చొప్పున ఐదు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సీరియల్ నంబర్ 1 నుంచి 250 వరకు నవంబరు 3న, 250 నుంచి 500 వరకు 4న, 501 నుంచి 750 వరకు 5న, 751 నుంచి 1000 వరకు 6న, 1001 నుంచి 1193 వరకు 7న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.